logo

బరిలోకి దూకి బస్తీమే సవాల్‌

లోక్‌సభ ఎన్నికల ఘట్టం పతాక స్థాయికి చేరువవుతోంది. రాష్ట్రంలో- మే ఏడో తేదీ నిర్వహించే రెండో దశ ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియ వేగవంతమైంది.

Published : 16 Apr 2024 01:16 IST

నామినేషన్‌ దాఖలకు నేతల దండు

బెంగళూరు (సదాశివనగర), న్యూస్‌టుడే : లోక్‌సభ ఎన్నికల ఘట్టం పతాక స్థాయికి చేరువవుతోంది. రాష్ట్రంలో- మే ఏడో తేదీ నిర్వహించే రెండో దశ ఎన్నికలకు నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియ వేగవంతమైంది. కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ జోషి (ధార్వాడ), భగవంత్‌ ఖూబా (బీదర్‌), మాజీ ముఖ్యమంత్రులు జగదీశ్‌ కుమార్‌, బసవరాజ బొమ్మై, నటుడు శివరాజ్‌ కుమార్‌ భార్య గీత, మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ కుమారుడు మృణాల్‌ తదితరులు సోమవారం నామినేషన్లను దాఖలు చేసిన వారిలో ఉన్నారు. ఆయా ఎన్నికల కమిషనర్‌ కార్యాలయాల్లో నామినేషన్లను దాఖలు చేసేందుకు ముందుగా తమ పార్టీల కార్యకర్తలతో నేతలు ఊరేగారు. ధార్వాడలో ప్రహ్లాద్‌ జోషితో కలిసి యడియూరప్ప, భైరతి బసవరాజ్‌, అరవింద్‌ బెల్లద్‌, సీటీ రవి తదితర నేతలు ఊరేగింపులో పాల్గొన్నారు. ధార్వాడ నుంచి జోషిపై తాను పోటీ నుంచి తప్పుకోనంటూ ఆధ్యాత్మికవేత్త దింగాలేశ్వర స్వామి ఇప్పటికే ప్రకటించారు.

దీంతో భాజపా నేతలు శక్తి ప్రదర్శన అన్నట్లు భారీ స్థాయిలో కార్యకర్తలను తరలించారు. బసవరాజ బొమ్మై తన తల్లిదండ్రుల విగ్రహాలకు నమస్కరించుకుని, హావేరి జిల్లాధికారి కార్యాలయానికి చేరుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప, మాజీ మంత్రి బీసీ పాటిల్‌ సహకారంతో నామినేషన్‌ వేశారు. బెళగావిలో మాజీ ముఖ్యమంత్రి జగదీశ్‌ శెట్టర్‌ (భాజపా) నామినేషన్‌ వేయగా.. లోక్‌సభ సభ్యురాలు మంగళ అంగడి, ఎమ్మెల్యేలు రమేశ్‌ జార్ఖిహొళి, హనుమంత నిరాణి, మాజీ ఎమ్మెల్యే అనిల్‌ బెనక ఆయనకు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ కుమారుడు మృణాల్‌ నామినేషన్‌ వేసేందుకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, స్థానిక కాంగ్రెస్‌ నేతలు సహకారాన్ని అందించారు. శివమొగ్గలో కాంగ్రెస్‌ అభ్యర్థి గీత తన భర్త శివరాజ్‌ కుమార్‌, మంత్రి మధు బంగారప్ప, ఎమ్మెల్యే బేలూరు గోపాలకృష్ణ, పీసీసీ నాయకుడు మంజునాథ్‌ తదితరులతో కలిసి వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇప్పటికే ఒక సెట్‌ నామినేషన్‌ వేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప ఎన్నికల అధికారి గురుదత్‌ హెగ్డేకు మరో సెట్‌ పత్రాలు అందించారు. రెండో దశ ఎన్నికలకు 19 వరకు నామినేషన్లను దాఖలు చేసేందుకు వీలుంది. 20న వాటిని పరిశీలన, 11న వాటిని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. మే 7న పోలింగ్‌, జూన్‌ 4న ఫలితాలు ఉంటాయి. శివమొగ్గ, దావణగెరె, హావేరి, ధార్వాడ, బెళగావి, చిక్కోడి, ఉత్తర కన్నడ, బళ్లారి, రాయచూరు, కొప్పళ, బాగలకోటె, విజయపుర, బీదర్‌, కలబురగి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు ఉంటాయి.


ఆయన పనే అది..

బెళగావి: ఆధారరహిత ఆరోపణలు చేసి, గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నించడం మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామికి మొదటి నుంచి అలవాటేనని పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఆరోపించారు. హిట్‌ అండ్‌ రన్‌ అనగానే ఆయనే గుర్తుకు వస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మహిళలను అవమానిస్తూ కుమారస్వామి చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. ఆ మాటలకు విషాదాన్ని వ్యక్తం చేస్తున్నానంటూ కుమార చేసిన ప్రకటనతో మాకు సంబంధం లేదన్నారు. బెళగావిలో సోమవారం డీకే విలేకరులతో మాట్లాడుతూ, గ్యారంటీ పథకాలతో గ్రామీణ మహిళలు, యువతులు దారి తప్పారంటూ వ్యాఖ్యలు చేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని గుర్తు చేశారు. మహిళలే ముందుకు వచ్చి అన్ని గ్రామాలు, తాలూకా, జిల్లా స్థాయిలో ఆందోళనకు దిగుతున్నారని చెప్పారు. వారందరికీ పీసీసీ మద్దతుగా నిలుస్తుందని స్పష్టం చేశారు.


స్వామీజీతో మాట్లాడతా..

హుబ్బళ్లి: ధార్వాడ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయవద్దని ఆధ్యాత్మికవేత్త దింగాలేశ్వర స్వామిని కోరతానని మాజీ ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తెలిపారు. హుబ్బళ్లి విమానాశ్రయంలో తనను కలుసుకున్న విలేకరులతో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం ప్రజలు జోషికి మద్దతుగా ఉన్నారని, ఓట్లు చీల్చవద్దని మఠాధిపతిని కోరతానని చెప్పారు. మఠాధిపతి మనసు మార్చుకుంటారన్న నమ్మకం తనకు ఉందన్నారు.


నలుగురికి గాయాలు

శివమొగ్గ, న్యూస్‌టుడే : శివమొగ్గ కాంగ్రెస్‌ అభ్యర్థి గీతా శివరాజ్‌ కుమార్‌కు మద్దతుగా సోమవారం ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఎల్‌ఈడీ డిస్‌ప్లే బోర్డు ఒక్కసారిగా కిందకు జారి పడింది. ఒక మహిళతో పాటు నలుగురు కార్యకర్తలు గాయపడ్డారు.


సంజయ్‌పాటిల్‌కు సెగ..

బెళగావి, న్యూస్‌టుడే : భాజపా మాజీ ఎమ్మెల్యే సంజయ్‌ పాటిల్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు బెళగావిలో ధర్నాకు దిగారు. ఆయన చిత్రపటం ముందు చీర, పూలు, గాజులు, బొట్టు ఉంచి- ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌ను అవహేళన చేస్తూ ‘ఎక్స్‌ట్రా పెగ్‌’ అంటూ పాటిల్‌ గత వారం వ్యాఖ్యలు చేయడమే ఈ ఆందోళనకు కారణం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని