logo

ప్రజాధనాన్ని దోచి పెడుతున్న మోదీ

భారత రాజ్యాంగానికి భాజపా ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని, మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి లబ్ధిపొందేందుకు చూస్తోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.

Published : 27 Jan 2023 02:47 IST

హథ్‌ సే హాథ్‌ జోడో యాత్రలో మల్లు భట్టివిక్రమార్క

మామునూరులో కూలీలతో మాట్లాడుతున్న భట్టివిక్రమార్క

ఎర్రుపాలెం, న్యూస్‌టుడే: భారత రాజ్యాంగానికి భాజపా ప్రభుత్వం తూట్లుపొడుస్తోందని, మతం పేరిట విభజన రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు పెంచి లబ్ధిపొందేందుకు చూస్తోందని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు. మధిర నియోజకవర్గ పరిధిలోని ఎర్రుపాలెం మండలం మామునూరు గ్రామంలో గురువారం హాథ్‌ సే హాథ్‌ జోడో యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర ఉద్దేశాన్ని, భాజపా మతోన్మాదంతో వ్యవహరిస్తోందని వివరించారు. దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఈ దేశ పౌరులేనని అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నారు. లౌకికవాదాన్ని పక్కనపెట్టిన మోదీ ప్రభుత్వం మతం పేరిట ప్రజలను విడగొట్టి రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. దేశ సంపదను మోదీ తన స్నేహితులైన అంబానీ, అదానీలకు ధారాదత్తం చేస్తున్నారని, ఎనిమిదేళ్లలో వాళ్లు రూ.లక్షల కోట్లు సంపాదించారన్నారు. మిరపతోటలో కూలీలతో భట్టి మాట్లాడారు. గ్యాస్‌, నిత్యావసర ధరలు పెరిగాయని, ఇళ్లు లేవని కూలీలు భట్టికి విన్నవించగా, సమస్యలపై శాసనసభలో మాట్లాడతానన్నారు. గతంలో చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌లో వచ్చిన ప్రతి దరఖాస్తును ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అనంతరం మామునూరు గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఎస్‌.మోహన్‌రావు, ఎస్‌.ప్రతాప్‌రెడ్డి, బి.నరసింహారావు, టి.నాగిరెడ్డి, ఏవీ.కృష్ణారావు, బి.గోవర్ధన్‌రెడ్డి, కె.శ్రీనివాసరావు, ఎస్‌.శ్రీనివాసరెడ్డి, ఎం.లక్ష్మణ్‌రావు, జానీభాషా, ప్రవల్లిక, డి.శ్రీనివాస్‌, రాజీవ్‌గాంధీ, బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని