logo

అయ్యో రామా.. ప్రచారంలో అలసత్వమా?

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.

Published : 08 Apr 2024 08:53 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. అన్ని రకాల సెక్టార్లలో 35 వేల మంది కూర్చొనే వీలుండగా.. ఆయా టికెట్ల విక్రయం మందకొడిగా సాగుతోంది. ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఈపాటికే విశేష స్పందన రావాల్సి ఉన్నా తక్కువ సంఖ్యలోనే టికెట్ల విక్రయాలు సాగుతున్నాయి. ప్రచార లోపమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 17న శ్రీరామ నవమి, 18న పట్టాభిషేకం మహోత్సవాలకు వీవీఐపీ, వీఐపీ సెక్టార్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన టికెట్లు ఎక్కడ ఇస్తారో అధికారింగా వెల్లడించాల్సి ఉంది. ఇలాంటి అంశాల్లో గోప్యత పాటిస్తే తగు సమాచారం భక్తులకు చేరదు. అంతిమంగా నష్టం జరిగేది స్వామివారి ఖజానాకే అని గుర్తించాలి.

  • రూట్‌ మ్యాప్‌ ఉండాలి: ఆహ్వాన పత్రికల్లో ప్రకటించిన ప్రకారం 9న ఉగాదితో బ్రహ్మోత్సవాలను ఆరంభించి 23 వరకు కొనసాగిస్తారు. ఇందులో 10 నుంచి 12 వరకు నిర్వహించే ఉత్సవాలను గత ఏడాది తరహాలో అట్టహాసంగా చేయాలని నిర్ణయించినందున ఈ వివరాలను ప్రకటించాల్సి ఉంది. పార్కింగ్‌ ప్రదేశాలు, వైద్య శిబిరాలు, ప్రసాదాలు-తలంబ్రాల కౌంటర్లు, చలివేంద్రాలు, హోటళ్లలోని ఆహార పదార్థాల ధరలు, ఆర్టీసీ-రైల్వే సేవలు, వసతి, అన్నదానం, మరుగుదొడ్లు, కంట్రోల్‌ రూం వంటి వాటి సమాచారాన్ని మ్యాప్‌ ద్వారా ముందుగానే వెల్లడించడం వల్ల రూట్‌ మ్యాప్‌పై స్పష్టత వస్తుంది.
  • కల్యాణ మండపం సెక్టార్‌ మ్యాప్‌ను వెల్లడించాలి. ప్రధాన ఉత్సవాలు సమీపించిన తర్వాత హడావుడిగా రూట్‌ మ్యాప్‌ ఇవ్వడం వల్ల కొత్తగా వచ్చేవారు ఆలయానికి ఏ దారిలో సులువుగా చేరాలో తికమక పడుతుంటారు. గోదావరి వద్ద ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి కాకుంటే వేసవిలో జరిగే ఈ ఉత్సవానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు ఉంటాయని గుర్తించాలి. చలువ పందిరి నిర్మాణాలను పెంచాల్సి ఉంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని