logo

పశ్చిమాన సాగునీరు పారిస్తాం

‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది.

Published : 20 Apr 2024 05:59 IST

వేదవతి ప్రాజెక్టును పూర్తిచేస్తాం
ఆలూరులో తెదేపా అధినేత చంద్రబాబు

ఈనాడు, కర్నూలు, ఆలూరు గ్రామీణం, ఆలూరు, న్యూస్‌టుడే: ‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది.. తెదేపా అధికారంలోకి రాగానే ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తాం.. దీంతో 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది... పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది’’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలొచ్చారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్‌ సాధారణ కార్యకర్త, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కురుబ సామాజిక వర్గానికి చెందిన సామాన్య వ్యక్తి.. వారిద్దరినీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘కురబ కులస్థుడైన బస్తిపాటి నాగరాజు కర్నూలు నుంచి దిల్లీ పార్లమెంటుకు వెళ్లబోతున్నారని ఊహించారా? తెదేపాలో సామాన్య కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం ఇది. అందుకే వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాన్న ఉద్దేశంతో జనసేన అధినేత పనన్‌ కల్యాణ్‌ పొత్తుపెట్టుకున్నారని.... జనసేన కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని. వైకాపాను  చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.

  • ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్‌ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్‌ కేటాయించారు.. ఆ నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు.
  • కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ..  ఆలూరు అత్యంత వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
  • కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ..  వైకాపా నేతలు మద్యం, మట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమాలు చేశారే తప్ప.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయలేదన్నారు.

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

శ్చిమ ప్రాంతంలో నీళ్లు లేక పెళ్లిళ్లూ వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే సాగు నీటితోపాటు ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల నుంచి ఏటా వేలాది మంది వలస వెళ్తున్నారు. వారికి స్థానికంగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టమాట రైతులను ఆదుకోవడానికి వీలుగా టమాట శుద్ధి (ప్రాసెసింగ్‌) పరిశ్రమ తీసుకొస్తాం.. మిరప రైతులకు ఆదోనిలో మార్కెట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. నగరడోణా ప్రాజెక్టు, వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల పాఠశాల కావాలని డిమాండు చేస్తున్నారని... వాటి ఏర్పాటుకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ఆగిపోయిన జాతీయ రహదారి పనులు పూర్తి చేస్తామన్నారు. ‘జగన్‌రెడ్డి రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించారా? సాగు, తాగునీరు ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? డీఎస్సీ నిర్వహించారా? జాబ్‌ క్యాలెండర్‌ ఇచ్చారా? మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ కష్టాలు తీరాయా? మిరప, పత్తి, టమాట రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సభకు హాజరైన ప్రజలు ఆయా ప్రశ్నలకు ‘లేదు... లేదు...’ అంటూ సమాధానం ఇచ్చారు.


ఎండను సైతం లెక్కచేయకుండా..

ప్రజాగళం సభకు జనం భారీగా హాజరయ్యారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన జనం అడుగడుగునా నీరాజనం పలికారు. మహిళలు ఎండను సైతం లెక్కచేయక చంద్రబాబు రాక కోసం ఎదురుచూశారు. చిన్నారులు సైతం పార్టీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో జనం ఈలలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ ఉత్సాహం కనబరిచారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


నమ్ముకున్న నేతలకు న్యాయం చేస్తాం

  • ‘వైకుంఠం కుటుంబం తెదేపాకు అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు గుర్తుకొస్తారు.. శివప్రసాద్‌, ఆయన భార్య జ్యోతి ఎప్పుడూ తెదేపాకే పనిచేశారు. కొందరు స్వార్థంతో వెళ్లిపోయినా శివప్రసాద్‌, జ్యోతి తెదేపాలోనే ఉన్నారు. వారిని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా కప్పటాళ్ల బొజ్జమ్మకూ న్యాయం చేస్తామన్నారు.
  • కోట్ల సుజాతమ్మకు కొన్ని కారణాలతో టికెట్‌ ఇవ్వలేకపోయాం. ఆమె సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆమెకు న్యాయం చేస్తాం.. ఆమె అభిమానులందరూ తెదేపా విజయానికి సహకరించాలి’ అని తెదేపాలోని కీలక నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగిన న్యాయం చేస్తామని బహిరంగంగా ప్రజలందరి ముందూ ప్రకటించి వారిలో విశ్వాసం నింపడంతో పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.  
  • ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆదోని అసెంబ్లీ స్థానం భాజపాకు కేటాయించామని, తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నీకు న్యాయం చేస్తానని ఆదోని మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడుకు తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు