logo

లక్ష్యం దిశగా ఉపాధి అడుగులు

రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో కూలీల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి తరుణంలో పల్లెల్లోని రోజువారీ కూలీలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వరంగా మారింది. ఈ పథకం కింద ఉన్న ఊళ్లోనే పనిని చేపడుతూ కుటుంబాలను సాకుతున్నారు. కరోనాతో ఉపాధి కొరవడంతో ఎక్కువ శాతం మంది ఉపాధి హామీ పథకం వైపు మొగ్గుచూపారు. దీంతో నిర్దేశిత గడువుకు ముందుగానే లక్ష్యం పూర్తికానుంది. అధికారుల ప్రత్యేక

Published : 28 Jan 2022 03:13 IST

రాజపేట శివారులో హరితహారంలో మొక్కలు నాటేందుకు శుభ్రం చేస్తున్న ఉపాధి కూలీలు

రాజపేట, న్యూస్‌టుడే: రెండేళ్లుగా కొవిడ్‌ మహమ్మారితో కూలీల జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇలాంటి తరుణంలో పల్లెల్లోని రోజువారీ కూలీలకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం వరంగా మారింది. ఈ పథకం కింద ఉన్న ఊళ్లోనే పనిని చేపడుతూ కుటుంబాలను సాకుతున్నారు. కరోనాతో ఉపాధి కొరవడంతో ఎక్కువ శాతం మంది ఉపాధి హామీ పథకం వైపు మొగ్గుచూపారు. దీంతో నిర్దేశిత గడువుకు ముందుగానే లక్ష్యం పూర్తికానుంది. అధికారుల ప్రత్యేక చొరవ తీసుకోవడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాజపేట మండలంలో ఇప్పటికే నూరుశాతం కూలీలకు పనులు చేయగలిగారు. అడ్డగూడూరు, ఆత్మకూర్‌(ఎం), వలిగొండ, గుండాల మండలాలు యాభై శాతంలోపు పనులతో వెనుకంజలో ఉండగా.. మిగతా మండలాలు లక్ష్యానికి చేరువలో ఉన్నాయి.

ఈసారి చేపట్టిన పనులివీ..

జిల్లాలో మొత్తం 17 మండలాలకు గానూ 3,42,267 కార్డుదారులు ఉపాధి పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ముఖ్యంగా బీడు భూముల అభివృద్ధి, ఫాంపాండ్‌, వ్యవసాయ బావులకు రహదారుల నిర్మాణాలు, హరితహారం, భూమి చదును, నర్సరీల సంరక్షణ, మట్టికట్టల లాంటి పనులు చేపట్టారు. మరో రెండు నెలల గడువు ముగిసేలోగా మరికొన్ని మండలాలు నూరుశాతం పనిదినాలు పూర్తి చేసుకొనే జాబితాలో చేరతాయనడంలో సందేహం లేదు.

సమన్వయంతో లక్ష్యం చేరాం

 

-పరశురాములు, ఏపీవో, రాజపేట

రాజపేట మండలంలో మొత్తం 22,973 జాబ్‌కార్డుదారులున్నారు. జిల్లా అధికారులు నిర్దేశించిన లక్ష్యాన్ని వారి సూచనల మేరకు ఎంపీడీవో నల్ల రామరాజు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో రెండు నెలల ముందుగానే చేరుకోగలిగాం. ముఖ్యంగా కరోనా లాక్‌డౌన్‌ సమయంలో అధికారుల సలహాలను పాటించి పూర్తి స్థాయిలో పనులు కల్పించడం కలిసివచ్చింది. రానున్న రోజుల్లోనూ ఇదే స్ఫూర్తితో ముందుకెళ్తాం.

ప్రణాళికలు రూపొందించాం

-ఉపేందర్‌రెడ్డి, డీఆర్డీవో, యాదాద్రి భువనగిరి

ఈ ఆర్థిక సంవత్సరంలో గడువుకు ముందే ఎంచుకున్న లక్ష్యం చేరేందుకు జిల్లాలోని అన్ని మండలాల్లో ప్రణాళికలు రూపొందించాం. ముఖ్యంగా రాజపేట, ఆలేరు మండలాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారుల సమన్వయంతో ఉపాధి పనులు జరుగుతున్న తీరుపై మిగతా మండలాల అధికారులనూ అప్రమత్తం చేశాం. పనిదినాలు పూర్తి చేసుకున్న జిల్లాగా యాదాద్రికి పేరు తీసుకువచ్చేందుకు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని