logo

అభివృద్ధిలో పోటీ పడదాం: మాజీ ఎమ్మెల్యే బీసీ

నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

Published : 06 Feb 2023 03:17 IST

ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న బీసీ, ఇతర నాయకులు

బనగానపల్లి, న్యూస్‌టుడే: నియోజకవర్గంలో తాను అధికారంలో ఉండగా జరిగిన అభివృద్ధి.. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు తాను సిద్ధమని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. ఆదివారం బనగానపల్లిలోని ఓ ఫంక్షన్‌ హాలులో తెదేపా ఆర్టీఎస్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే  వేధింపులతోనే ఆయన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. తమ కుటుంబం చేస్తున్న మంచి కార్యక్రమాలకు అడ్డు పడుతున్నారన్నారు. తమ సోదరుడు బీసీ రాజారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏళ్ల తరబడి రోగులకు అన్నదానం చేస్తుంటే అధికారంలోకి రాగానే ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయించారన్నారు. పట్టణంలో ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా తాను అడ్డు పడుతున్నట్లు ఆరోపణలు చేయడం మంచిది కాదన్నారు. తాను అనువైన స్థలం ఇవ్వాలనే డిమాండు చేస్తున్నా, తప్ప అడ్డు పడటం లేదన్నారు. పేదల ఇళ్ల పట్టాల కోసం నేను సొంతంగా రూ.20 కోట్లు ఇస్తానని, నీవు రూ.20 కోట్లు ఇస్తే పేదలకు ఎంతో విలువైన స్థలాలను కొనిస్తామని తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలో వైకాపా దళారులు ఇంటి స్థలాలు, పొలాలు ఇస్తామని పేదల నుంచి డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారని ఆరోపించారు.  అవుకు మండల నాయకుడు కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తాను పదేళ్లు ఎమ్మెల్యే కాటసాని వెంట తిరిగితే నాకే న్యాయం చేయలేదని, ఇతరులకు ఎలా చేస్తారని పేర్కొన్నారు. ఆర్టీఎస్‌ శిక్షకుడు ముస్తఫా, తెదేపా నేత బీసీ రామనాథరెడ్డి మాట్లాడారు. అంతకుముందు తెదేపా జెండావిష్కరించి ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళి అర్పించారు. నాయకులు రామకృష్ణారెడ్డి, శీనయ్య, అత్తర్‌ జావెద్‌, రామేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, సలాం, ఖాసీం, భూషన్న, పీవీ కుమార్‌రెడ్డి, కృష్ణనాయక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని