logo

గుళికల మందు మింగి బలవన్మరణం

గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్‌ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది

Published : 19 Apr 2024 02:45 IST

అశ్వారావుపేట గ్రామీణం, న్యూస్‌టుడే: గుళికల మందు మింగి ఒకరు బలవన్మరణానికి పాల్పడిన ఘటన అశ్వారావుపేటలో చోటు చేసుకుంది. హెడ్‌కానిస్టేబుల్‌ నాగేశ్వరరావు కథనం ప్రకారం.. అశ్వారావవుపేట కోతమిషన్‌ బజారులో కూలీ పనులు చేస్తూ జీవించే బమ్మిడి సాంబయ్య(62)కు పదిహేనేళ్ల కిందట కడుపు పైభాగంలో కణితి ఏర్పడింది. పలు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయింది. ఇటీవల దాని బాధ తీవ్రం కావడంతో భరించలేక బుధవారం అర్ధరాత్రి ఇంట్లోని విషగుళికలు మింగాడు. గమనించిన కుటుంబీకులు కొత్తగూడెం ఆసుపత్రికి తరలించగా వైద్యం పొందుతూ గురువారం మధ్యాహ్నం మృతిచెందాడు. మృతుడి కుమార్తె భారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు.


చెల్లని చెక్కు కేసులో ఆరు నెలల జైలు

 భద్రాచలం, న్యూస్‌టుడే: చెక్‌ బౌన్స్‌ కేసులో ఒకరికి భద్రాచలం కోర్టులో ఆరు నెలల జైలుశిక్ష విధించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాకకు చెందిన వరకా శ్రీనివాస్‌ భద్రాచలానికి చెందిన లింగమర్ల శ్రీనివాసరావు వద్ద 2016 జనవరిలో రూ.4 లక్షలు అప్పు తీసుకున్నారు. హామీగా చెక్కు ఇచ్చారు. గడువు తీరినా అప్పు చెల్లించలేదు. చెక్‌ను బ్యాంకులో సమర్పిస్తే బౌన్స్‌ అయింది. లింగమర్ల శ్రీనివాసరావు.. న్యాయవాదులు పడవల శ్రీనివాస్‌, పామరాజు తిరుమలరావు ద్వారా 2016లో భద్రాచలం జుడీషియల్‌ మొదటిశ్రేణి కోర్టులో కేసు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మెజిస్ట్రేట్‌ సూరిరెడ్డి నిందితుడైన వరకా శ్రీనివాస్‌కు ఆరునెలల జైలు శిక్ష, రూ.4 లక్షల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. డబ్బు చెల్లించకపోతే అదనంగా మరో నెల శిక్ష ఉంటుందని తీర్పులో ప్రస్తావించారు.


అగ్నికీలల్లో సింగరేణి కేబుల్‌..  

కొత్తగూడెం సింగరేణి: సింగరేణి కొత్తగూడెం ఏరియా జీఎం కార్యాలయం వద్దనున్న గుట్టపై బుధవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకొంది. విజయవాడ ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ అటవీప్రాంతంలో అగ్నికీలలు వ్యాపించి సంస్థ ఐటీ అండర్‌గ్రౌండ్‌ కేబుల్‌ దగ్ధమైంది. దీంతో ఏరియా కార్యాలయంలో ఆన్‌లైన్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. యాజమాన్యం కేబుల్‌ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టింది. పనులు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉంది.


ఆరు కిలోల గంజాయి పట్టివేత

ముదిగొండ, న్యూస్‌టుడే: ఆరు కిలోల గంజాయిని పోలీసులు గురువారం పట్టుకున్నారు. ఖమ్మం గ్రామీణం సీఐ రాజిరెడ్డి తెలిపిన ప్రకారం.. ముదిగొండలో ఎస్‌ఐ నరేశ్‌, సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేపట్టారు. ఏడుగురు వ్యక్తులు రెండు బస్తా సంచుల్ని రెండు ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్తుండగా ఆపారు. బస్తా సంచుల్లో గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. సువర్ణాపురానికి చెందిన కొట్టె మధు, తోట నవీన్‌, ఖమ్మం ధంసలాపురం కాలనీకి చెందిన తోట వినయ్‌కుమార్‌, కారేపల్లికి చెందిన ఖాజామొహినుద్దీన్‌, ముగ్గురు మైనర్లు పట్టుబడినట్టు సీఐ వివరించారు. ఆరు కిలోల గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్‌ఫోన్‌లు స్వాధీనపరచుకున్నామన్నారు. ఎస్‌ఐ నరేశ్‌, ఏఎస్‌ఐలు సాంబశివరావు, గురునాథం, హెడ్‌ కానిస్టేబుల్‌ భాస్కర్‌రావు, కానిస్టేబుళ్లు వెంకన్న, కోటేశ్వరరావు, అంజయ్య, గోపిని సీపీ ప్రశంసించినట్లు సీఐ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని