logo

నాడు ఓడినా.. నేడు సత్తా చాటేదెలా?

రాష్ట్ర విధానసభకు పది నెలల కిందట నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలు.. నేడు లోక్‌సభ బరిలో సత్తాచాటే దిశగా అడుగులు వేస్తున్నారు.

Published : 26 Mar 2024 03:45 IST

విధానసభ మెట్లెక్కలేక లోక్‌సభపై నేతల దృష్టి

కె.సుధాకర్‌ , బి.శ్రీరాములు

ఈనాడు, బెంగళూరు : రాష్ట్ర విధానసభకు పది నెలల కిందట నిర్వహించిన ఎన్నికల్లో ఓటమి పాలైన కొందరు నేతలు.. నేడు లోక్‌సభ బరిలో సత్తాచాటే దిశగా అడుగులు వేస్తున్నారు. పోటీ చేయడానికి కీలక పార్టీల నుంచి వారికి మరో అవకాశం దక్కడమే దీనికి కారణం. ఎన్నికల ఫలితాల తర్వాత కొద్దిరోజుల పాటు కుంగిన పరాజితులు- ఓటమికి కారణాలపై విశ్లేషణ మొదలుపెట్టారు. ఓ ఎన్నికలో ఓడారంటే వారి విషయంలో స్థానికంగా వ్యతిరేకత ఉందనే అర్థం. ఆయా పార్టీలు అభ్యర్థుల ఓటమిని అంతగా పరిగణనలోకి తీసుకోకుండా మరో అవకాశం ఇచ్చాయి. గెలుపోటములపై విశ్లేషణ కంటే ఓటమితో కుంగిన నేతలు మరో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావించాయి. రాష్ట్ర, జాతీయ రాజకీయాల మధ్య ఉన్న వ్యత్యాసం, బలాలు, బలహీనతలను అంచనా వేసిన జాతీయ పార్టీలు తాజా లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన కొందిరిపై విశ్వాసాన్ని చూపాయి. పార్టీలకు చేసిన సేవలు, వారసత్వ బలం, గెలుపుపై ధీమా, సరైన అభ్యర్థి లేకపోవటం వంటి కారణాలతో ఈసారి ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ల నుంచి ఏడుగురు పరాజితులు టికెట్లు సాధించారు.

వి.సోమణ్ణ , జగదీశ్‌ శెట్టర్‌

విశ్వాసంతో ముందడుగు

గత విధానసభ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతారని అంచనా వేసినవారు ఓటమిపాలై అటు పార్టీకి, ఇటు అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు. వీరిలో శిరిసి నుంచి పోటీ చేసిన విశ్వేశ్వరహెగ్డే కాగేరి, బళ్లారి నుంచి బి.శ్రీరాములు, చిక్కబళ్లాపురలో బి.సుధాకర్‌ ప్రముఖులు. వీరెవరూ తమ ప్రత్యర్థుల చేతిలో ఓడిపోతారని అంచనా వేయలేదు. పార్టీల జెండాలతో సంబంధం లేకుండా వీరికున్న వ్యక్తిగత వర్చస్సుతో గెలిచితీరుతారనే భావించారు. వీరిలో డాక్టర్‌ కె.సుధాకర్‌ ఓటమి అనూహ్యం. రాజకీయాలకు ఏమాత్రం పరిచయం లేని ప్రదీప్‌ ఈశ్వర్‌ చేతిలో పదివేల ఓట్లతో ఓడిపోవటం భాజపాను నివ్వెరపరచింది. చామరాజనగర, వరుణ క్షేత్రాల నుంచి పోటీ చేసిన వి.సోమణ్ణ గెలుపు సత్తా ఉన్న అభ్యర్థే అయినా ఆయన సొంత స్థానం కాదని వేరే చోట పోటీ చేయటం, సిద్ధరామయ్య వంటి ప్రముఖ నేతతో ఢీకొనటంతో ఓటమి రుచి చూడాల్సి వచ్చింది. జగదీశ్‌ శెట్టర్‌ బలమైన నేతగా గుర్తింపు ఉన్న వారే. ఆయన అనూహ్యంగా కాంగ్రెస్‌లో చేరటంతో గెలుపు అవకాశాలను చేతులారా కోల్పోయారు. వీరిలో విశ్వేశ్వరహెగ్డే కాగేరి స్పీకర్‌గా ఉండి కూడా ఓడిపోగా.. బి.శ్రీరాములు, కె.సుధాకర్‌, వి.సోమణ్ణ.. మంత్రులుగా ఉండి ఓడిపోక తప్పలేదు. జగదీశ్‌ శెట్టర్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన నేత. ఈసారి ఓటమి నుంచి తప్పించుకోలేకపోయారు. కాంగ్రెస్‌ నుంచి అప్పటికే సిట్టింగ్‌లుగా ఉన్న సౌమ్యారెడ్డి జయనగర నుంచి కేవలం 16 ఓట్లతో, ఖానాపుర ఎమ్మెల్యేగా ఉండి అంజలి నింబాళ్కర్‌ 54,629 ఓట్లతో ఓటమి పాలయ్యారు. వీరి ఓటమి అనూహ్యమే తప్ప సత్తాలేక మాత్రం కాదని సమీక్షించిన పార్టీలు వీరికి మరో అవకాశాన్ని ఇచ్చాయి.

విశ్వేశ్వరహెగ్డే కాగేరి , సౌమ్యారెడ్డి , అంజలి నింబాళ్కర్‌

గెలుపు సవాలు..

విధానసభ ఎన్నికల్లో ఓటమితో స్థానికంగా ఎదురైన అవమానాలు, ఎదురైన విమర్శలకు బదులివ్వాలని కొందరు పట్టుబట్టి మరీ లోక్‌సభ సీటు సాధించగా, మరికొందరు పార్టీ సూచన మేరకు టికెట్‌ సాధించారు. డాక్టర్‌ కె.సుధాకర్‌ స్థానికంగా యలహంక ఎమ్మెల్యే విశ్వనాథ్‌ నుంచి, వి.సోమణ్ణ మాజీ మంత్రి మాధుస్వామి నుంచి గట్టి పోటీ ఎదురైనా అధిష్ఠానంతో పోరాడి టికెట్‌ సాధించారు. బెళగావిలో టికెట్‌ సాధించిన జగదీశ్‌ శెట్టర్‌ కోరుకున్న స్థానంలో టికెట్‌ దక్కకున్నా చివరి ప్రయత్నంగా కుందానగరికి పయనమయ్యారు. బి.శ్రీరాములు, విశ్వేశ్వరహెగ్డే కాగేరీ సులువుగా టికెట్లు సాధించారు. వీరిలో ఒక్క బి.శ్రీరాములు మినహా మిగిలిన వారికి సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురవటంతో కొత్త వేదికపై గెలుపు అంత సులువుగా కాదన్న విశ్లేషణలు మొదలయ్యాయి. బెంగళూరు దక్షిణ టికెట్‌ సాధించిన సౌమ్యారెడ్డి తండ్రి రామలింగారెడ్డి అండతో, ఉత్తరకన్నడ నుంచి టికెట్‌ సాధించిన అంజలి నింబాళ్కర్‌ పార్టీ కీలక నేతల సాయంతో పార్లమెంట్‌లో అడుగు పెట్టే అవకాశాలను అందుకుంటున్నా.. ఫలితం ఎలా ఉంటుందో వేచిచూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు