logo

శిక్షకులేరీ..?

వేసవి ఎండలు మండుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సరదా కోసం ఈతకు వెళ్తున్నారు. చిన్నారులు వేసవి సెలవుల్లోనే ఈత నేర్చుకుంటారు.

Published : 17 Apr 2024 06:14 IST

నిబంధనలకు విరుద్ధంగా ఈత కొలనుల నిర్వహణ

సూర్యాపేటలో కొనసాగుతున్న ప్రైౖవేటు ఈత కొలను

సూర్యాపేట పురపాలిక, చిట్యాల,  న్యూస్‌టుడే: వేసవి ఎండలు మండుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సరదా కోసం ఈతకు వెళ్తున్నారు. చిన్నారులు వేసవి సెలవుల్లోనే ఈత నేర్చుకుంటారు. ఇందుకు కొందరు వ్యవసాయ భూములు, కుంటలు, చెరువుల వద్దకు వెళ్తున్నారు. ఇలాంటి చోట్ల తల్లిదండ్రులు, ఈత వచ్చిన వారి పర్యవేక్షణ తప్పనిసరి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో పదుల సంఖ్యలో ఈతకొలనులు ఉన్నాయి. వాటిలో చిన్నారులు భద్రతాపరంగా అన్ని సౌకర్యాలు, నిష్ణాతులైన శిక్షకులు, సిబ్బంది ఉన్న వాటినే ఎంచుకోవాలి. లేదంటే ఈత నేర్చుకునే క్రమంలో చిన్నారులు నీటిమునిగే ప్రమాదం ఉంది. సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు పట్టణ ప్రాంత చిన్నారులు ఉదయం, సాయంత్రం స్థానిక ఈత కొలనుల్లో శిక్షణకు వెళ్తున్నారు. కొందరు చిన్నారులు తమ తండ్రితో వచ్చి సాధన చేస్తున్నారు. మరికొందరు శిక్షకుల పర్యవేక్షణలో నేర్చుకుంటున్నారు. పురపాలికల్లో ఎక్కడా కూడా శిక్షకులు లేరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ప్రభుత్వ ఈత కొలనులు లేవు. అన్నీ ప్రైవేటువే. వీటి వద్ద నిబంధనలు పాటించటం లేదని, కనీసం శిక్షకులు కూడా ఉండటం లేదని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఈత నేర్చుకోవాలనే పిల్లలు, యువత కుతుహలాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేటు వ్యక్తులు అనుమతి తీసుకోకుండా, శిక్షకులు, ప్రాథమిక చికిత్సకు అవసరమైన ఏర్పాట్లు, కనీస నిబంధనలు పాటించకుండానే ఈత కొలనులను నడుపుతున్నారు. చిట్యాలలో ఏర్పాటుచేసిన ఓ ప్రైవేటు ఈత కొలనులో ఈతకు వెళ్లిన నూనె శ్రవణ్‌కుమార్‌ అనే యువకుడు సోమవారô నీట మునిగి దుర్మరణం పాలయ్యారు. దీని నిర్వాహకులు పురపాలిక నుంచి అనుమతులు తీసుకోలేదు. పైగా ఇక్కడ శిక్షకులూ లేరు. నిబంధనల అమలుపై బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని దర్యాప్తులో గుర్తించి ఆ ఈతకొలనును సీజ్‌ చేసినట్లు చిట్యాల ఎస్సై సైదాబాబు పేర్కొన్నారు.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • ఈత కొలనుల నిర్వాహకులు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌(ఎన్‌ఐఎస్‌) ధ్రువపత్రం ఉన్న శిక్షకులు కనీసం నలుగురు, అనుభవం ఉన్న లైఫ్‌గార్డులు, లైఫ్‌ సేవర్లను నియమించుకోవాలి.
  • ఎక్కడ కూడా నిపుణులైన శిక్షకులు లేరు. కేవలం లైఫ్‌ సేవర్‌, లైఫ్‌గార్డు ధ్రువపత్రాలున్న వారితోనే ఈతకొలనులు నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోవటం లేదు.
  • చిన్నారులకు చర్మవ్యాధులు, అలర్జీలు రాకుండా ఈత కొలనుల్లో మలినాలు లేకుండా రసాయనాలతో నిత్యం శుద్ధి చేయాలి.
  • కొలనులకు ఇరువైపులా తాడు, ట్యూబులు, వెదురు బొంగులు అందుబాటులో ఉంచాలి. ఎవరైనా నీట మునిగితే వెంటనే తాళ్లను నీటిలోకి విసిరి, వెదురుబొంగులు అందించి పైకి లాగేందుకు అవకాశం ఉంటుంది.
  • ప్రైవేటు ఈతకొలనుల్లో భద్రతపరంగా అన్ని ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో డీఎస్‌ఏ అధికారులు తనిఖీలు చేయాల్సిన అవసరముంది.
  • తల్లిదండ్రులు కూడా అన్నీ పరిశీలించాకే పిల్లలను పంపించాలి. చిన్నారుల చెవులు, కళ్లల్లోకి నీరు పోకుండా క్యాప్‌, కళ్లజోడు వాడాలి.

కచ్చితంగా నిబంధనలు పాటించాలి
- శ్రీనివాస్‌, పుర కమిషనర్‌, సూర్యాపేట

పురపాలికల్లో ప్రైవేటు ఈత కొలనులు నిర్వహించేవారు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. నిర్వాహకులు కనీస నిబంధనలు పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చేపడితే చర్యలు తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని