logo

అర్థం ఇవ్వని వ్యర్థం

పల్లెలు పరిశుభ్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేసింది. ప్రజారోగ్యంతో పాటు పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూర్చే దిశగా ఆలోచన చేసి అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వాటి ద్వారా కంపోస్టు ఎరువులుగా తయారు చేసి పంచాయతీకి సంపద సమకూర్చాలని ప్రతి గ్రామంలో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు మంజూరు చేసింది.

Published : 19 May 2022 02:49 IST

నల్గొండ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే

మాడ్గులపల్లిలో నిరుపయోగంగా కంపోస్టు ఎరువుల తయారీ షెడ్డు

ల్లెలు పరిశుభ్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. ప్రత్యేక ప్రణాళికతో ముందడుగు వేసింది. ప్రజారోగ్యంతో పాటు పంచాయతీలకు అదనపు ఆదాయం చేకూర్చే దిశగా ఆలోచన చేసి అమలుకు శ్రీకారం చుట్టింది. గ్రామాల్లో ఇంటింటి నుంచి తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి వాటి ద్వారా కంపోస్టు ఎరువులుగా తయారు చేసి పంచాయతీకి సంపద సమకూర్చాలని ప్రతి గ్రామంలో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాలు మంజూరు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. ఎరువుల తయారీ విషయంలో అధికారులు, పంచాయతీలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అతికొద్ది గ్రామాల్లో మాత్రమే కంపోస్టు ఎరువుల తయారీని చేపట్టినా ఇంకా ఎక్కడా అమ్మకాలు ప్రారంభం కాలేదు.

కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం సాధించడానికి ప్రభుత్వం ఇంటింటి నుంచి చెత్త సేకరణ చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీని కోసం ప్రతి పంచాయతీకి ట్రాక్టర్‌ను కొనుగోలు చేయించారు. దాని ద్వారా రోజూ తడి, పొడి చెత్తను సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలించాలి. అక్కడి వేరుచేసి తడిచెత్త ద్వారా కంపోస్టు ఎరువులు తయారు చేసి వాటిని హరితహారం నర్సరీల్లో పెంచుతున్న మొక్కలకు వినియోగించాలి. మిగిలిన ఎరువును రైతులకు కిలో రూ. 10 చొప్పున విక్రయించి వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ అభివృద్ధి పనులకు వినియోగించుకోవాలి. ఈ మేరకు ఉపాధిహామీ పథకం కింద షెడ్డుల నిర్మాణానికి ఒక్కోదానికి రూ. 2.5 లక్షల చొప్పున నిధులు కేటాయించారు.

పర్యవేక్షణ కొరవడటం వల్లే..

పల్లె ప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను చేపట్టింది. ప్రతిగ్రామంలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, సెగ్రిగేషన్‌ షెడ్లను ఏర్పాటు చేసింది. గ్రామాల్లో చెత్త, వ్యర్థ పదార్థాల నిర్వహణ కీలకమైంది. దీని ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం చెత్తను సేకరించి నిర్దేశిత చోటుకు తరలించేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేసింది. అందులో భాగంగా పంచాయతీలు ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. చెత్తను క్రమ పద్ధతిలో సేకరించాలని ప్రభుత్వం రూ. లక్షలు వెచ్చించి ఇంటింటికీ రెండు చెత్త బుట్టలు పంపిణీ చేసింది. చెత్తను డంపింగ్‌ యార్డులకు తరలించి కంపోస్టు ఎరువు తయారు చేయాలని ప్రభుత్వం సూచించింది. కానీ సక్రమంగా అమలు కావడం లేదు. ప్రతి సెగ్రిగేషన్‌ షెడ్డులో కాయగూరలు, ఆకుకూరల వ్యర్థాలు, కుళ్లిన పండ్లు తదితర వాటిని తడి చెత్తగా వేరు చేయాలి. ఇనుము, ప్లాస్టిక్‌, అట్టముక్కలు ఇతరత్రా వాటిని పొడి చెత్తగా వేరు చేయాలి. వీటిని విభాగాల వారీగా కేటాయించాలి. అలా వేరు చేసిన వ్యర్థాల నుంచి కంపోస్టు ఎరువులు తయారు చేయాలి. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లాలో మెజారిటీ గ్రామ పంచాయతీల్లో ముందుకు సాగడం లేదు.

నిర్మాణం పూర్తయినా ..

ఉమ్మడి జిల్లాలో గ్రామాల్లో షెడ్ల నిర్మాణం పూర్తయినా ఇప్పటి వరకు ఎరువులు తయారు చేసి విక్రయించి ఆదాయం పొందడం లేదు. షెడ్లు పూర్తయినా కొన్ని గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ఎరువుల తయారీని ప్రారంభించారు. ఇంకా కొన్నిచోట్ల నిర్మాణం కొనసాగుతుంది. పట్టణాల తరహాలో గ్రామాల్లోనూ పారిశుద్ధ్య కార్మికులు ట్రాక్టర్‌లో రోజు విడిచి రోజు ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. అందుకు పంచాయతీ ద్వారా ఇంటింటికి ఉచితంగా చెత్త బుట్టలు పంపిణీ చేశారు. వీధులు, రహదారుల మీద పారవేయకుండా బుట్టల్లో నిల్వ చేసి పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించేలా ప్రజలకు అవగాహన కల్పించారు. మొదట్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేసిన వారికి జరిమానా కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు వేశారు. చెత్త సేకరణ మెరుగుపడినా ఆ తర్వాత దాన్ని ఎరువుగా తయారు చేసి ఆదాయం సమకూర్చడంలో పట్టించుకోవడం లేదు.

ఎరువుల తయారీకి చర్యలు
- విష్ణువర్ధన్‌రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి, నల్గొండ

జిల్లాలో అన్ని గ్రామాల్లో కంపోస్టు ఎరువు తయారు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. పలు గ్రామాల్లో ఎరువు తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. నిర్మాణ దశలో ఉన్న వాటిని కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేయించి ఎరువుల తయారీ చేయించి పంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.




 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని