logo

ప్రవల్లిక.. కూచిపూడి నాట్యమయూఖ

కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక.

Updated : 29 Mar 2024 06:35 IST

ఈనెల 15న నెదర్లాండ్‌ వేదికపై నృత్యం చేస్తున్న ప్రవల్లిక

గద్వాల పురపాలకం, న్యూస్‌టుడే: కళను కాపాడుకునే ప్రయత్నంలో కాలికి గజ్జెకట్టింది.. దాని ఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లేందుకు ఆన్‌లైన్‌ శిక్షణనూ ప్రారంభించింది.. భవిష్యత్తరాలకూ అందించాలనే తపనతో శిష్య పరంపరనూ తీర్చిదిద్దుతోంది.. కూచిపూడిని ఉన్నత శిఖరాలకు తీసుకెళుతున్న ఆమె గద్వాలకు చెందిన ప్రవల్లిక. తాజాగా ఈనెల 15న నెదర్లాండ్స్‌లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తన ప్రదర్శనతో చూపరులను కట్టిపడేశారు.

గిన్నిస్‌ రికార్డు ప్రదర్శనలో..

గద్వాలలోనే స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ ఎమ్మెల్యే పాగ పుల్లారెడ్డి స్థాపించిన నటరాజు రామకృష్ణ కళాక్షేత్రంలో మాస్టర్‌ యేలేశ్వరపు వెంకటేశ్వర్లుతో కూచిపూడిలో మెరుగైన శిక్షణ పొందారు. ఆయన పర్యవేక్షణలోనే డిప్లొమా సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేశారు. 2014లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూచిపూడిలో ఎమ్‌ఏ పూర్తిచేసి, ప్రస్తుతం ఎంఫిల్‌ చేస్తున్నారు. హైదరాబాదులోని నాచారంలో 2012లో నృత్యనికేతన్‌ను ప్రారంభించి దశాబ్దకాలం ఎంతో మందికి శిక్షణనిచ్చారు. ప్రస్తుతం బెల్జియం నుంచే ఆన్‌లైన్‌లో కూకట్పల్లి బాలకేంద్రం చిన్నారులకు, బెల్జియం, యూఎస్‌ఏ, ఆస్ట్రేలియా, కెనడాలోని కూచిపూడిపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నారు. అమెరికాకు చెందిన సిలికానాంధ్ర వారి ఆధ్వర్యంలో 2010లో హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన గిన్నిస్‌ రికార్డు ప్రదర్శనలో తన శిష్యబృందంతో పాల్గొన్నారు.

ఆర్‌.నారాయణమూర్తి, మామిడి హరికృష్ణతో సన్మానం అందుకుంటూ..

ఐదేళ్ల వయసు నుంచే..

ప్రవల్లిక తల్లిదండ్రులు గజేంద్రం, అలివేలు మంగమ్మల ప్రోత్సాహంతో గద్వాల బాలభవన్‌లో తన ఐదేళ్ల వయసులోనే ఉమాశంకర్‌ గురువుతో కూచిపూడిలో శిక్షణ ప్రారంభించారు. తన భర్త హరిశేఖర్‌ ఉద్యోగరీత్యా బెల్జియంలో ఉంటుండటంతో అక్కడి నుంచే ఈమె మనదేశంతోపాటు పలు దేశాల ఔత్సాహికులకు ఆన్‌లైన్‌ వేదికగా కూచిపూడి నృత్యంలో తర్ఫీదునిస్తున్నారు. ప్రవల్లిక తండ్రి గజేంద్రం 1990వ దశకంలో గద్వాల బాలకేంద్రంలో నృత్య శిక్షకుడిగా పనిచేసేవారు. ఆ ప్రభావం కూడా ఆమెపై ఉంది.

నెదర్లాండ్‌లో అభిమానులతో ప్రవల్లిక

ముఖ్యమైన ప్రదర్శనలు

  • ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నిర్వహించిన జిల్లా స్థాయి యువజనోత్సవాల్లో కూచిపూడి నృత్యంలో మొదటి స్థానంలో నిలిచి హైదరాబాదులోని శిల్పారామంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
  • తిరుమలలోని నాద నీరాజనం వేదికపై 2014 నుంచి వరుసగా ఐదేళ్లపాటు నృత్య ప్రదర్శనలిచ్చి తితిదే అధికారులతో సన్మానం అందుకున్నారు.
  • 2016లో దిల్లీలో వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన 24 దేశాల శాస్త్రవేత్తల సమ్మేళనం వేదికపైనా తన శిష్యులతో కలిసి ప్రదర్శననిచ్చారు.
  • దూరదర్శన్‌ హైదరాబాదు కేంద్రంలో పలు ప్రదర్శనలిచ్చి ‘బి’ గ్రేడ్‌ కళాకారిణిగా ధ్రువపత్రం అందుకున్నారు. ః గతేడాది ఆగస్టు 15న బెల్జియంలోని భారత ఎంబసీలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లోనూ నృత్య ప్రదర్శనలిచ్చారు.
  • మాజీ సీఎం రోశయ్య, మాజీ గవర్నర్‌ నరసింహన్‌, సినీ నటులు అక్కినేని నాగేశ్వరరావు, జమున, అలీ, ఆర్‌.నారాయణమూర్తి, గాయని సుశీల, తదితర ప్రముఖులచే ప్రశంసలందుకున్నారు.

కూచిపూడిలో పీహెచ్‌డీ లక్ష్యం..

మా ఆరేళ్ల అమ్మాయి నక్షత్రకు కూడా నృత్యం నేర్పిస్తూ కళాకారిణిగా తీర్చిదిద్దుతున్నాను. నా వద్ద ఇప్పటికే 300కు పైగా ఔత్సాహికులు నృత్య శిక్షణ పొందగా, పలువురు డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు చేయడమేకాక ఎంఏ కూచిపూడిలో చేరడం గర్వంగా ఉంది. భవిష్యత్తులోనూ శాస్త్రీయ కళలను కాపాడేలా కూచిపూడిలో పీహెచ్‌డీ చేయాలన్న లక్ష్యంతో ముందుకెళుతున్నాను.

ప్రవల్లిక, కూచిపూడి కళాకారిణి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని