logo

ఎన్టీఆర్‌ పేరు కృష్ణాకే సముచితం

రాజకీయ చైతన్యం ఉన్న కృష్ణా జిల్లాకు నామకరణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య సినీ నటుడు, కృష్ణా జిల్లా వాసి అయిన నందమూరి తారకరామారావు పేరును విజయవాడ జిల్లాకు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాకు ఆయన పేరు

Published : 27 Jan 2022 02:32 IST

ఈనాడు, అమరావతి రాజకీయ చైతన్యం ఉన్న కృష్ణా జిల్లాకు నామకరణంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి, ఆంధ్రుల ఆరాధ్య సినీ నటుడు, కృష్ణా జిల్లా వాసి అయిన నందమూరి తారకరామారావు పేరును విజయవాడ జిల్లాకు పెట్టడంపై విమర్శలు వస్తున్నాయి. కృష్ణా జిల్లాకు ఆయన పేరు పెట్టడం సముచితమనే భావన వ్యక్తమవుతోంది. గెజిట్‌లో ప్రకటించిన విధంగా కొన్ని గ్రామాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జిల్లాల విభజన జరిగిన విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా మూడు ముక్కలుగా మారింది. రెండు నియోజకవర్గాలు ఏలూరు జిల్లాలోకి వెళ్లగా మచిలీపట్నం లోక్‌సభను ఒక జిల్లాగా, విజయవాడ లోక్‌సభను ఒక జిల్లాగా ప్రకటించి గెజిట్‌ విడుదల చేశారు. నూజివీడు అసెంబ్లీ సెగ్మెంట్‌ పూర్తిగా ఏలూరు జిల్లాలోకి వెళ్లగా.. గుడివాడ రెవెన్యూ డివిజన్‌ పరిధి పెరిగింది. మచిలీపట్నం డివిజన్‌ యథాతథంగా ఉంది. విజయవాడ డివిజన్‌ స్వరూపం మారింది. కొత్తగా నందిగామ, తిరువూరు రెవెన్యూ డివిజన్లు ఏర్పడుతున్నాయి. దాదాపు గెజిట్‌లో ప్రకటించినట్లు ఖరారు కానున్నాయని అధికారి ఒకరు వెల్లడించారు. మచిలీపట్నం కేంద్రంగా ఏర్పడే జిల్లాకు కృష్ణాగా, విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జిల్లాకు మహానటుడు ఎన్టీఆర్‌ పేరును ప్రతిపాదించారు. ఈ గెజిట్‌పై ప్రజలు తమ అభ్యంతరాలను 30 రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు నివేదించే అవకాశం ఉంది. కొన్ని వర్గాలు, కొంత మంది నేతలు మార్పులు చేయాలని కోరుకుంటున్నారు. కొత్తగా నందిగామ, తిరువూరు డివిజన్లు ఏర్పాటు చేయడం పట్ల ఆ ప్రాంత వాసుల్లో హర్షం వ్యక్తమవుతోంది. దశాబ్దాలుగా దూరంగా ఉన్న మచిలీపట్నం కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇక నుంచి దూరాభారం తగ్గనుంది.

ఎంతకాలానికి..?

చాలా రోజుల నుంచి కృష్ణా జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలని ప్రతిపాదనలు ఉన్నాయి. దీన్ని వాయిదా వేస్తూ వచ్చారు. కడప జిల్లాకు వైఎస్సార్‌ పేరు పెట్టారు. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలో నిమ్మకూరు గ్రామంలో ఎన్టీఆర్‌ జన్మించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ పేరు ప్రతిపాదించారు. ప్రస్తుతం జిల్లాల పునర్విభజనలో విభజిత జిల్లాకు ఆయన పేరు పెట్టారు. కానీ వాస్తవంగా మచిలీపట్నం కేంద్రంగా ఉండే కృష్ణా జిల్లాలోనే ఆయన పుట్టిన ఊరు ఉంది. గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహించిన నేపథ్యం ఉంది. దీనికి ఎన్టీఆర్‌ పేరు పెట్టాలనే ప్రతిపాదన వస్తోంది. దీనిపై తాము కలెక్టర్‌కు విన్నవిస్తామని తెదేపా మాజీ ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. పశ్చిమ కృష్ణా జిల్లా వాసులు కూడా తమ జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టడం గర్వకారణమని చెబుతున్నారు. ఆయన పేరు ఉంచాలని కోరుతున్నారు. మరికొంత మంది ఇతరుల పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఎన్టీఆర్‌ పేరు విషయంలో మార్పులు జరుగుతాయా లేదా అనేది ఆసక్తికరంగా ఉంది.

ఈ గ్రామాలపై స్పష్టత ఏదీ..?

గెజిట్‌ ప్రకారం గన్నవరం నియోజకవర్గం పూర్తిగా మచిలీపట్నం జిల్లాలోకి వెళ్తుంది. దీని పరిధిలోని మండలాలు గుడివాడ నియోజకవర్గానికి వెళ్లాయి. విజయవాడ గ్రామీణ మండలం విజయవాడ జిల్లాలో ఉంటుంది. గ్రామీణ మండలం పరిధిలోని కొన్ని గ్రామాలు గన్నవరం నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. అవి మచిలీపట్నం జిల్లా పరిధిలోకి వస్తాయి. రెవెన్యూ డివిజను మాత్రం విజయవాడగా ఉంది. దీనిపై స్పష్టత ఇవ్వలేదు. గూడవల్లి, నిడమానూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు, నున్న, పాతపాడు గ్రామాలు మచిలీపట్నం జిల్లాలో ఉన్నాయి. డివిజన్‌ ప్రకారం విజయవాడ గ్రామీణ మండలం కిందనే ఉంచారు. వీటిని గన్నవరం మండలం పరిధిలోకి కానీ, కొత్త మండలాన్ని కానీ ఏర్పాటు చేయాల్సి ఉందని, మార్పులు ఉంటాయని ఓ అధికారి చెప్పారు.

స్పష్టత తీసుకుంటాం!

లోక్‌సభ నియోజకవర్గాల వారీగా భౌగోళిక సరిహద్దులు నిర్ణయించారు. దీని వల్ల విజయవాడ గ్రామీణంలోని గ్రామాలు మచిలీపట్నం జిల్లాలోకి వస్తాయి. వీటిపై త్వరలో స్పష్టత వస్తుంది. - వల్లభనేని వంశీ, ఎమ్మెల్యే, గన్నవరం

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకోవాలి!

అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుని అధ్యయనం చేయాల్సింది. కేవలం లోక్‌సభ ప్రాతిపదికన ప్రకటించారు. ఉద్యోగుల ఆందోళన, పీఆర్‌సీ ఇతర సమస్యల నుంచి ప్రజల ఆలోచన పక్కదారి పట్టించే ఉద్ధేశం ఇది.

- బచ్చుల అర్జునుడు, ఎమ్మెల్సీ (తెదేపా)

పక్కనే ఉన్నా..!

విజయవాడ నగరంలో ఉన్నట్లే భావిస్తున్న పెనమలూరు నియోజకవర్గం వాసులను కృష్ణా జిల్లాలో కలపడం జీర్ణించుకోలేకపోతున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రతిపాదించినా.. కొన్ని మార్పులు చేసినట్లే.. పెనమలూరు, గన్నవరం చేసి ఉండాల్సిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. విజయవాడ నగరపాలక సంస్థను ఆనుకొని వైఎస్సార్‌ తాడిగడప మున్సిపాలిటీ ఉంది. ఈ పురపాలక సంఘం పరిధిలోని కానూరు, యనమలకుదురు, తాడిగడప, పోరంకి కాలనీలు నగరంలోనే ఉన్నట్లుగా భావిస్తారు. వీరికి విజయవాడతో అనుబంధం ఎక్కువ. ఇక నుంచి బందరుకే వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పాటు రామవరప్పాడు, ఎనికేపాడు, ప్రసాదంపాడు గ్రామ పంచాయతీల పరిస్థితి అదే విధంగా ఉంది. ముందు నుంచి వీరిని విజయవాడలో కలపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. గ్రేటర్‌ విజయవాడ ఏర్పాటు కావాల్సింది. దానికి చెక్‌ పడింది.

పరిపాలన సౌలభ్యం కోసమే..!

పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరిగింది. పెనమలూరు విజయవాడకు సమీపంలో ఉన్నా లోక్‌సభ నియోజకవర్గాల ప్రాతిపదికన జరిగింది. దీన్ని స్వాగతిస్తున్నాం. - కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే పెనమలూరు

కృష్ణా జిల్లాకే ఎన్టీఆర్‌!

ఏ ప్రాతిపదికన చూసినా బందరు కేంద్రంగా ఏర్పడే కృష్ణా జిల్లాకే ఎన్టీఆర్‌ పేరు పెట్టాలి. ఇదే సముచితం. కృష్ణానది పారే విజయవాడకు కృష్ణా జిల్లా పేరు ఖరారు చేయవచ్ఛు దీనిపై కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తాం. పెనమలూరు విజయవాడ పరిధిలోకి చేర్చాలనే డిమాండ్‌ ఈ ప్రాంత ప్రజల్లో ఉంది.

- బోడె ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్యే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని