logo

అంచెలంచెలుగా ఎదిగి అసెంబ్లీకి!

రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతల్లో చాలామంది కిందిస్థాయి నుంచి ఎదిగిన వాళ్లే. జడ్పీటీసీ సభ్యులుగా సేవలందించింది గుర్తింపు పొంది తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు.

Published : 26 Oct 2023 04:19 IST

జడ్పీటీసీ స్థాయి నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన నేతలు

 

న్యూస్‌టుడే, మహబూబ్‌నగర్‌ పట్టణం : రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నేతల్లో చాలామంది కిందిస్థాయి నుంచి ఎదిగిన వాళ్లే. జడ్పీటీసీ సభ్యులుగా సేవలందించింది గుర్తింపు పొంది తర్వాత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. ఎమ్మెల్యేగా గెలిచి మంత్రులుగా, పార్టీల కీలక నేతలుగా ఎదిగారు. ఇలాంటి నేతల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి ఉన్నారు.

పీసీసీ సారథిగా రేవంత్‌రెడ్డి..

వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి చెందిన ఎనుముల రేవంత్‌రెడ్డి 2007లో మిడ్జిల్‌ మండల జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. 2007లో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించారు. 2009లో తెదేపా తరఫున కొడంగల్‌ అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లోనూ ఇదే నియోజకవర్గం నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లో కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి భారాస అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2019లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో మల్కాజిగిరి స్థానం నుంచి పోటీచేసి ఎంపీగా గెలుపొందారు. కొద్ది సమయంలోనే కాంగ్రెస్‌లో కీలక నేతగా ఎదిగారు. పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. రాజకీయ చతురత, వాక్చాతుర్యంతో ఈ స్థాయికి ఎదిగారు.

జడ్పీ ఛైర్‌పర్సన్‌గా సీతాదయకర్‌రెడ్డి..

మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్‌రెడ్డి కూడా తన ప్రస్థానం జడ్పీటీసీ సభ్యురాలి స్థాయి నుంచే ప్రారంభించారు. ఆమె 2001లో  దేవరకద్ర జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నియ్యారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌గానూ ఎన్నికై 2006 వరకు కొనసాగారు. దేవరకద్ర నియోజకవర్గం కొత్తగా ఏర్పడ్డాక తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి దేవరకద్ర ఎమ్మెల్యేగా 2009లో విజయం సాధించారు. ఇదే సంవత్సరం తెదేపా తరఫున మక్తల్‌ ఎమ్మెల్యేగా ఆమె భర్త దయాకర్‌రెడ్డి గెలుపొందారు. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి శాసనసభలో ఎమ్మెల్యేలుగా అడుగుపెట్టి రికార్డు నెలకొల్పారు. ఇన్నాళ్లు తెదేపాలోనే కొనసాగిన ఆమె ఇటీవల కాంగ్రెస్‌లో చేరారు.

కీలక నేతగా డీకే అరుణ..

గద్వాలకు చెందిన డీకే అరుణ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా 2001లో పాన్‌గల్‌ మండల జడ్పీటీసీ స్థానానికి పోటీ చేసి ఎన్నియ్యారు. 2004లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించి భంగపడ్డారు. సమాజ్‌ వాదీ పార్టీ(ఎస్పీ) అభ్యర్థిగా గద్వాల అసెంబ్లీ స్థానానికి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఆమె 2009లో మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాష్ట్ర మంత్రిగా సేవలు అందించారు. 2014లోనూ మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత పరిణామాలతో భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

ఎమ్మెల్యేగా వెంకటేశ్వర్‌రెడ్డి..

భూత్పూరు మండలం అన్నాసాగర్‌కు చెందిన ఆల వెంకటేశ్వర్‌ రెడ్డి భారాస నుంచి దేవరకద్ర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈయన తెదేపాలో చురుకుగా ఉంటూ 2009లో భూత్పూరు జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. ఆ తర్వాత భారాసలో చేరి 2014లో దేవరకద్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి శాసనసభకు ఎన్నియ్యారు. ఇప్పుడు మూడో సారి భారాస అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని