logo

ప్రయోగాత్మకం.. మెరుగైన ఆదాయమే లక్ష్యం

అన్నదాతలకు అన్నీ కష్టాలే. ఆరుగాలం శ్రమించినా చివరికి నష్టాలే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వ్యయప్రయాసలకు తట్టుకుని పంటలు పండించినా గిట్టుబాటు ధర అనుమానమే. పండ్ల తోటల్లో రైతులకు ఈ సమస్య ఉండదు.

Published : 05 Oct 2022 00:59 IST

ఎఫ్‌ఆర్‌ఎస్‌లో సిద్ధమవుతున్న మొక్కలు
న్యూస్‌టుడే, సంగారెడ్డి టౌన్‌

అన్నదాతలకు అన్నీ కష్టాలే. ఆరుగాలం శ్రమించినా చివరికి నష్టాలే అన్నట్లుగా ఉంది పరిస్థితి. వ్యయప్రయాసలకు తట్టుకుని పంటలు పండించినా గిట్టుబాటు ధర అనుమానమే. పండ్ల తోటల్లో రైతులకు ఈ సమస్య ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎక్కువ మంది ఇప్పుడు తోటల పెంపకం దిశగా ముందుకు సాగుతున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా నాణ్యమైన మొక్కలు అందుబాటులో ఉంచాలన్న లక్ష్యంతో సంగారెడ్డిలోని కొండా లక్ష్మణ్‌ ఫల పరిశోధన స్థానం కార్యాచరణ రూపొందించింది.

నాణ్యమైనవి అందించాలని..
సంగారెడ్డి ఫల పరిశోధన స్థానానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ 50 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాలు తోటలున్నాయి. ఇందులో అత్యధికంగా మామిడి 42.20హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. 470 మామిడి రకాలు ఇక్కడ ఉండటం విశేషం. జామ, సీతాఫలం, సపోట తోటలు కూడా ఉన్నాయి. రైతులకు నాణ్యమైన మొక్కలు అందించాలన్న లక్ష్యంతో నర్సరీలను సైతం నిర్వహిస్తున్నారు.

మామిడిపై ప్రధాన దృష్టి..
మొక్కల్ని నాటేందుకు సిద్ధంగా నర్సరీల్లో పెంచుతున్నారు. ఈ సీజన్‌కు అత్యధికంగా మామిడి మొక్కలు 75వేలు సిద్ధం చేసి విక్రయించారు. కరోండా, ప్యాషన్‌ ఫ్రూట్‌, నిమ్మ, జామతోపాటు ఆయుర్వేద మొక్కల్ని పెంచుతున్నారు. మొక్కల్ని అంటుకట్టేందుకు పుల్లల సేకరణకు ఇబ్బంది లేకుండా ప్రత్యేకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో మదర్‌ బ్లాక్‌(తల్లి మొక్కలు)ను ఇక్కడ ఏర్పాటు చేశారు. మదర్‌ బ్లాక్‌ ద్వారా 64 మామిడి రకాల మొక్కల్ని పెంచనున్నారు. ఐదేళ్ల కిందటే ఈ బ్లాక్‌ను ఏర్పాటు చేయడంతో ప్రస్తుతం మొక్కలు అంటుగట్టేందుకు అవసరమైన పుల్లల్ని ఇందులోంచే సేకరిస్తున్నారు.

రెండేళ్లు పరిశీలించిన తర్వాతే..
ప్రస్తుతం ప్రైవేటు నర్సరీల్లో రెండేళ్లు వయస్సు మామిడి మొక్కలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో ఏడాది మొక్కలనే విక్రయిస్తున్నారు. వీటిని నాటితేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెబుతున్నా.. రైతులు పెద్ద మొక్కల వైపు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొక్కల పెంపకాన్ని ప్రయోగాత్మకంగా కొత్తగా ప్రారంభించారు. వీటిలో కొన్ని మొక్కల్ని ఏడాది కాగానే పరీక్షించనున్నారు. వేర్లు బలంగా ఉన్నాయా లేదా అని గమనిస్తారు. మిగతా మొక్కల్ని విత్తిన రెండేళ్ల తర్వాత మొదట ఎఫ్‌ఆర్‌ఎస్‌లోనే నాటి ఫలితాలను బట్టి నర్సరీల్లో పెద్ద మొక్కల్ని పెంపుపై నిర్ణయం తీసకుంటారు.

అన్నదాతల డిమాండ్‌కు అనుగుణంగా.. : - రాజ్‌కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఎస్‌ ప్రధాన శాస్త్రవేత్త
నాణ్యమైన మొక్కల్ని నర్సరీల్లో పెంచుతున్నాం. తోటలు వేసుకునే వారు ఇక్కడి నుంచి కొనుగోలు చేస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఎఫ్‌ఆర్‌ఎస్‌ నుంచి మొక్కల కొనుగోలుకు ఇతర రాష్ట్రాల నుంచి సైతం వస్తుంటారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని నర్సరీలో పెంచే మొక్కల సంఖ్యను పెంచుతున్నాం. పెద్ద మొక్కల పెంపకాన్ని ఈసారి ప్రయోగాత్మకంగా ప్రారంభించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని