logo

Khammam: తండ్రితో కలిసి అన్నను హత్య చేసిన తమ్ముడు

డబ్బు విషయంలో కొద్ది రోజుల క్రితం తలెత్తిన వివాదం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది.

Updated : 13 Oct 2023 08:28 IST

రాజేశ్‌

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: డబ్బు విషయంలో కొద్ది రోజుల క్రితం తలెత్తిన వివాదం ఓ వ్యక్తి దారుణ హత్యకు దారితీసింది. తండ్రితో కలిసి సొంత తమ్ముడే అతణ్ని హతమార్చాడు. ఈ ఘటన మండల పరిధిలోని వెంకటగిరి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాలపొంగు రామారావు, గంగమ్మ దంపతులకు రాజేశ్‌(27), నవీన్‌ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజేశ్‌ తాపీపని, నవీన్‌ పెయింటింగ్‌ పనులు చేస్తూ జీవిస్తున్నారు.. ఇద్దరికీ వివాహాలు కాలేదు. అందరూ కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అన్నదమ్ములు మద్యం తాగి ఆ మత్తులో తరచూ ఘర్షణ పడుతుండేవారు. ఇటీవల ఇంటి బేస్‌మెంట్‌ నిర్మాణం కోసం చిన్న కుమారుడు నవీన్‌ డబ్బులు వెచ్చించటంతో తల్లిదండ్రులు తాము పొదుపు చేసుకున్న సొమ్ములోంచి రూ.50 వేలు అతనికి ఇచ్చారు. విషయం తెలిసిన రాజేశ్‌ తనకూ డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులతో తరచూ ఘర్షణ పడుతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి (తెల్లవారితో గురువారం) ఒంటిగంట సమయంలో ఇంటి ఎదుట నిల్చుని రాజేశ్‌ పెద్దగా కేకలు వేస్తుండటంతో అతణ్ని పట్టుకునేందుకు తండ్రి ప్రయత్నించాడు. ఈ క్రమంలో రాజేశ్‌ తన తండ్రిపై చేయిచేసుకున్నాడు. అది చూసిన నవీన్‌ అక్కడే ఉన్న బీరు సీసాను పగులగొట్టి ఆ సీసాతో తన అన్నపై దాడికి ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో రాజేశ్‌ను తండ్రి గట్టిగా పట్టుకోగా నవీన్‌ పగులగొట్టిన బీరు సీసాతో రాజేశ్‌ మెడపై పొడిచాడు. తీవ్ర గాయాలపాలైన బాధితుణ్ని చికిత్స నిమిత్తం 108లో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెందాడు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పథకం ప్రకారమే తండ్రీకొడుకు హత్యకు పాల్పడినట్టు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటకృష్ణ తెలిపారు. హత్యకు పాల్పడిన నవీన్‌, ఏడాది క్రితం ఖమ్మం కమాన్‌బజార్‌లో ఓ వృద్ధురాలి మెడలోంచి గొలుసు అపహరించిన ఘటనలో నిందితుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని