logo

మఠం స్థలానికి ఎసరు

ఆదోని పట్టణ శివారులోని బైపాస్‌ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు.

Published : 28 Mar 2024 03:27 IST

మఠానికి సంబంధించిన భూమి

ఆదోని పురపాలకం, న్యూస్‌టుడే: ఆదోని పట్టణ శివారులోని బైపాస్‌ రహదారిపై మండగిరి గ్రామ పంచాయతీ పరిధిలో కల్లుమఠానికి చెందిన రూ.కోట్లు విలువ చేసే భూమిని అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు కబ్జా పర్వానికి తెర లేపారు. సర్వే నంబరు 552లో మఠానికి మొత్తం 1.70 ఎకరాల భూమి ఉంది. అందులో బైపాస్‌ రహదారి (పత్తికొండ-కర్నూలు) నిర్మాణానికి కొంత భూమి పోగా, 43 సెంట్లు మిగిలింది. ఈ భూమిని వైకాపా నాయకుడు కబ్జా చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎవరికీ అనుమానం రాకుండా ఇందులో ఇసుక డంపింగ్‌ యార్డు నిర్వహిస్తుండటం విశేషం. ఇటీవల కొత్త స్వామీజీ మఠం బాధ్యతలు చేపట్టారు. ఆయన మఠానికి సంబంధించి ఆస్తులు, భూములు, తదితర వివరాలపై ఆరా తీశారు. ఈ నేపథ్యంలో ఈ భూమి వివరాలు బయటకు వచ్చాయి. వైకాపాకు చెందిన ఓ నాయకుడు 35 సెంట్లు కబ్జా చేయగా, తెదేపాకు చెందిన మరో నాయకుడు 8 సెంట్ల స్థలాన్ని ఆక్రమించుకుని వెంచర్‌ వేశారు. మఠం భూమిని కాపాడుకునేందుకు స్వామీజీ ప్రయత్నం చేయగా.. తెర వెనుక కొన్ని రాజకీయ శక్తులు రంగ ప్రవేశం చేసి అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనిపై ఎలాంటి ప్రకటన చేయకుండా, వివరాలు వెల్లడించకుండా ఉండేందుకు మఠంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. అయితే భూమికి సంబంధించి తమ వద్ద పత్రాలు ఉన్నాయని మఠం నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు ఆదోని మండలం పెద్దతుంబళంలో సైతం ఇదే మఠానికి చెందిన దాదాపు 12-13 ఎకరాల భూమి ఇతరుల చేతుల్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇలా చాలాచోట్ల మఠం భూములు అన్యాక్రాంతమవుతున్నా.. వాటి సంరక్షణకు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని