logo

నామపత్రాలతో నాంది

జిల్లా స్థాయిలో లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గానికి కలెక్టరేట్‌లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.

Updated : 18 Apr 2024 06:06 IST

మెదక్‌ లోక్‌సభ స్థానానికి నేటి నుంచి స్వీకరణ

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

లోక్‌సభ ఎన్నికల్లో తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకానుంది. మెదక్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల నుంచి నామ   పత్రాల స్వీకరణకు కలెక్టరేట్‌లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
- న్యూస్‌టుడే, మెదక్‌

 జిల్లా స్థాయిలో లోక్‌సభ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అనంతరం మెదక్‌ లోక్‌సభ నియోజకవర్గానికి కలెక్టరేట్‌లో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కలెక్టరేట్‌ ఉద్యోగులకు వారి గుర్తింపు కార్డుల ఆధారంగా విధుల్లోకి అనుమతిస్తారు. సందర్శకులకు మధ్యాహ్నం 3 తర్వాతే అనుమతి ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్లు సమర్పించాలి. లోక్‌సభ స్థానానికి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారిగా అదనపు కలెక్టర్‌ వెంకటేశ్వర్లు వ్యవహరించనున్నారు.

 సహాయ కేంద్రం ఏర్పాటు

అభ్యర్థులు ఏవిధంగా నామినేషన్‌ వేయాలి.. అందుకు కావాల్సిన పత్రాలు తదితర సందేహాల నివృత్తికి కలెక్టరేట్‌లో సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు. దీంతో పాటు నామపత్రాలు అందజేయడానికి కౌంటర్‌, అభ్యర్థి ఓటరు జాబితాలో పేరు ఉందా? లేదా? అనేది పరిశీలించడానికి మరో కౌంటర్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం మినహా అన్ని రోజుల్లో నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది.

రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌ సూచిక

100 మీటర్ల వరకు నిషేధాజ్ఞలు

రిటర్నింగ్‌ అధికారి(కలెక్టర్‌) ఛాంబర్‌ నుంచి వంద మీటర్ల వరకు నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయి. అభ్యర్థులు కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించడానికి అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత మెదక్‌-రామాయంపేట ప్రధాన గేట్‌ సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు సదుపాయం కల్పించారు. నామినేషన్లు వేసేటప్పుడు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

శుభ ముహూర్తం ఉండడంతో నామినేషన్ల స్వీకరణ తొలిరోజే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ నామపత్రాలను దాఖలు చేయనున్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు, కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు గురువారం నామినేషన్‌ వేయనున్నారు. రఘునందన్‌రావు నామినేషన్‌ కార్యక్రమానికి కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ చేపట్టనున్నారు. నీలం మధు ఈనెల 20న మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్నట్లు కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఆ రోజు రాందాస్‌ చౌరస్తాలో సభ ఉంటుందని పేర్కొన్నారు.

ఐదుగురికి మాత్రమే అనుమతి

నామినేషన్‌ వేసేందుకు రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలోకి అభ్యర్థితో పాటు ఐదుగురిని మాత్రమే అనుమతిస్తారు. నామపత్రాన్ని అభ్యర్థి లేదా ఆయన తరఫున ప్రతిపాదిత వ్యక్తి దాఖలు చేయవచ్చు. ఫారం-2ఏలో నామినేషన్‌ ఫారం సమర్పించాలి. కలెక్టరేట్‌ ఆవరణలోని జాతీయ జెండా వరకు అభ్యర్థి తరఫున మూడు వాహనాలను అనుమతిస్తారు. అక్కడి నుంచి రిటర్నింగ్‌ అధికారి కార్యాలయం వరకు నడుచుకుంటూ వెళ్లాలి.  


పకడ్బందీ ఏర్పాట్లు
రాహుల్‌రాజ్‌, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి

నోటిఫికేషన్‌ గురువారం విడుదల చేయనున్నాం. అనంతరం నామపత్రాలు స్వీకరిస్తాం. అభ్యర్థి పూర్తి వివరాలు తెలియజేసే అఫిడవిట్‌ను అందజేయాలి. లేదంటే తిరస్కరించే అవకాశం ఉంటుంది. పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేశాం.


మూడంచెల భద్రత: డా.బాలస్వామి, ఎస్పీ

మూడంచెల పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేయనున్నాం. కేంద్ర బలగాలు, సాయుధ బలగాలు, సివిల్‌ పోలీసులతో భద్రత ఉంటుంది. రిటర్నింగ్‌ అధికారి ఛాంబర్‌ నుంచి వంద మీటర్ల పరిధిలో బందోబస్తు నిర్వహించనున్నాం. జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేశాం.

అఫిడవిట్‌ కీలకం

అభ్యర్థి ఫారం-26 అఫిడవిట్‌ను సమర్పించాలి. ఇందులో ఆస్తులు, నేరచరిత్ర, ఐదేళ్ల ఆదాయ పన్ను వివరాలను సమర్పించాలి. అభ్యర్థిపై క్రిమినల్‌ కేసులు ఉంటే వివరాలు పొందుపర్చాలి. గతంలో న్యాయస్థానం శిక్ష విధించినా, అప్పీల్‌కు వెళ్లినా ఆ సమాచారం తెలపాలి. కుటుంబసభ్యుల పేరిట ఉన్న స్థిర, చర ఆస్తుల వివరాలతో పాటు బ్యాంకు, చేతిలో ఉన్న నగదు, డిపాజిట్లు, సేవింగ్స్‌, బీమా పాలసీలు, అప్పులు, ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాల వివరాలు ఇవ్వాలి. అభ్యర్థి పేరిట ఉన్న ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఈ-మెయిల్‌ ఖాతా వివరాలను అందజేయాలి. అఫిడవిట్‌లో ప్రతి అంశాన్ని పూరించాలి. ఖాళీగా ఉంచితే తిరస్కరించే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని