logo

ఎత్తు పెంపునకు మోక్షం ఎన్నడో..!

జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట (వనదుర్గా) ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ముందుకు సాగడం లేదు. గతంలో నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకు పూర్తి చేయలేదు.

Published : 23 Jan 2022 02:59 IST
ఐదేళ్లుగా పూర్తికాని వనదుర్గా ప్రాజెక్టు పనులు
ఘనపురం ఆనకట్ట

న్యూస్‌టుడే, పాపన్నపేట: జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు ఘనపురం ఆనకట్ట (వనదుర్గా) ప్రాజెక్టు ఎత్తు పెంపు పనులు ముందుకు సాగడం లేదు. గతంలో నిధులు మంజూరవడంతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు కావస్తున్నా ఇంత వరకు పూర్తి చేయలేదు. కొల్చారం-పాపన్నపేట మండలాల మధ్య 1905లో మంజీరా నదిపై ఘనపురం ఆనకట్టను నిర్మించగా దీని పూర్తి సామర్థ్యం 0.135 టీఎంసీలు. ఇది ఇలా ఉండగా ఈ ప్రాజెక్టు కింద 21,625 ఎకరాల సాగు భూమి ఉంది. ప్రాజెక్టుకు రెండు కాల్వలు ఉన్నాయి. మహబూబ్‌నహర్‌ కాల్వ ద్వారా కొల్చారం, మెదక్‌, హవేలి ఘనపూర్‌ మండలాలకు, ఫతేనహర్‌ కాల్వ ద్వారా పాపన్నపేట మండలంలోని పంట పొలాలకు నీరు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆనకట్ట కింద సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో పాటు చివరి ఆయకట్టుకు కూడా నీరందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తు పెంపునకు నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 2016లో రూ.43.64 కోట్లతో పనులు ప్రారంభించగా ఐదేళ్లు దాటుతున్నా ఇంకా పనులు పూర్తికాలేదు. మొదట్లో ఎత్తు పెంపు పనుల్లో భాగంగా వరద తాకిడిని తట్టుకునేందుకు పునాది, ఆప్రాన్‌ పనులను చేపట్టారు. భూసేకరణ, పరిహారం చెల్లించడంలో జాప్యంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. ఇందులో రూ.13.1 కోట్లను భూసేకరణ కోసం, మిగతా వాటిని ఎత్తు పెంపు పనులకు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రస్తుతం ఆనకట్ట ఎత్తు 462.775 జీటీఎస్‌ లెవల్‌ ఉండగా ఎత్తును 464.7 జీటీఎస్‌ లెవల్‌కు పెంచాల్సి ఉంది. తద్వారా పాపన్నపేట, కొల్చారం మండలాల్లోని సుమారు 300 మంది రైతులకు చెందిన 191 ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. ఎత్తు పెంచడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 0.3 టీఎంసీలకు పెరగనుంది. దీంతో అదనంగా ఐదు వేల ఎకరాలకు, మరీ ముఖ్యంగా యాసంగిలో సింగూరుపై ఆధారపడకుండా చివరి ఆయకట్టు వరకు నీటిని అందించవచ్చు. ఎత్తు పెంచే ప్రక్రియలో భాగంగా ముంపునకు గురయ్యే పొలాలకు ఎకరాకు రూ.7.56 లక్షలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం రూ.13.1 కోట్లకుగాను రూ.5 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. రూ.లక్షలు విలువ చేసే భూములకు ప్రభుత్వం నామమాత్రం పరిహారం ఇస్తుందని గతంలో రైతులు ఆందోళనకు దిగారు. న్యాయంగా పరిహారం చెల్లించిన తర్వాతే పనులు ప్రారంభించాలన్నారు. నిధులు కూడా పూర్తిగా రాకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి పరిహారాన్ని విడుదల చేసి, ఎత్తు పెంచాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.


వరద తాకిడిని తట్టుకునేందుకు ఆప్రాన్‌ను నిర్మించారిలా..

న్యాయపరమైన పరిహారం చెల్లించాలి..- హన్మంతు, రైతు, కొడుపాక

ముంపునకు గురవుతున్న భూములకు న్యాయపరమైన పరిహారం చెల్లించిన తర్వాతే పనులు మొదలుపెట్టాలి. అధికారులు అంచనా వేసిన భూముల కంటే అధికంగా ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. ఎత్తు పెంచితే ఆయకట్టు పరిధిలోని అన్నదాతలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

ప్రతిపాదనలు పంపించాం.. - శ్రీనివాసరావు, ఈఈ, నీటి పారుదల శాఖ

భూసేకరణకు సంబంధించిన పరిహారం కోసం ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించాం. నిధులు రావాల్సి ఉంది. అవి రాగానే పనులు ప్రారంభిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని