logo

పోయేవారే.. మరి వచ్చేవారేరీ..!

ఆర్టీసీలో గత పదేళ్లుగా నూతన నియామకాలు చేపట్టడం లేదు.దీంతో ఉద్యోగుల సంఖ్య ఏటా భారీగా తగ్గిపోతోంది.

Published : 31 Mar 2023 04:39 IST

ఆర్టీసీలో పదేళ్లుగా నిలిచిన కొలువుల భర్తీ

మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: ఆర్టీసీలో గత పదేళ్లుగా నూతన నియామకాలు చేపట్టడం లేదు.దీంతో ఉద్యోగుల సంఖ్య ఏటా భారీగా తగ్గిపోతోంది. ఫలితంగా    ప్రజలకు మెరుగైన సేవలు అందకపోవడంతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతుందని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా 2013లో ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2015లో సుమారు 3,000 మంది డ్రైవర్లు, కండక్టర్లు ఉండగా.. 2021 నాటికి 2,377 మంది, ప్రస్తుతం 2,005 మంది మాత్రమే ఉన్నారు. ఏటా సుమారు 120 మంది ఉద్యోగ విరమణ చేస్తున్నప్పటికీ నూతన నియామకాలు చేపట్టకపోవడంతో సిబ్బంది సంఖ్య భారీగా తగ్గుతూ వస్తోంది.


ఉద్యోగులపై ఒత్తిడి..

ఉమ్మడి జిల్లాలోని ఏడు డిపోల పరిధిలో 2021లో 1,227 మంది కండక్టర్లు, 1,150 డ్రైవర్లు ఉండగా..2023లో కండక్టర్లు 1,104 మంది, డ్రైవర్లు 901 మందికి తగ్గారు. రెండేళ్లలో డ్రైవర్లు 249, కండక్టర్లు 123 మంది.. మొత్తమ్మీద 372 మంది కార్మికులు ఉద్యోగ విరమణ చేశారు. నూతన ఉద్యోగాల నియామకం చేపట్టకపోవడంతో ఉన్న వారిపై పని ఒత్తిడి పెరుగుతుందని కార్మికులు వాపోతున్నారు. అదనపు విధులు, అదనపు పనిగంటలు చేయాల్సి వస్తుండడంతో కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతేడాది స్వచ్ఛంద పదవీ విరమణ పథకం ప్రవేశ పెట్టగా పదుల సంఖ్యలో కార్మికులు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. ఒత్తిడి కారణంగా అనేక మంది అనారోగ్యంతో మరణిస్తున్నట్లు కార్మిక సంఘాలు చెబుతున్నాయి.


భారీగా పెరిగిన అద్దె బస్సులు..

మరో వైపు ఆర్టీసీలో అద్దె బస్సుల హవా నడుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని అన్ని డిపోల్లో ఆర్టీసీ బస్సులతో సమానంగా అద్దె బస్సులు ఉండగా..నార్కట్‌పల్లి డిపోలో మాత్రం ఆర్టీసీ బస్సులు 3,  అద్దె బస్సులు 11 ఉన్నాయి. 2021లో ఆర్టీసీ బస్సుల సంఖ్య 484 ఉండగా..ప్రస్తుతం 387కు తగ్గాయి. దీంతో ప్రయాణికులను చేరవేసేందుకు అద్దె బస్సులే దిక్కయ్యాయి. అయితే అద్దె బస్సుల్లో డ్రైవర్లు ప్రైవేట్‌ వారే ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్లకు విధులు కేటాయించడం కష్టంగా మారింది. దీంతో తమ ఉద్యోగాలకు ఎక్కడ ఎసరు పెడతారేమోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని