logo

రాబోయే ఎన్నికల్లో తెదేపాదే విజయం

రాబోయే ఎన్నికల్లో తెదేపాదే విజయమని కర్నూలు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు.

Published : 27 Nov 2022 02:34 IST

మాట్లాడుతున్న సోమిశెట్టి, వేదికపై తిక్కారెడ్డి తదితరులు

ఓంనగర్‌(పెద్దకడబూరు), న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో తెదేపాదే విజయమని కర్నూలు పార్లమెంటు పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ధీమా వ్యక్తం చేశారు. పెద్దకడబూరు మండలం ఓంనగర్‌లో ఏర్పాటు చేసిన క్లస్టర్‌ బాధ్యులు, సమన్వయ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇటీవల నిర్వహించిన రోడ్‌ షోకు జనం పోటెత్తడంతో వైకాపా నాయకులకు నిద్ర పట్టడం లేదన్నారు.  రాబోయే ఎన్నికల్లో జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు, రెండు ఎంపీలను గెలుచుకోవడం ఖాయమన్నారు. జగన్‌ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్నారు. వైకాపా అరాచక పాలనపై రాష్ట్ర ప్రజలు విసుగు చెంది తెదేపాకు పట్టం కట్టేందుకు ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబరు ఒకటి నుంచి ప్రారంభించే ‘ఇదేమీ కర్మ’ అనే కార్యక్రమం ద్వారా క్లస్టర్‌ ఇన్‌ఛార్జిలు, సమన్వయకర్తలు ఇంటింటికీ వెళ్లి వైకాపా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్య పరచాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని, చంద్రబాబు జోలికి వస్తే పుట్టగతులుండవు అంటూ కొడాలని నానిపై మండిపడ్డారు. తెదేపా అధికారంలోకి వచ్చాక కష్టపడే కార్యకర్తలకు మంచి రోజులు ఉంటాయని, సమష్టిగా పార్టీకి సైనికుల్లా పనిచేయాలన్నారు. పి.తిక్కారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు విబేధాలు వీడీ పార్టీ విజయం కోసం కృషి చేయాలన్నారు. మంత్రాలయం నియోజవకర్గంలో తెదేపా జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఇదేం ఖర్మ కార్యక్రమం ద్వారా బూత్‌, క్లస్టర్‌ స్థాయి నాయకులు అన్ని గ్రామాల్లో పర్యటించాలని కోరారు. గతంలో తెదేపా అభివృద్ధిని ప్రజలకు వివరించి చైతన్యం చేయాలన్నారు. వైకాపా అరాచకాలను ఎండగడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి, బసలదొడ్డి ఈరన్న, నాలుగు మండలాల నాయకులు హులిగయ్య, కోట్రెష్‌ గౌడు, గోపాల్‌రెడ్డి, చావడి వెంకటేశ్‌, మంత్రాలయం, పెద్దకడబూరు, కోసిగి, కౌతాళం మండలాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని