logo

ఉత్కంఠకు తెర

మెదక్‌ నియోజకవర్గంలో భాజపా టికెట్‌ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రెండో జాబితాలో నర్సాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన అధిష్ఠానం, మెదక్‌కు వెల్లడించలేదు.

Updated : 03 Nov 2023 04:48 IST

విజయ్‌కుమార్‌కు మెదక్‌ కమలం టికెట్‌

సమావేశంలో మాట్లాడుతున్న విజయ్‌కుమార్‌

న్యూస్‌టుడే, మెదక్‌: మెదక్‌ నియోజకవర్గంలో భాజపా టికెట్‌ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. రెండో జాబితాలో నర్సాపూర్‌ నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించిన అధిష్ఠానం, మెదక్‌కు వెల్లడించలేదు. గురువారం విడుదల చేసిన మూడో జాబితాలో అభ్యర్థిని ఖరారు చేసింది. ఇక కమలం ప్రచారంలోకి దిగనుంది.

సాఫ్ట్‌వేర్‌ నుంచి: నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్‌కుమార్‌ పీజీ పూర్తి చేశారు. 2000లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా కెరీర్‌ ప్రారంభించారు. అమెరికా, కెనడాల్లో వివిధ కంపెనీల్లో విధులు నిర్వహించారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల వైపు దృష్టి సారించారు. 2014లో స్వదేశానికి చేరుకున్న ఆయన ఓ వైపు ఉద్యోగం చేస్తూనే, స్వగ్రామం నిజాంపేటలో సేవా కార్యక్రమాలను కొనసాగించారు. ఈ క్రమంలో 2019లో భారాసలో చేరి నిజాంపేట జడ్పీటీసీ టికెట్‌ పొంది విజయం సాధించారు. భారాసలో ఉన్న సమయంలో మొదట స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అనుచరుడిగా కొనసాగిన ఆయన ఆ తర్వాత ఎమ్మెల్సీ శేరిసుభాష్‌రెడ్డి వర్గంలో చేరారు. అనంతరం ఆగస్టులో భారాసకు రాజీనామా చేసి భాజపాలో చేరారు.
రెండు నెలలకే..:  నియోజకవర్గం నుంచి భాజపా తరఫున 12 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో జిల్లా అధ్యక్షుడితో పాటు, పార్టీ రాష్ట్ర స్థాయి పదవులు ఉన్న నేతలున్నారు. చివరకు రెండున్నర నెలల కిందట పార్టీలో చేరిన పంజా విజయ్‌కుమార్‌కు టికెట్‌ దక్కడం గమనార్హం. ముదిరాజ్‌ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు భాజపా చేరికల కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆశీస్సులు ఉండడం, ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో విజయ్‌కుమార్‌కు అభ్యర్థిత్వం ఖరారైందని ప్రచారం జరుగుతోంది. జిల్లాలోని రెండు అసెంబ్లీ టికెట్‌లను వెనకబడిన తరగతులకు(బీసీ) ఇవ్వడం విశేషం. మరో వైపు మెదక్‌ టికెట్‌ ఆశించిన 12 మందిలో ఒక్కరికే అభ్యర్థిత్వం ఖరారు కాగా, మిగతా ఆశావహులు పార్టీకి పనిచేస్తామని ఇటీవల ఏడుపాయల్లో ప్రకటించారు. టికెట్‌ ఎవరికి వచ్చినా అందరం కలిసి కట్టుగా ముందుకు సాగుతామని సమావేశంలో నిర్ణయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు