logo

మారని రాత.. తీరని వెత

వారం రోజులక్రితం నల్గొండలోని దేవరకొండ రోడ్డుకు చెందిన షన్ముఖచారి కడుపులో మంట వస్తుందని ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు. పరీక్షించిన వైద్యుడు కడుపులో మంట తగ్గడానికి వాల్యూ-20 ఎంజీ మాత్ర వారం రోజులు పరిగడుపున వేసుకోవాలని సూచించారు.

Updated : 01 Feb 2023 06:08 IST

జనరల్‌ ఆసుపత్రిలో వైద్యులు రాసిన రోగి సమాచారం, మందులు

వారం రోజులక్రితం నల్గొండలోని దేవరకొండ రోడ్డుకు చెందిన షన్ముఖచారి కడుపులో మంట వస్తుందని ఓ ప్రైవేటు వైద్యుడిని సంప్రదించారు. పరీక్షించిన వైద్యుడు కడుపులో మంట తగ్గడానికి వాల్యూ-20 ఎంజీ మాత్ర వారం రోజులు పరిగడుపున వేసుకోవాలని సూచించారు. కానీ.. ఔషధాల దుకాణ నిర్వాహకుడు వాలిమ్‌-2 ఎంజీ అనే నిద్ర మాత్రలు ఇచ్చారు. దీంతో బాధితుడు రోజూ ఉదయం ఆ మాత్ర వేసుకుని నిద్రలోకి జారుకుంటున్నారు. మూడు రోజుల తరువాత మరో ప్రాంతంలోని ఔషధాల దుకాణదారుడిని సంప్రదిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ఓ ప్రైవేటు వైద్యుడు రాసిన మందుల చీటి


నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: జనరల్‌, ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే ప్రభుత్వ వైద్యులతో పాటు ప్రైవేటు వైద్యులు రెండు వేల వరకు ఉన్నారు. వీరితో పాటు నాలుగు వేల మంది ఆర్‌ఎంపీ, పీఎంపీల పేరుతో గ్రామీణ వైద్యులుగా కొనసాగుతున్నారు. వీరిలో 80 శాతం మంది రోగుల కోసం రాసే మాత్రలు, ఇంజెక్షన్లను అర్ధం కానటువంటి భాషలో రాస్తారు. మరో 40 శాతం మంది వైద్యుల చేతి రాతలు వారికి సంబంధించిన ఔషధ దుకాణదారులకు మాత్రమే అర్ధమవుతాయి. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం 2016లో రోగికి అర్ధమయ్యేలా పెద్దక్షరాల్లో (క్యాప్టల్‌ లెటర్స్‌) రాయాలని అప్పటి ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ.. దీనిని జిల్లాలో ఎక్కడా పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదు. దీంతో రోగులు ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ఆర్థికంగా నష్టపోతున్నారు. అర్ధం కానటువంటి రాతలు రాసే వైద్యలకు జరిమానా వేయడం, లైసెన్సులు రద్దు చేయాల్సి ఉన్నా.. అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతో చేతిరాతల్లో వైద్యులు ఏమాత్రం మారడంలేదు.


జరిమానా విధించాలి..
చిలుకూరి పరమాత్మ, డ్రగ్గిస్టు రాష్ట్ర కార్యదర్శి

వైద్యుల చేతి రాతపై 2018 ఆగస్టు 9న అప్పటి పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీ ఛైర్మన్‌కు 670 పేజీల లేఖలు పంపారు. అయినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీనిపై న్యాయ స్థానాన్ని  కూడా సంప్రదించాం. కొంత మంది వైద్యుల చేతి రాతలు ఫార్మాసిస్టులకు కూడా అర్ధం కావడం లేదు. ఎన్‌ఎంసీ నిబంధనల ప్రకారం వైద్యుల చేతి రాతలు ప్రతి ఒక్కరికీ అర్ధమయ్యేలా ఉండాలి. దుకాణదారుడికి వైద్యుల రాత అర్ధం కాకుంటే ఏదో ఒక మందు ఇస్తున్నారు.


చర్యలు తీసుకుంటాం..
- అన్నిమల కొండల్‌రావు, డీఎంహెచ్‌వో, నల్గొండ

ప్రతి వైద్యుడు క్యాప్టల్‌ లెటర్‌లోనే మందులు రాయాలి అనే జీవో కూడా ఉంది. ప్రస్తుతానికి దీనిని ఎక్కువ శాతం వైద్యులు పాటించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనిపై పలు సమావేశాల్లోనూ చర్చించి సూచనలు చేస్తున్నాం. వైద్యులు నిబంధనలు పాటించకుంటే చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని