logo

వేతన జీవికి అందని వైద్యం

ఉమ్మడి కర్నూలులో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) కింద అందాల్సిన సేవలు అధ్వానంగా ఉన్నాయి. దీని పరిధిలో 80 వేల ఉంది ఉన్నారు.

Published : 30 May 2023 02:56 IST

మొక్కుబడిగా ఈహెచ్‌ఎస్‌ సేవలు

ఈహెచ్‌ఎస్‌ కింద ఓపీ సేవలు అందించే కేంద్రం

కర్నూలు వైద్యాలయం, న్యూస్‌టుడే: ఉమ్మడి కర్నూలులో ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ (ఈహెచ్‌ఎస్‌) కింద అందాల్సిన సేవలు అధ్వానంగా ఉన్నాయి. దీని పరిధిలో 80 వేల ఉంది ఉన్నారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 69, కర్నూలు సర్వజన వైద్యశాలతోపాటు నంద్యాల, ఆదోని ఆసుపత్రులు ఉన్నాయి. ప్రధానంగా సర్వజన వైద్యశాలలో ఈహెచ్‌ఎస్‌ కింద ఓపీ, ఐపీ సేవలు అందించాల్సి ఉండగా సేవలు అందడం గగనమైంది. ఓపీకి నెలలో 20 మంది కూడా రావడం లేదు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకెళ్తే రోగులు, వారి సహాయకులను ఇబ్బంది పెడుతున్నారు.

నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో..

ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెట్‌వర్క్‌ ఆసుపత్రులు 69 ఉన్నాయి. ఈహెచ్‌ఎస్‌ కింద ప్రధాన ఆసుపత్రులు.. రోగులను చేర్చుకోవడం లేదు. ఒకవేళ చేర్చుకున్నా ఏదో ఒక కారణం చెప్పి భయపెట్టి అదనపు సొమ్ము తీసుకుంటున్నారు తప్ప పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందించడం లేదు. రోగులు ఫిర్యాదు చేయలేక ఆసుపత్రి ప్రతినిధులు అడిగినంతమేర నగదు చెల్లిస్తున్నారు. తమవారు బతికితే చాలని భావిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉన్నా ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. ఇకనైనా స్పందించి ఈహెచ్‌ఎస్‌ కింద ఉద్యోగుల కోసం కర్నూలు సర్వజన వైద్యశాలలో ప్రత్యేకంగా వార్డు ఏర్పాటుచేసి ఉత్తమ వైద్యం అందించేలా చూడాల్సి ఉంది.

కన్నీరు మిగిల్చారు

జిల్లా పరిషత్‌లో జూనియర్‌ సహాయకుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు సతీమణి గోకారమ్మ స్పృహ కోల్పోయారు. హుటాహుటిన ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఖర్చు ఎక్కువవుతుందని చెప్పడంతో అక్కడినుంచి కర్నూలు సర్వజన వైద్యశాలలో అత్యవసర విభాగానికి తరలించారు. తర్వాత మెడికల్‌ ఫిమేల్‌ వార్డులో చేర్చారు. వివిధ పరీక్షలు చేసి బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చిందని.. ఎంఆర్‌ఐ చేయాలని వైద్యులు చెప్పారు. ఆమెకు కేటాయించిన బెడ్‌ వద్ద ఫ్యాన్‌ లేదు. సమస్యను వైద్యులకు విన్నవించడంతో పక్క వార్డులోకి మార్చారు. రాత్రి సమయంలో ఊపిరి ఆడకపోవడంతో నర్సింగ్‌ సిబ్బందికి చెప్పడంతో అత్యవసర విభాగానికి తీసుకెళ్లారు. ఒకవైపు భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం.. వైద్యులు పట్టించుకోకపోవడంతో ధైర్యం చేసి ఈహెచ్‌ఎస్‌ ఉన్న ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. వెంటనే ఎంఆర్‌ఐ తీసి ఆపరేషన్‌ చేయాలని.. పరిస్థితి చెప్పలేమని వైద్యులు తేల్చారు. ఆమెకు బుధవారం ఆపరేషన్‌ చేశారు. గురువారం ఉదయం 12 తర్వాత ప్రాణాలు వదిలారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందించి ఉంటే తన భార్య చనిపోయి ఉండేది కాదని శ్రీనివాసులు కన్నీరుమున్నీరయ్యారు.

ఏం చేయాలి..

కర్నూలు సర్వజన వైద్యశాలలోని పేయింగ్‌ బ్లాక్‌లో ఈహెచ్‌ఎస్‌ కింద ప్రత్యేకంగా ఓపీ ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. నిత్యం ఒక విభాగం సూపర్‌ స్పెషాలిటీ వైద్యులతో ఓపీ నిర్వహిస్తారు. ఈ గదిలో ఓ సిస్టర్‌ ఉంటారు. రోగులు వచ్చినప్పుడు ఆ విభాగం వైద్యులు వచ్చి పరీక్షలు చేసి వెళ్లాల్సి ఉంది. అవసరమైనవారిని ఐపీలో చేర్చుకుంటారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలన్నీ ఉచితంగా చేయాల్సి ఉంటుంది.

ఏం జరుగుతోంది

సర్వజన వైద్యశాలలో ఈహెచ్‌ఎస్‌ కింద ఓపీ గదిలో కేవలం ఒక స్టాప్‌ నర్సు ఉంటున్నారు. ఎవరైనా ఓపీకి వస్తే ఫోన్‌లో సమాచారం అందిస్తే పీజీ వైద్యులు చూసి మందులు రాసి పంపేస్తున్నారు. ఇక్కడ వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. పేరుకే సూపర్‌ స్పెషాలిటీ విభాగం.. నిపుణులైన వైద్యులు ఒక్కరు కూడా వచ్చి చూసిన దాఖలాలు లేవు. ఐపీ కింద చేరితో మంచి వైద్యం అందదని పలువురు ఇక్కడికి రావడం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని