logo

అమాత్యుడి హామీ అమలయ్యేనా?

దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు.

Published : 29 Mar 2024 03:50 IST

శ్రీశైలం ప్రాజెక్టు ముంపు రైతుల్లో చిగురిస్తున్న ఆశలు

సోమశిల తీరంలో తేలిన ముంపు భూములు

కొల్లాపూర్‌, న్యూస్‌టుడే : దేశానికే తలమానికమైన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో లక్షలాది ఎకరాలు ముంపునకు గురవగా వేలాది కుటుంబాలు సర్వస్వం కోల్పోయారు. ప్రజల్లో వెలుగులు నింపడం కోసం త్యాగం చేసిన నిర్వాసిత రైతులకు న్యాయం చేస్తామన్న తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్‌, పురావస్తు, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హామీతో ఆశలు చిగురిస్తున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన భూములను పేద రైతులకు పంచుతామని ఈనెల 25న మంత్రి అధికారికంగా ప్రకటించడంతో ఆనందం వ్యక్తమవుతోంది. ఇన్నాళ్లకు సాగు చేసుకోవడానికి కొంతభూమి దొరుకుతుందని నిర్వాసితులు ఆశపడుతున్నారు. 1999 నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా కొనసాగుతూ అధికార కాంగ్రెస్‌, భారాస పార్టీలతోపాటు ప్రస్తుతం అధికార కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు పెంట్లవెల్లి మండలం మంచాలకట్టలో ప్రకటించిన విధంగా అమలు చేయాలంటూ నిర్వాసిత రైతులు కోరుతున్నారు.

ఇదీ పరిస్థితి..

  • ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 1980లో నిర్మాణం చేసిన శ్రీశైలం జలవిద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్‌, వనపర్తి, అలంపూర్‌ నియోజకవర్గాల్లో 65 గ్రామాలు, 1.10 లక్షల ఎకరాలు 12 వేల కుటుంబాలు ముంపునకు గురయ్యాయి. చాలా గ్రామాలు ఆనవాలు లేకుండా జలగర్భంలో కలిసిపోయాయి. కొంతమంది గ్రామాల ప్రజలు కృష్ణా తీరంలోని ఎగువ ప్రాంతానికి తరలివచ్చి నివసిస్తున్నారు. ఉన్న భూములు మునిగిపోవడంతో చాలామంది ప్రజలకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. నదిలో చేపల వేట, కూలీ పనులతో కుటుంబాలను పోషించుకుంటున్నారు. ముంపునకు గురై తేలిన తర్వాత భూముల్లో పంటల సాగుకు వెళ్తే అధికార రాజకీయ అండతో కొందరు నేతలు, పెట్టుబడిదారులు నిర్వాసిత రైతులను అడ్డుకుంటూ రానిచ్చేవారు కాదు. కృష్ణాతీరంలో భూ, మత్య్స మాఫియా విస్తరించింది. వరద జలాలు చేరినప్పుడు చేపలవేట, తేలిన తర్వాత పంటలసాగు, అక్రమంగా మట్టి తరలింపు చేసుకుంటూ కొందరు అక్రమార్కులు మాత్రమే బాగుపడుతున్నారు. చాలా మంది నిర్వాసితులకు పంటల సాగు లేకుండా పోయింది. ఆలయాలు, దర్గాలకు చెందిన భూములతోపాటు గ్రామాలు విడిచివెళ్లిన పెద్ద రైతుల భూములను రాజకీయ నేతలు ఆక్రమించుకొని తమ కబ్జాలో పెట్టుకున్నారు.
  • ప్రభుత్వపరంగా ముంపు భూములకు పరిహారం ఇచ్చిన కృష్ణాతీరంలో ఈ భూములకు విపరీతంగా డిమాండ్‌ వచ్చింది. దీంతో ఎకరా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. భూమిలేని నిరుపేదలు డబ్బులు లేకపోవడం, ఉపాధిలేక నష్టపోతున్నారు. ఈ సమస్యలను మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి కొల్లాపూర్‌ మండలం మంచాలకట్ట రైతులు తీసుకెళ్లారు. స్వయంగా ఈనెల 25న మంత్రి ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించి పేదరైతులకు ముంపు భూములను కేటాయిస్తామని చెప్పడంతో రైతుల్లో ఆనందం నెలకొన్నది.  ఏళ్లుగా కొల్లాపూర్‌ నియోజకవర్గంలో ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న జూపల్లి కృష్ణారావు ఈ హామీని నెరవేర్చాలంటూ కృష్ణాతీరంలోని నిర్వాసిత గ్రామాల రైతులు కోరుతున్నారు. వందల ఎకరాలు కొందరు నేతల చేతుల్లోనే ఉన్నాయని, పార్టీల పరంగా చూడకుండా ఎలాంటి భూములులేని పేదలందరికి పంపిణీ చేసి న్యాయం చేయాలంటూ వారు మంత్రిని వేడుకొంటున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని