logo

ఉత్తిపోతలు!

అన్నదాతల గోస తీర్చేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. సర్వేతోపాటు, భూసేకరణ పనులు చేపట్టడంతో జహీరాబాద్‌ ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated : 22 Mar 2023 05:34 IST

దృష్టిసారిస్తే మేలు
న్యూస్‌టుడే, జహీరాబాద్‌ అర్బన్‌, కోహీర్‌, న్యాల్‌కల్‌

గొడిగార్‌పల్లి ఎత్తిపోతల పథకం సంప్‌

అన్నదాతల గోస తీర్చేందుకు సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం భారీ నిధులు కేటాయించింది. సర్వేతోపాటు, భూసేకరణ పనులు చేపట్టడంతో జహీరాబాద్‌ ప్రాంత రైతుల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఈ పథకంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 1.05 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇదే సమయంలో పాత పథకాలైన కోహీర్‌ మండలం గొడిగార్‌పల్లి, న్యాల్‌కల్‌ మండలం అమీరాబాద్‌ ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరిస్తే మరింత ప్రయోజనం చేకూరనుంది. గొడిగార్‌పల్లి పెద్ద వాగు ప్రాజెక్టు కింద 1,100 ఎకరాలకు నీటిని అందించేందుకు రూ.కోటితో 2002-03లో ఎత్తిపోతలను ఏర్పాటు చేశారు. న్యాల్‌కల్‌ మండలం మీదుగా సాగే మంజీర నది నిల్వ జలాల (బ్యాక్‌ వాటర్‌)తో 500 పైచీలుకు ఎకరాలకు సాగునీరు అందించేందుకు అమీరాబాద్‌ పథకాన్ని 2002-03లోనే రూ.56 లక్షలతో నిర్మించారు.

పునరుద్ధరణ లేక ప్రశ్నార్థకం

కర్ణాటక నుంచి వచ్చే వాగు నీటిని సద్వినియోగం చేసుకునేందుకు కోహీర్‌ మండలం గొడిగార్‌పల్లి పెద్దవాగు ప్రాజెక్ట్‌పై ఎత్తిపోతలు నిర్మించారు. సిద్ధాపూర్‌తండా, పర్శపల్లి, గొడిగార్‌పల్లితో పాటు జహీరాబాద్‌ మండలంలోని శేఖాపూర్‌, జాడీమల్కాపూర్‌, మల్‌చెల్మ గ్రామాల్లో 1100 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు సంప్‌, 60 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన మూడు మోటార్లు, 60 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు రెండు ఏర్పాటు చేశారు. పథకం పనిచేయక దొంగల పాలయ్యాయి. న్యాల్‌కల్‌ మండలం అమీరాబాద్‌ శివారులో మంజీరా మిగులు జలాలను 500 ఎకరాలకు అందించేలా ఆర్‌ఐడీఎఫ్‌-3 పథకంలో  చేపట్టిన పథకం నిరుపయోగంగా మారింది. ట్రాన్స్‌ఫార్మర్‌, మోటార్లు చోరీకి గురయ్యాయి.

అనుసంధానిస్తే ప్రయోజనం..

జహీరాబాద్‌ నియోజకవర్గంలోని జహీరాబాద్‌- 20,090, ఝరాసంగం-25,800, కోహీర్‌-10,010, న్యాల్‌కల్‌-21,950 చొప్పున మండలాల్లోని ఎకరాలకు సంగమేశ్వర పథకంలో సాగునీరు అందనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.11.42 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం రూపకల్పనలో ఉన్న జల వనరుల శాఖ అధికారులు కోహీర్‌, న్యాల్‌కల్‌ మండలాల్లోని నిరుపయోగంగా ఉన్న పథకాలపై దృష్టిసారించాల్సిన తరుణమిది. ఎంపీ బీబీపాటిల్‌, ఎమ్మెల్యే మాణిక్‌రావు  చొరవ చూపాలని ఆయా మండలాల రైతులు కోరుతున్నారు.


ప్రభుత్వం ఆదేశిస్తే.: విజయ్‌కుమార్‌, ఈఈ జల వనరుల శాఖ జహీరాబాద్‌

దశాబ్దాల కిందట నిర్మించిన ఈ పథకాలు ఎత్తిపోతల కార్పొరేషన్‌ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం ఆయా పథకాల బదలాయింపు చేపట్టి జల వనరుల శాఖకు అప్పగించాలి. సంగమేశ్వర పథకానికి అనుసంధానించేందుకు అనువుగా ఉంటే ప్రతిపాదిస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు