logo

డీసీసీబీ పీఠంపై కాంగ్రెస్‌ కన్ను

మహబూబ్‌నగర్‌ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది.

Published : 28 Mar 2024 04:34 IST

మహబూబ్‌నగర్‌ డీసీసీబీ కార్యాలయం

ఈనాడు, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌ డీసీసీబీ పీఠంపై హస్తం పార్టీ కన్నేసింది. ఛైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడానికి పార్టీ పావులు కదుపుతోంది. భారాస నుంచి పార్టీ మారడానికి ఇప్పటికే 55 మంది పీఏసీఎస్‌ ఛైర్మన్లతో సంతకాలు కూడా సేకరించినట్లు సమాచారం. వీరంతా వారం, పది రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీసీసీబీ ఛైర్మన్‌గా మక్తల్‌కు చెందిన నిజాం పాషా(భారాస) ఉన్నారు. రెండేళ్లుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2020 ఫిబ్రవరిలో ప్రాథమిక సహకార సంఘాలకు జరిగిన ఎన్నికల్లో భారాస మద్దతుదారులు ఏకపక్షంగా ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌గా ఎంపికయ్యారు. మొత్తం 67 సొసైటీల్లో ఛైర్మన్‌ స్థానానికి ఎన్నికలు జరగ్గా 65 స్థానాల్లో భారాస మద్దతుదారులే ఛైర్మన్లుగా, 15 మంది డైరక్టర్లుగా ఎంపికయ్యారు. ఛైర్మన్‌గా నిజాం పాషా, వైస్‌ చైర్మన్‌ వెంకటయ్య  ఎన్నికయ్యారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో పలుచోట్ల పాలకవర్గాలకు అవిశ్వాస తీర్మాణాలు పెడుతున్నారు. అందులో భాగంగా డీసీసీబీ ఛైర్మన్‌కు అవిశ్వాస తీర్మాణం పెట్టాలని తొలుత భావించారు. దీని కోసం పెద్ద ప్రక్రియ ఉండటంతో అనారోగ్య కారణాలతో నిజాం పాషాను రాజీనామా చేయించాలన్న ఆలోచనల్లో ప్రస్తుత పాలక మండలి ఉంది. ఇప్పటికే 55 మంది పీఏసీఎస్‌ ఛైర్మన్లు పార్టీ మారడానికి సిద్ధమైన నేపథ్యంలో ఆయన్ని పక్కకు తప్పించే అవకాశాలు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ముగుస్తుండటంతో డీసీసీబీ బడ్జెట్‌ను ఆమోదించడానికి ప్రస్తుతం డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశాలు జరుగుతున్నాయి. ఛైర్మన్‌ పీఠం కోసం వనపర్తి, రంగారెడ్డి జిల్లాల నుంచి ఇద్దరు డైరెక్టర్లు పోటీ పడుతున్నట్లు సమాచారం. వీరూ భారాస నుంచి కాంగ్రెస్‌లో చేరడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఇందులో ఓ డైరెక్టర్‌ తనకు మద్దతుగా పలువురు పీఏసీఎస్‌ ఛైర్మన్లతో సంతకాలు కూడా సేకరించినట్లు తెలిసింది.

సీఎం పచ్చజెండా ఊపితే..

మహబూబ్‌నగర్‌ డీసీసీబీ ఛైర్మన్‌ పీఠం మార్పుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే తర్వాత జరిగే ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రక్రియ ముందుకు సాగడానికి మరో రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ లోగా ప్రస్తుతం ఉన్న డీసీసీబీ ఛైర్మన్‌తో రాజీనామా చేయిస్తే కొత్త సారథి ఎంపిక సునాయాసంగా మారే అవకాశం ఉంది. దీనికోసం ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ను రంగంలోకి దించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. దీనితోపాటు డీసీఎంఎస్‌ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఇందులో మొత్తం ఏడుగురు డైరెక్టర్లు ఉన్నారు. వీరంతా భారాసకు చెందిన వాళ్లే. త్వరలో ఉమ్మడి జిల్లాకు చెందిన పీఏసీఎస్‌ ఛైర్మన్లు రేవంత్‌రెడ్డితో సమావేశమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని