logo

గద్వాలలో భారీ చోరీ

గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది.

Updated : 29 Mar 2024 06:38 IST

తెరిచి ఉన్న బీరువా

గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: గద్వాలలో చోరీల పరంపర కొనసాగుతోంది. తమ పోలీసు సిబ్బంది కట్టుదిట్టంగా విధులు నిర్వహిస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నప్పటికీ జిల్లాలో ప్రధాన కాలనీలో భారీ స్థాయిలో చోరీ చేసుకోవడం పోలీసు శాఖకు నిజంగా తలనొప్పే. ఇటీవల ఓ వివాహ వేడుకలో 30 తులాల బంగారు ఆభరణాల చోరీ సంఘటన మరువక ముందే గురువారం మరో చోరీ చేసుకోవడంతో గద్వాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. బాధితుల కథనం మేరకు.. గద్వాలలోని లింగంబాగ్‌ కాలనీకి చెందిన సాయి పల్లవి ట్రేడర్స్‌ యజమాని ఇనుగూరు వెంకటేశ్వర్లు ఈ నెల 26న తన 11 రోజుల మనవడిని చూసేందుకు కుటుంబ సభ్యులతో సహా బెంగళూరు వెళ్లాడు. వ్యాపార నిమిత్తం వెంకటేశ్వర్లు కొడుకు రాజేశ్‌ గురువారం గద్వాలలోని తన ఇంటికి తెల్లవారు జామున 5 గంటల సమయంలో చేరుకున్నాడు. ఇంటికి వేసిన తాళం లేకుండా తలుపులు మూసి ఉండటంతో ఆందోళనకు గురై లోపలికి వెళ్లి బీరువాను చూడగా బీరువా తెరిచి ఉంది. వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. బీరువాలో పెట్టిన రూ.12.50 లక్షల నగదు, 42 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ.2 లక్షల విలువ గల ఓ సంస్థ బాండ్లు, 3 పాస్ట్‌పోర్ట్‌లు చోరీకి గురైనట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలానికి గద్వాల పట్టణ పోలీసులు, డాగ్‌, క్లూస్‌ టీం చేరుకుని పరిశీలించారు. బాధితుడు వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని