logo

అంతులేని కథలు..!

సూర్యాపేట జిల్లాలో యూఐ (అండర్‌ ఇన్వెస్టిగేషన్‌) కేసుల సంఖ్య రోజురోజుకూ కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోంది. కొన్ని ముఖ్యమైన కేసులనూ యూఐ జాబితాల్లోకి నెట్టడంతో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు, కిడ్నాప్‌లు, చోరీ తదితర కేసుల విచారణను సైతం పోలీసు అధికారులు అటకెక్కిస్తున్నారు. మరికొన్ని కేసులు సంవత్సరాలుగా విచారణ

Updated : 08 Aug 2022 06:50 IST

సూర్యాపేట నేరవిభాగం, న్యూస్‌టుడే

సూర్యాపేటలో హత్యకు గురైన ఆలేటి జానకమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు (పాత చిత్రం)

సూర్యాపేట జిల్లాలో యూఐ (అండర్‌ ఇన్వెస్టిగేషన్‌) కేసుల సంఖ్య రోజురోజుకూ కుప్పలుతెప్పలుగా పేరుకుపోతోంది. కొన్ని ముఖ్యమైన కేసులనూ యూఐ జాబితాల్లోకి నెట్టడంతో పోలీసుల తీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హత్యలు, కిడ్నాప్‌లు, చోరీ తదితర కేసుల విచారణను సైతం పోలీసు అధికారులు అటకెక్కిస్తున్నారు. మరికొన్ని కేసులు సంవత్సరాలుగా విచారణ దశలోనే ఉంటున్నాయి. జిల్లాలోని ‘యూఐ’ కేసులపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
విచారణకు ఆధారాలే కీలకం..
తప్పు చేసిన ప్రతి నేరస్థుడు ఎక్కడో ఒకచోట చిన్న ఆధారాన్ని వదిలి వెళ్తాడన్నది పోలీసుల విశ్వాసం. అలాంటి చిన్న ఆధారమే కేసు మిస్టరీని బహిర్గతం చేస్తుంది. అలవాటుగా నేరాలకు పాల్పడే నేరస్థుడి విధానం ఒకలాగా.. కొత్తగా నేరం చేసిన వారైతే మరోలా నేరస్వభావాన్ని పోలీసులు అంచనా కట్టగలుగుతారు. ఇటీవల కాలంలో కొన్ని కేసులు మాత్రం అంతులేని కథలుగానే మిగిలిపోతున్నాయి. నేరస్థులు తెలివిగా ప్రవర్తిస్తున్నారా..? నేరస్థులు వదిలేస్తున్న ఆధారాలను పోలీసులు పసిగట్టలేకపోతున్నారా..? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రైవేటు పంచాయితీలకే మొగ్గు...
జిల్లాలో ఇటీవల పోలీసుల పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. చాలా ఠాణాల్లో ఎస్సైలు ప్రైవేటు పంచాయతీలకు మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. మూడు నెలల క్రితం సూర్యాపేట గ్రామీణ ఎస్సై లవకుమార్‌ ఓ హోటల్‌ నిర్వాహకుడి నుంచి రూ.1.40 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన విషయం విదితమే. ఇటీవల తిరుమలగిరి ఎస్సై లోకేశ్‌పై ఆరోపణలు రావడంతో ఎస్పీ కార్యాలయానికి అటాచ్‌ అయ్యారు. మరోవైపు కొన్ని ఠాణాల్లో ఇసుక దందాలో ఎస్సైలు నిత్యం డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు హల్‌చల్‌ చేస్తున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌ను కంట్రోల్‌ చేయడం, ప్రజాప్రతినిధులకు భద్రత కల్పించడం, ఇతర సాధారణ విధుల్లో తలమునకలై ఉండటంతోనే కొన్ని కేసుల విచారణలు ముందుకు సాగడం లేదని ఓ పోలీసు అధికారి ‘న్యూస్‌టుడే’తో వాపోయారు.
* చివ్వెంల మండలం దురాజ్‌పల్లి సమీపంలో సైదిరెడ్డి అలియాస్‌ సంజీవ, విజయ దంపతులకు చెందిన మూడు నెలల శిశువును ఈ ఏడాది మార్చి 5న గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారు. నూతనకల్‌ గ్రామానికి చెందిన ఈ దంపతులు సంచార జీవనం సాగిస్తూ దురాజ్‌పల్లి గుట్ట సమీపంలో నివాసం ఉంటున్నారు. ఊయలలో ఉన్న చిన్నారిని రెప్పపాటులో దుండగులు ఎత్తుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నాలుగు రోజులు హడావుడి చేసి వదిలేశారు. బాబును ఎవరు ఎత్తుకెళ్లారన్న విషయాన్ని పోలీసులు ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు.

*  2021 మార్చి 23న సాయంత్రం పూట సూర్యాపేట పురపాలిక పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో ఆలేటి జానకమ్మ (70)ను ఇంట్లోనే దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆమె ఒంటిపై తులంన్నర బంగారం, వెండి పట్టీలు ఎత్తుకెళ్లారు. హత్య జరిగిన ప్రాంతం ఎస్పీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండటం గమనార్హం. హత్య జరిగిన రోజు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం కావడంతో దేశ వ్యాప్తంగా సుమారు 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. దీంతో సెల్‌ఫోను కాల్‌ డిటెయిల్‌ రికార్డ్‌ (సీడీఆర్‌) ఆధారంగా దోషులను పట్టుకోవడం ప్రతిబంధకంగా మారిందని పోలీసులు సెలవిస్తున్నారు. రెండేళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న జానకమ్మను ఎవరు హత్య చేశారో కనిపెట్టడం పోలీసులకు ఇప్పటికీ సవాల్‌గా మిగిలిపోయింది.
* జాజిరెడ్డిగూడెం మండలం రామన్నగూడెం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిద్రిస్తుండగా 2019 డిసెంబరులో జడ బుచ్చయ్య (72)ను గుర్తుతెలియని వ్యక్తులు గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. హత్య జరిగి రెండున్నరేళ్లు పూర్తయినా నేటికీ దోషులను పోలీసులు గుర్తించలేకపోయారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టినా ఫలితం లేకపోవడంతో ఇటీవల పోలీసులు ఈ కేసు ఫైల్‌ను మూసేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని