logo

భారీగా పెరిగారు..!

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి..

Updated : 18 Apr 2024 06:12 IST

మిర్యాలగూడ పట్టణం, న్యూస్‌టుడే: నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. ఒక రిజర్వుడు, ఒక జనరల్‌ స్థానం నుంచి ఇద్దరు లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేవారు. 1952, 1957లో జరిగిన రెండు ఎన్నికల్లోనూ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండేది. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకటే లోక్‌సభ స్థానం ఉండగా.. తొలి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య 7,29,504 ఉండేది. 1962లో మిర్యాలగూడ నియోజకవర్గం కొత్తగా ఏర్పడడంతో నల్గొండ ఓటర్ల సంఖ్య 4,46,641కు తగ్గిపోయింది. ప్రతి ఎన్నికల నాటికి వారి సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. ప్రస్తుతం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 17,18,954 మంది ఓటర్లు ఉన్నారు.

పునర్విభజనతో తగ్గారు..

ప్రతి ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య పెరుగుతూ వస్తుండగా.. 1996 నుంచి 1998 నాటికి 31,491 మంది ఓటర్లు తగ్గారు. అనంతరం 2004లో 16,05,163 మంది ఓటర్లు ఉండగా.. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో జరిగిన ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య 14,55,016కి తగ్గింది. అప్పటి నుంచి ఏటా ఓటర్లు పెరుగుతూ ప్రస్తుతం 17 లక్షలు దాటింది.


నామినేషన్‌ ఫీజు పెంపునకు నల్గొండ ప్రజలే కారణం

ఏ ఎన్నికల్లో పోటీ చేయాలన్నా అభ్యర్థులు నామినేషన్‌ వేసే సమయంలో రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే గతంలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.500, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉండేది. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి సాధారణ అభ్యర్థులు రూ.250, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.125 చెల్లించాల్సి ఉండేది. ఫ్లోరైడ్‌ బాధితులు, రైతులు తమ ఉద్యమంలో భాగంగా 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి 537 మంది నామినేషన్లు వేయగా.. పరిశీలన తర్వాత 480 మంది బరిలో ఉన్నారు. దీంతో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘానికి తలనొప్పిగా మారింది. నెల రోజుల పాటు పోలింగ్‌ వాయిదా వేసి బుక్‌లెట్‌ ఆకారంలో బ్యాలెట్‌ పత్రం రూపొందించి.. బ్యాలెట్‌ పెట్టెలు పెద్ద సైజులో చేయించి.. ఎన్నికలు నిర్వహించారు. దీంతో ఓట్ల లెక్కింపునకు సైతం రెండు రోజుల సమయం పట్టింది. ఈ ఎన్నిక తర్వాత ఎన్నికల సంఘం పలు సంస్కరణలు చేపట్టింది. ముఖ్యంగా నామినేషన్‌ డిపాజిట్‌ రుసుమును సాధారణ అభ్యర్థులకు రూ.500 నుంచి రూ.25 వేలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.12,500కు పెంచింది. అదే విధంగా శాసనసభ ఎన్నికల్లో జనరల్‌ అభ్యర్థులకు రూ.250 నుంచి రూ.10వేలకు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.125 నుంచి రూ.5వేలకు పెంచింది.

న్యూస్‌టుడే, మిర్యాలగూడ పట్టణం


ఎన్నికల అనుమతులకు.. సువిధ పోర్టల్‌

నాంపల్లి, భానుపురి, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు జరగకుండా పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. సాంకేతికతను ఉపయోగించి ఓటింగ్‌ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తోంది. ర్యాలీలు మొదలుకొని ప్రదర్శనల వరకు ఎలాంటి అనుమతులు కావాలన్నా సంబంధిత అధికారులు, పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాల్సిందే. ఇందుకోసం ఎన్నికల కమిషన్‌ ‘సువిధ పోర్టల్‌’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ పోర్టల్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న 48 గంటల్లో అనుమతులు లభిస్తాయి.

అన్ని ప్రచార అనుమతులకు..

అభ్యర్థులు ముందుగా https://suvidha.eci.gov.in  వెబ్‌సైట్లో లాగిన్‌ అవ్వాలి. అనంతరం మీటింగ్‌లు, ర్యాలీలు, వాహనాలు, తాత్కాలిక పార్టీ కార్యాలయం ఏర్పాటు హెలికాప్టర్‌, హెలీప్యాడ్‌, ఇంటింటి ప్రచారం, బ్యానర్లు, పార్టీ జెండాలు, ఎయిర్‌ బెలూన్లు, వీడియో వ్యాన్‌లు, హోర్డింగ్‌ల ఏర్పాటు, కరపత్రాల పంపిణీ అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలి. సువిధ పోర్టల్‌ ద్వారా నామినేషన్‌ సమర్పించే వెసులుబాటు సైతం ఉంది. ఆన్‌లైన్‌లోనూ నియోజకవర్గ ఎన్నికల కార్యాలయంలో ప్రచార అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు