logo

సృజనాత్మక చిత్రం.. క్షణాల్లో ఆవిష్కృతం

సృజనాత్మకమైన చిత్రాలు గీయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు  ఓ యువ చిత్రకారిణి. కుంచెలను ఉపయోగించకుండా కూరగాయలు, వివిధ రకాల

Published : 27 May 2022 03:06 IST

కాకరకాయ ముక్కలు బ్రష్‌గా ఉపయోగించి అరుణ వేసిన చిత్రాలు

మఠంపల్లి, న్యూస్‌టుడే: సృజనాత్మకమైన చిత్రాలు గీయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న పట్టుదలతో ముందుకు సాగుతున్నారు  ఓ యువ చిత్రకారిణి. కుంచెలను ఉపయోగించకుండా కూరగాయలు, వివిధ రకాల పండ్లు, పూలతో పాటు వంటగదిలో వాడే వస్తువులతో జీవ కళ ఉట్టిపడే రంగుల చిత్రాలు క్షణాల్లో గీసి అబ్బురపరుస్తున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఎలాంటి నైపుణ్యం లేకున్నా బొమ్మలను ఆలవోకగా గీసే శిక్షణను యూట్యూబ్‌ ద్వారా ఉచితంగా ఇస్తూ తన కళాభిమానాన్ని చాటుకుంటున్నారు. బాల్యం నుంచి ఉన్న అభిరుచే ఈ రంగంలో రాణించేందుకు దోహద పడుతోందని చెబుతోన్న మన్నెం అరుణ స్వగ్రామం మఠంపల్లి. ఎమ్మెస్సీ, బీఎడ్‌ పూర్తి చేసిన ఆమె ఎడ్‌సెట్‌లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు, ఓయూ పరిధిలో జరిగిన పీజీ సెట్‌లో 24వ ర్యాంకు సాధించారు. పదో తరగతిలోనూ 503 మార్కులతో ఈ సరస్వతీ పుత్రిక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ‘అరుణంజయ ఆర్ట్స్‌’ పేరుతో యూట్యూబ్‌ ఛానెల్‌ ప్రారంభించి చిత్రకళపై ఆసక్తి ఉన్న వారికోసం ఇప్పటి వరకు 82 వీడియోలు అప్‌లోడ్‌ చేశారు. శిక్షణ పొందే వారి సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తున్నారు.

అగ్గిపుల్లలను బ్రష్‌గా వాడి గీసిన సుందర చిత్రం

కళకు కాదేదీ అనర్హం
మండల కేంద్రానికి చెందిన మన్నెం నారాయణరెడ్డి, కళావతి దంపతుల కూతురు అరుణ చదువుల్లో రాణిస్తూనే చిత్రకళపై అభిరుచి పెంచుకున్నారు. బొమ్మలను గీయడంలో వైవిధ్యాన్ని చూపాలన్న తలంపుతో బ్రష్‌లను వాడకుండా కాకర, వంకాయ, బెండ, క్యారెట్‌ తదితర కూరగాయలను భిన్న ఆకృతులలో కోసి వాటితో రంగులు అద్దుతూ వివిధ చిత్రాలకు రూపమిస్తున్నారు. చార్టులపై ప్రకృతి సౌందర్యాన్ని గోడలపై ప్రతిబింబించేలా మయూరం, కొలనులో నడయాడే హంసలు వంటి గోడ చిత్రాలు(వాల్‌స్టిక్కర్స్‌) అతి తక్కువ ఖర్చుతో ఇంట్లో అందుబాటులో ఉండే కూరగాయలు, పూలు, గరిటెలు, చెంచాలు, పప్పుగుత్తి తదితర వస్తువులను ఉపయోగించి రంగుల బొమ్మలు వేయడంలో నైపుణ్యాన్ని సాధించి శిక్షకులకు తర్ఫీదు ఇస్తున్నారు.


బీరకాయ పీచుతో రంగులద్దిన చిత్రం

బాపూనే స్ఫూర్తి:
మన్నెం అరుణ చిత్రకారిణి, మఠంపల్లి

ప్రముఖ చిత్రకారుడు బాపు గీసిన బొమ్మలంటే నాకు చాలా ఇష్టం. ఆయన స్పూర్తితోనే చిత్రాలు వేయడం నేర్చుకున్నాను. ఎన్నో చిత్రాలు వేశాను. ఆబాల గోపాలాన్ని అలరించే బొమ్మలు వేయాలన్న పట్టుదల, అందరూ ఆలవోకగా ఈ కళను నేర్చుకోవాలన్న సంకల్పం ప్రత్యేకంగా యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టేలా చేశాయి. ప్రస్తుతం టెట్‌కు సిద్ధమవుతున్నాను. 15 రోజుల తర్వాత మరిన్ని వీడియోలు కళాసాధకుల కోసం అప్‌లోడ్‌ చేస్తాను.

బాపు స్ఫూర్తితో అరుణ వేసిన మనసును దోచే చిత్రాలు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని