logo

జిల్లా ఆసుపత్రిలో... ఉంచుతారా.. పంపిస్తారా?

నంద్యాల జిల్లా ఆసుపత్రిని.. వైద్య కళాశాల, జనరల్‌ ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. జనరల్‌ ఆసుపత్రి, వైద్య కళాశాలకు సూపరింటెండెంట్‌, ప్రిన్సిపల్‌ను నియమించింది. భవన నిర్మాణంపై సందిగ్ధం ఉన్నా 2023 నాటికి వైద్య కళాశాలను

Published : 03 Jul 2022 02:10 IST

జనరల్‌ ఆసుపత్రి జీవోతో ఉద్యోగుల్లో కలవరం

నంద్యాల పాతపట్టణం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా ఆసుపత్రిని.. వైద్య కళాశాల, జనరల్‌ ఆసుపత్రిగా మారుస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసింది. జనరల్‌ ఆసుపత్రి, వైద్య కళాశాలకు సూపరింటెండెంట్‌, ప్రిన్సిపల్‌ను నియమించింది. భవన నిర్మాణంపై సందిగ్ధం ఉన్నా 2023 నాటికి వైద్య కళాశాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఇంత వరకు బాగానే ఉన్నా సిబ్బంది విషయంలో స్పష్టత కొరవడటంతో ప్రస్తుతం ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తమ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదని ఆసుపత్రి వైద్యులు, నర్సులు, సిబ్బంది ఆవేదన చెందుతున్నారు.

222 పోస్టులు మంజూరు

నంద్యాల మెడికల్‌ కళాశాలకు 222 పోస్టులు కేటాయించారు. వీటిలో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, సీనియర్‌ రెసిడెంట్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ల్యాబ్‌ జూనియర్‌ అసిస్టెంట్‌, స్టోర్‌ కీపర్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, మార్చురీ సహాయకులు, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంపీహెచ్‌ఏ, ఎంపీహెచ్‌యూవో తదితర పోస్టులు ఉన్నాయి.

నంద్యాల ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి 484 పోస్టులు కేటాయించారు. ఏడీ, ఎఫ్‌వో, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సిబ్బంది, సీఐఎస్‌, ఎన్‌ఎస్‌ గ్రేడ్‌-1, గ్రేడ్‌-2, హెడ్‌నర్సు, స్టాఫ్‌ నర్సు, ఎల్‌బీ, ఎల్‌ఏ, ఫార్మసిస్టు, ఫార్మసిస్టు సూపర్‌వైజర్‌ గ్రేడ్‌1, గ్రేడ్‌2, జనరల్‌ విధులు నిర్వహించే సిబ్బంది.

ఉన్నవారికి బదిలీ తప్పదా ?

జిల్లా ఆసుపత్రికి 284 మంది వైద్యులు, సిబ్బందిని కేటాయించగా ప్రస్తుతం 199 మంది పనిచేస్తున్నారు. వైద్య కళాశాల, జనరల్‌ ఆసుపత్రిగా మార్చిన నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకోకుండానే డీఎంఈ నుంచి ప్రత్యేకంగా పోస్టుల భర్తీ అంటూ ప్రకటన విడుదలైంది.

ప్రకటనలో పేర్కొన్న పోస్టులు పరిశీలిస్తే ప్రస్తుతం ఇక్కడున్న వారంతా బదిలీపై వెళ్లాల్సి ఉంటుంది. కానీ జిల్లా ఆసుపత్రి స్థాయిలో పనిచేసే వైద్యులు సేవలు అందించే స్థాయి ఆసుపత్రులు జిల్లాలో లేకపోవడం గమనార్హం. దీంతో సివిల్‌ సర్జన్లు ఇతర జిల్లాల్లోని ఆసుపత్రులకు వెళ్లక తప్పని పరిస్థితి నెలకొంది.

నంద్యాల జిల్లా ఆసుపత్రిలో ఉన్న 199 మంది సిబ్బందిని జిల్లాలోనే మరో ఆసుపత్రిలో నియమించే అవకాశం లేదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీహెచ్‌సీలలో భర్తీ చేయడానికి వాటిలో ఖాళీల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో నంద్యాల జనరల్‌ ఆసుపత్రికి కేటాయించడం తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

పనిచేస్తున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి

- శివశంకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు, ఏపీఎన్జీవో, నంద్యాల

ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న 199 మంది ఉద్యోగులను జనరల్‌ ఆసుపత్రికి కేటాయించాలి. అలా చేస్తే ఉద్యోగులకు ఎలాంటి ఆందోళన ఉండదు. జిల్లా ఆసుపత్రిని జనరల్‌ ఆసుపత్రిగా మార్పు చేయడంతో ఇన్నేళ్లు పనిచేసిన ఉద్యోగులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముందుగా ప్రస్తుతం పనిచేస్తున్న వారికి పోస్టులు కేటాయిస్తూ ప్రకటన విడుదల చేసి ఆమేరకు భర్తీ చేయాలి.

పోరాటాలకు సిద్ధం

- మణిశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఏపీఎన్జీవో, నంద్యాల

జిల్లా ఆసుపత్రుల్లో పనిచేసే ఉద్యోగులకు అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధమవుతాం. ప్రస్తుతం విడుదల చేసిన జనరల్‌ ఆసుపత్రి పోస్టుల్లో వారి సర్వీసు రూల్స్‌తో భర్తీ చేయాలి. అలాచేయని పక్షంలో ఉద్యమాలు చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని