logo

8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నాం!

పాలమూరులో 2014 కంటే ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఎప్పుడు కరెంట్‌ పోతుందో తెలియదు.. ఎప్పుడు వస్తదో తెలియదు.. ఎరువుల కోసం కొట్లాటలు..

Published : 05 Jun 2022 06:20 IST

2014 కంటే ముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది?

రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌, పేట జిల్లాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం


కోస్గిలో కూరగాయల మార్కెట్‌ ప్రారంభ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ అజయ్‌కుమార్‌,

శ్రీనివాస్‌గౌడ్‌, కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌ (ఈనాడు డిజిటల్‌), భూత్పూరు, అడ్డాకుల, దేవరకద్ర గ్రామీణం, కోస్గి, కోస్గి గ్రామీణం, కోస్గి న్యూటౌన్‌ (న్యూస్‌టుడే) : పాలమూరులో 2014 కంటే ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రజలు గుర్తు తెచ్చుకోవాలని రాష్ట్ర పురపాలిక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. ఎప్పుడు కరెంట్‌ పోతుందో తెలియదు.. ఎప్పుడు వస్తదో తెలియదు.. ఎరువుల కోసం కొట్లాటలు.. చెప్పులు లైన్లో పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు.. తెలంగాణ వచ్చాక పాలమూరులో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతోందని పేర్కొన్నారు. కేంద్రం మాత్రం పాలమూరును చిన్నచూపు చూస్తోందన్నారు. వికారాబాద్‌ నుంచి నారాయణపేట మీదుగా రైలు మార్గం, గద్వాల - మాచర్ల రైలు మార్గాలు మంజూరు చేయడం లేదని ఆరోపించారు. ఇక్కడి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడం లేదన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, నారాయణపేట జిల్లాలోని కోస్గిలో మంత్రి కేటీఆర్‌ శనివారం సుడిగాలి పర్యటన చేశారు.  దేవరకద్ర నియోజకవర్గంలో రూ.119 కోట్లతో, కోస్గిలో రూ.40.65 కోట్ల అభివృద్ధి పనుల్లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా భూత్పూరులోని అమిస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ ప్రసంగిస్తూ.. 4 వేల ఎకరాలకు సాగునీరు అందించే పేరూరు ఎత్తిపోతల పథకం పనులకు రూ.55 కోట్లతో శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా దేవరకద్రలో 21 చెక్‌డ్యామ్‌లు ఏర్పాటు చేసుకోవడంపై సంతోషం వ్యక్తపరిచారు. కొత్తకోట పురపాలికకు రూ.4 కోట్లు విడుదల చేస్తానని చెప్పారు. అదేవిధంగా భూత్పూరులో అధికారుల కార్యాలయాల సముదాయానికి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తానన్నారు. దేవరకద్ర గ్రామపంచాయతీ గడువు ముగియగానే పురపాలికగా మార్చి రూ.20 కోట్ల నిధులు అందిస్తామన్నారు. కొత్తకోటలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. సిద్దాయిపల్లిలో రెండు పడకల గదుల ఇళ్ల పంపిణీ సమయంలో లబ్ధిదారుల కళ్లలో ఆనందం చూశానన్నారు. సొంత జాగా ఉన్నవారికి ఇళ్లు కట్టుకోవడానికి నియోజకవర్గంలో మూడు వేల మందికి రూ.3 లక్షల చొప్పున అందిస్తామని చెప్పారు.

* రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ నంబర్‌ 1 రాష్ట్రంగా ఉందన్నారు. ఈ విషయాన్ని భాజపా పెద్దలు, పార్లమెంటులో ఆ పార్టీ వాళ్లే ఒప్పుకొన్నట్లు చెప్పారు. చిన్న గ్రామంగా ఉన్న భూత్పూరును పురపాలికగా మార్చి ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేశారన్నారు. ఒక్క భూత్పూరు మాత్రమే కాదు.. రాష్ట్రంలోని 142 పురపాలికలను శుభ్రంగా తీర్చిదిద్దుతున్నారన్నారు.

అమిస్తాపూర్‌ సభకు హాజరైన జనం

*రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. 70 ఏళ్లలో పాలమూరును అప్పటి పాలకులు వలసగా జిల్లాగా మార్చారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన తరవాత ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతోందన్నారు. అప్పటి పాలకులు కనీసం 5 టీఎంసీల నీటిని వాడుకునేలా ఒక్క ప్రాజెక్టుకు కూడా డిజైను చేయలేదన్నారు. ఆర్డీఎస్‌ను బద్దలు కొట్టినా ఇక్కడి నేతలు ఎవరూ మాట్లాడలేదన్నారు. ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు తరలిస్తుంటే హారతులు పట్టారని చెప్పారు. మళ్లీ ఒకసారి ఈ ప్రాంత ప్రజలను మోసం చేయడానికి ఇద్దరు వ్యక్తులు జాతీయ నాయకులుగా తిరుగుతున్నారన్నారు. పాలమూరు నుంచి ముంబయి, పుణే, దుబయి వెళ్లినవారు తిరిగి వస్తున్నారన్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, డా.లక్ష్మారెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అబ్రహాం, అంజయ్య యాదవ్‌, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి, సురభి శ్రీవాణి, ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు.


* కోస్గి సభలో మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఒక్క బస్సు డిపో కూడా ఏర్పాటు కాలేదని.. మొదటి బస్‌ డిపో కోస్గిలో ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కోస్గి, కొడంగల్‌పై ఉన్న ప్రేమకు ఇది నిదర్శనమన్నారు. త్వరలోనే అర్హులైన అందరికి పింఛన్లు అందిస్తామన్నారు. కోస్గిలో 50 పడకల ఆస్పత్రి, కొడంగల్‌లో 100 పడకల ఆస్పత్రి పూర్తయిందన్నారు. ఇది నియోజకవర్గంలో కళ్ల ముందు కనిపిస్తున్న అభివృద్ధి కాదా అని అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిలో సర్పంచులందరూ పాల్గొనాలన్నారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని