logo

Siddaramaiah: సిద్ధుకు ‘పుత్ర’ సంకటం

‘నాన్నా! ఎవరా వివేకానంద? మహదేవప్పకు ఇవ్వు.. మహదేవప్పా.. నేను చెప్పినవి కాకుండా ఏవేవో ఇస్తున్నావు. నేను ఇచ్చిన 4-5 వాటిని మాత్రమే చేయమని నాన్నకు చెప్పు’... అంటూ సంభాషణ ఓ సాధారణ తండ్రీ- కొడుకుల మధ్య జరిగి ఉంటే అంత చర్చకు వచ్చేది కాదేమో.

Updated : 17 Nov 2023 10:21 IST

యతీంద్ర వీడియోతో రాజకీయ వేడి

ఈనాడు, బెంగళూరు : ‘నాన్నా! ఎవరా వివేకానంద? మహదేవప్పకు ఇవ్వు.. మహదేవప్పా.. నేను చెప్పినవి కాకుండా ఏవేవో ఇస్తున్నావు. నేను ఇచ్చిన 4-5 వాటిని మాత్రమే చేయమని నాన్నకు చెప్పు’... అంటూ సంభాషణ ఓ సాధారణ తండ్రీ- కొడుకుల మధ్య జరిగి ఉంటే అంత చర్చకు వచ్చేది కాదేమో. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి కుమారుడు చేసిన ‘ఆదేశాల’ తరహా మాటలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌ సర్కారు ఏర్పాటైన నాటి నుంచి వినిపిస్తున్న బదిలీల దందా, కమీషన్ల ఆరోపణల మధ్య వెలుగు చూసిన వీడియో ఇది. కాంగ్రెస్‌ సర్కారుపై ఒంటికాలిపై లేస్తున్న జనతాదళ్‌ నేత కుమారస్వామి పదే పదే ‘వైఎస్‌టీ’ (యతీంద్ర సిద్ధరామయ్య పన్ను) వసూళ్ల ఆరోపణల నేపథ్యంలో ఈ సంభాషణ తాలూకూ వీడియో బయటకు రావటం ఇంతటి సంచలనానికి కేంద్రమైంది. ఈ వీడియో వెనుక వాస్తవం ఎంతుందో తెలియకున్నా.. కాంగ్రెస్‌ పాలనపై ఆరోపణలతో విరుచుకుపడే భాజపా, జేడీఎస్‌ మిత్ర ద్వయానికి ఇదో అస్త్రంగా మారింది. మరికొద్ది రోజుల్లో మొదలయ్యే శీతాకాల సమావేశాల్లో రచ్చ రేపే అంశాల్లో ఈ ‘ఆడియో-వీడియో’ కూడా వచ్చి చేరింది.

రాజీనామాకు డిమాండ్‌

ఇంత వరకు కుమారస్వామి చేస్తున్న ‘వైఎస్‌టీ’ ఆరోపణలకు వాస్తవ రూపమే ఈ వీడియో. ఓ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి కుమారుడికి అప్పగించిన అక్రమాల బాధ్యత వీధిన పడిందంటూ కుమారస్వామి ఆరోపించారు. యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వీఎస్‌టీ ట్యాక్స్‌ (విజయేంద్ర పన్ను) అంటూ ఆరోపించిన కాంగ్రెస్‌ ఇప్పుడేం జవాబిస్తుందంటూ ఆయన ప్రశ్నించారు. నేను గతంలో చేసిన ఆరోపణలను ఏమాత్రం ఖాతరు చేయని సిద్ధరామయ్య ఇప్పుడేమంటారు? అసలు యతీంద్ర ఫోను చేసిన వ్యక్తి ఎవరు? వివేకానంద ఎవరు? మహదేవకు ఫోను ఇమ్మంది ఎందుకు? యతీంద్ర సూచించిన ఆ జాబితా ఏమిటో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఇది బదిలీల దందా కాకపోతే ఇంకేమిటి? పాఠశాలల అభివృద్ధికి సీఎస్‌ఆర్‌ నిధుల గురించి చర్చించినట్లు ముఖ్యమంత్రి బదులివ్వటం చేసిన తప్పును కప్పిపుచ్చుకోవటమేనని ధ్వజమెత్తారు.

సీఎస్‌ఆర్‌ నిధుల విషయమే అయితే అందుకు విద్యాశాఖ అధికారులున్నారని కుమారస్వామి చెప్పారు. ఏఏ పాఠశాలకు ఎంత డబ్బు పంపాలో కుమారుడితో ముఖ్యమంత్రి చెప్పించారని తెలుస్తోందన్నారు. ఇదే అంశంపై భాజపా రాష్ట్రాధ్యక్షుడు విజయేంద్ర మాట్లాడుతూ కాంగ్రెస్‌ అవినీతి భాగోతం వీధి నాటకంలా మారిందన్నారు. వీరికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. యతీంద్ర వీడియోపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కాంగ్రెస్‌ పార్టీ బదులివ్వాలంటూ, అంత వరకు ముఖ్యమంత్రి బాధ్యతగా రాజీనామా చేయాలంటూ మాజీ మంత్రులు డాక్టర్‌ అశ్వత్థనారాయణ, అరగజ్ఞానేంద్ర డిమాండ్‌ చేశారు.

నేనెందుకు తప్పుకోవాలి?

‘దొంగే.. దొంగా.. దొంగా’ అని అరిచినట్లుందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర స్థాయిలో కుమారస్వామిని తప్పుపట్టారు. ఓ మాజీ ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసేందుకు నాకు ఇష్టం లేకున్నా తప్పటం లేదన్నారు. యతీంద్ర ఫోను సంభాషణకు వివరణ ఇచ్చినా ఇంకా కుమారస్వామి అదే పనిగా ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానంద అంటే వరుణ క్షేత్ర బీఈఓ. ఆ క్షేత్రంలోని ఐదు పాఠశాలల మరమ్మతులకు అవసరమైన సీఎస్‌ఆర్‌ నిధుల కోసమే ఈ చర్చ జరిగింది. వివేకానంద స్వయంగా ఆ పాఠశాలల జాబితాను నా కార్యాలయానికి పంపారు. వీటి గురించే నేను యతీంద్రతో మాట్లాడాను. పైగా యతీంద్ర ఆశ్రయ సమితి అధ్యక్షుడు.. కేడీపీ సభ్యుడు. ఈ వీడియోలో ఎక్కడైనా బదిలీ గురించి, డబ్బు గురించిన ప్రస్తావన ఉందా? అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ఓ మాజీ ప్రధాని కుమారుడై విద్యుత్తు చౌర్యానికి పాల్పడిన వ్యక్తి ఆరోపణలకు నేను జవాబివ్వనని తేల్చిచెప్పారు. నేను కుమారస్వామిపై కేసు నమోదు చేయాలని కూడా సూచించలేదన్నారు. అపద్ధాలు, మోసం, ద్రోహం చేసి అధికారంలోకి వచ్చిన సమయంలో అవినీతికి పాల్పడిన ఆయనకు అభివృద్ధి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah)కు కుమారస్వామి నుంచి నేర్చుకోవాల్సిన పని లేదన్నారు. యతీంద్ర ఓ బాధ్యతగల వ్యక్తని ప్రస్తుతించారు. తన సేవల్లో భాగంగానే తండ్రితో చర్చించారని తెలిపారు. అందులో ఎక్కడా బదిలీల విషయమే లేదన్నారు. గతంలో బదిలీల దందా నడిపిన కుమారస్వామి ఇంకా అదే ఆలోచనలో ఉన్నారంటూ బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు