logo

గర్భవిచ్ఛిత్తి ఘటనలో రెండు క్లినిక్‌ల మూసివేత

మిడ్జిల్‌ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్‌లను సీజ్‌ చేశారు.

Published : 24 Apr 2024 06:11 IST

మిడ్జిల్‌లోని క్లినిక్‌ను మూసివేసిన మండల వైద్యాధికారి డా.శశికాంత్‌, అధికారులు

పాలమూరు, మిడ్జిల్‌, న్యూస్‌టుడే : మిడ్జిల్‌ మండలంలోని వేముల గ్రామానికి చెందిన జయలక్ష్మి అనే మహిళ గర్భవిచ్ఛిత్తితో మృతిచెందిన ఘటనలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. వేర్వేరు ప్రాంతాల్లోని రెండు క్లినిక్‌లను సీజ్‌ చేశారు. డీఎంహెచ్‌వో మాస్‌ మీడియా అధికారి డా.తిరుపతిరావు కథనం ప్రకారం.. ‘గర్భవిచ్ఛిత్తితో మహిళ మృతి’ శీర్షికతో ఈనెల 22న ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన డీఎంహెచ్‌వో కృష్ణ, ఇతర అధికారులు వేముల గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు సేకరించారు. మహబూబ్‌నగర్‌ పట్టణం పద్మావతి కాలనీ వెనక ఉన్న భాగ్యనగర్‌ కాలనీ పాలకొండ తండాలో క్లినిక్‌ నిర్వహిస్తున్న వరలక్ష్మి అనే మహిళ ఆబార్షన్‌ చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు. వరలక్ష్మిని విచారించగా తన వద్దకు మిడ్జిల్‌ మండల కేంద్రంలో క్లినిక్‌ నడిపే రమేశ్‌ గర్భిణిని పంపించారని చెప్పారు. పాలకొండ తండాలోని వరలక్ష్మి క్లినిక్‌ను అధికారులు సీజ్‌ చేశారు. మిడ్జిల్‌లో రమేశ్‌కు చెందిన క్లినిక్‌ను మండల వైద్యాధికారి డా.శశికాంత్‌, ఆర్‌ఐ అంబిక తదితరులు సీజ్‌ చేశారు. ఇద్దరికి షోకాజ్‌ నోటీసులు జారీ చేశామని, పోలీసు కేసు కూడా నమోదు చేయించి కఠిన చర్యలు తీసుకుంటామని డా.తిరుపతిరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని