logo

దేవరగట్టు.. గెలుపుపై పట్టు

దసరా బన్ని జైత్రయాత్రకు ఆరు రోజుల సమయం ఉంది. పండగ వస్తుందంటే అందరిలో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. అక్టోబరు 5న జరిగే దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.

Published : 30 Sep 2022 01:37 IST

అక్టోబరు 5న బన్ని జైత్రయాత్ర
నేడు కంకణధారణ

మాళ మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులు

 - న్యూస్‌టుడే, హొళగుంద, ఆలూరు గ్రామీణ

* దసరా బన్ని జైత్రయాత్రకు ఆరు రోజుల సమయం ఉంది. పండగ వస్తుందంటే అందరిలో ఉత్సాహం పొంగి పొర్లుతుంది. అక్టోబరు 5న జరిగే దేవరగట్టు మాళ మల్లేశ్వరస్వామి బన్ని జైత్రయాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
* హొళగుంద మండలంలోని దేవరగట్టులో సుమారు 800 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన మాళ మల్లేశ్వరస్వామి దసరా బన్ని ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వామి దేవతామూర్తులను కాపాడుకొనేందుకు నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఒకవైపు.. అరికెర, అరికెరతండా, సుళువాయి, ఎల్లార్తి, కురుకుంద, బిలేహాల్‌, విరుపాపురం తదితర గ్రామాల భక్తులు మరోవైపు కర్రలతో తలపడతారు.

ఉత్సవమూర్తులు  దక్కించుకోవాలని
హొళగుంద మండలంలోని నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు డిర్ర్‌ర్ర్‌ర్ర్‌... గోపరాక్‌.. బహు పరాక్‌.. అంటూ మూకుమ్మడిగా వచ్చి దేవరగట్టులోని డోళ్లనబండ వద్ద పాలతో బాస చేస్తారు. ‘మేము మూడు గ్రామాల భక్తులం అన్ని వైషమ్యాలు మరచి.. దైవ కార్యం కోసం పాటు పడతాం, ఉత్సవమూర్తులు తిరిగి దక్కించుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతాం’ అని ప్రతిజ్ఞ చేస్తారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులతో కొండపైకి వెళ్లి స్వామివారి కల్యాణోత్సవం జరిపించడానికి అనుమతి తీసుకుంటారు.

పెరిగిన అవగాహన సదస్సులు
ఈ ఏడాది జిల్లా, డివిజన్‌, మండల స్థాయి అధికారులు బన్ని ఉత్సవాలపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు.  దేవరగట్టుకు వచ్చే గ్రామాల్లో పోలీసులు విస్తృత దాడులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో కర్రలను స్వాధీనం చేసుకుంటున్నారు. పొరుగు రాష్ట్రం నుంచి మద్యం రవాణా కాకుండా సరిహద్దు గ్రామాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

ఎక్కడి నుంచి ఎక్కడ
* నెరణికి, నెరణికితండా, కొత్తపేట గ్రామాల భక్తులు ఉన్నతాధికారుల అనుమతి అనంతరం మాళ మల్లేశ్వరస్వామి సన్నిధికి చేరి అక్కడ వారికి కల్యాణోత్సవం జరిపిస్తారు.
* స్వామి పల్లకిని సుమారు 350 మెట్లు దిగి కల్యాణకట్ట వద్దకు తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్లే సమయంలో మూడు గ్రామాల భక్తులతో అరికెర, అరికెరతండా, కురుకుంద, ఎల్లార్తి, సుళువాయి తదితర గ్రామాల భక్తులు కర్రలతో తలపడతారు.  
* ఉత్సవమూర్తులు ఎదురు బసవన్నగుడి వద్దకు చేరుకోగానే కర్రల సమరం ముగుస్తుంది. అక్కడి నుంచి స్వామి పల్లకి రాక్షసపడ వద్దకు వెళ్లి అక్కడ గొరవయ్య తన తొడ నుంచి పిడుకెడు రక్తాన్ని రాక్షసులకు ధారపోసిన తర్వాత తిరిగి పల్లకి ఎదురు బసవన్న గుడికి చేరుతుంది.
* అనంతరం ఆలయ పూజారి జరగబోయే పరిణామాలు, పంటల పరిస్థితి, ధరలపై కార్ణికం (భవిష్యవాణి) వినిపించడంతో మరోమారు కర్రల సమరం జరుగుతుంది. చివరకు ఉత్సవమూర్తులను కల్యాణకట్టకు చేర్చడంతో ఉత్సవం ముగుస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని