logo

ప్రవేశాలకు వేళాయె..!

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది.

Updated : 31 Mar 2023 06:14 IST

మిర్యాలగూడలోని కేంద్రీయ విద్యాలయం

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటూ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. ఒకటో తరగతిలో ప్రవేశానికి ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఇటీవలే ప్రారంభం కాగా.. ఆపై తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి ఏప్రిల్‌ మూడు నుంచి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

* ఉమ్మడి జిల్లాలో నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరిలో కేంద్రీయ విద్యాలయాలు ఉన్నాయి. సీబీఎస్‌ఈ సిలబస్‌తో పాటు క్రీడలు, యోగా, స్కౌట్స్‌, ఎన్‌సీసీల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తారు. ప్రవేశాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, మాజీ సైనికోద్యోగుల పిల్లలకు మొదటి ప్రాధాన్యం.  కేంద్ర ప్రభుత్వ అనుబంధ, రాష్ట్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థల ఉద్యోగుల పిల్లలకు వరుసగా ప్రాధాన్యం కల్పిస్తారు. సాధారణ విద్యార్థులకు చివరి ప్రాధాన్యం  ఇస్తారు.


ఒకటో తరగతిలో 80 మంది..

ఒకటో తరగతిలో ప్రతి పాఠశాలలో సెక్షన్‌కు 40 మంది చొప్పున మొత్తం రెండు సెక్షన్లకు కలిపి 80 మందికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు 2023 మార్చి 31 నాటికి ఆరేళ్లు పూర్తయి, ఎనిమిదేళ్ల లోపు ఉండాలి. ఏప్రిల్‌ 17 వరకు http:///kvsonlineadmission.kvs.gov.in వెబ్‌సైట్‌లో కానీ.. కేవీఎస్‌ అడ్మిషన్‌ యాప్‌లో  దరఖాస్తు చేసుకోవాలి.
*  రెండు నుంచి పై తరగతులకు ఆఫ్‌లైన్‌లో నేరుగా పాఠశాలల్లోనే దరఖాస్తు చేసుకోవాలి. ఆయా పాఠశాలల్లోని ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఏప్రిల్‌ 3 నుంచి 12 వరకు దరఖాస్తులకు అవకాశం ఉంది. ఏకైక సంతానం ఉన్న బాలికలకు తొలి ప్రాధాన్యం ఇస్తారు. మెరిట్‌ జాబితాను ఏప్రిల్‌ 17న వెల్లడిస్తారు.
*    ఎనిమిదో తరగతి వరకు ప్రవేశ పరీక్షలు ఉండవు. సీట్ల సంఖ్య కంటే దరఖాస్తులు ఎక్కువగా ఉంటే లాటరీ పద్ధతిలో విద్యార్థులకు ఎంపిక చేస్తారు. తొమ్మిదో తరగతిలో ప్రవేశానికి అర్హత పరీక్ష నిర్వహిస్తారు. పదకొండో తరగతిలో ప్రవేశాలకు పదో తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు.


పారదర్శకంగా విద్యార్థుల ఎంపిక

- మిన్నీ ముల్లత్‌, ప్రిన్సిపల్‌, కేంద్రీయ విద్యాలయం, మిర్యాలగూడ.

కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఆపై తరగతుల్లో మిగులు సీట్ల భర్తీకి  ఏప్రిల్‌ మూడు నుంచి ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తాం. విద్యార్థుల ఎంపిక జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో పారదర్శకంగా జరుగుతుంది.


తరగతుల వారీగా అర్హత వయస్సుల వివరాలు..

రెండు, మూడో తరగతిలో ప్రవేశానికి ఏడు నుంచి తొమ్మిదేళ్లు, నాలుగో తరగతికి 8 నుంచి 10, ఐదో తరగతికి 9 నుంచి 11, ఆరో తరగతికి 10 నుంచి 12, ఏడో తరగతికి 11 నుంచి 13 వరకు, ఎనిమిదో తరగతికి 12 నుంచి 14 వరకు, తొమ్మిదో తరగతికి 13 నుంచి 15, పదో తరగతికి 14 నుంచి 16ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రిజర్వేషన్‌ కేటగిరీ విద్యార్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని