logo

నవశకానికి..నాంది!

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతన భౌగోళిక స్వరూపంతో పరిపాలనకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం.. సోమవారం ఉదయం నుంచి పరిపాలన సాగించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొత్త జిల్లాల

Published : 04 Apr 2022 02:27 IST

8 అసెంబ్లీ నియోజకవర్గాలతో జిల్లా

నేటి నుంచి పరిపాలనకు శ్రీకారం

పేరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
జిల్లా కేంద్రం నెల్లూరు
విస్తీర్ణం 10,441 చ.కి.మీ
జనాభా 24.697 లక్షలు
అసెంబ్లీ నియోజకవర్గాలు 8
(కోవూరు, నెల్లూరు నగరం, నెల్లూరు గ్రామీణం, సర్వేపల్లి, ఆత్మకూరు,  ఉదయగిరి, కావలి, కందుకూరు)

రెవెన్యూ డివిజన్లు: 4 (నెల్లూరు, కావలి, కందుకూరు, ఆత్మకూరు)

నెల్లూరు

నెల్లూరు గ్రామీణం, నెల్లూరు నగరం, కోవూరు, బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, తోటపల్లి గూడూరు, ముత్తుకూరు, వెంకటాచలం, మనుబోలు, పొదలకూరు, సైదాపురం, రాపూరు.

కావలి

కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, దుత్తలూరు, విడవలూరు, కొడవలూరు, వింజమూరు

కందుకూరు

కందుకూరు, లింగసముద్రం, గుడ్లూరు, ఉలవపాడు, వలేటివారిపాలెం, కొండాపురం, వరికుంటపాడు

ఆత్మకూరు

ఆత్మకూరు, చేజర్ల, అనుమ సముద్రంపేట, మర్రిపాడు, సంగం, అనంతసాగరం, ఉదయగిరి, సీతారామపురం, కలువాయి

ఈనాడు డిజిటల్, నెల్లూరు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నూతన భౌగోళిక స్వరూపంతో పరిపాలనకు సిద్ధమైంది. ఇప్పటికే ప్రక్రియను పూర్తి చేసిన జిల్లా యంత్రాంగం.. సోమవారం ఉదయం నుంచి పరిపాలన సాగించేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కొత్త జిల్లాల అవతరణను ప్రారంభించిన వెంటనే.. పాలనకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉంది. తొలుత ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలని నిర్ణయించారు. సర్వేపల్లిని నెల్లూరులోనే ఉంచి.. మిగతా మూడు నియోజకవర్గాలను తిరుపతి జిల్లాలో కలిపారు. జనవరి 25న విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. కొత్తగా ఏర్పడే నెల్లూరు జిల్లాలో మూడు రెవెన్యూ డివిజన్లు.. 35 మండలాలు ఉన్నాయి. మొత్తం విస్తీర్ణం 9,141 చ.కి.మీలు ఉండగా.. 2011 జనాభా లెక్కల ప్రకారం 23.37 లక్షల మంది ఉన్నారు. అనంతరం ప్రజల నుంచి అభ్యంతరాలు తెలిపేందుకు ఫిబ్రవరి నెలాఖరు వరకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ఈ సమయంలో గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలపడంతో పాటు.. ఉదయగిరి జిల్లాగా ప్రకటించాలని, కందుకూరును నెల్లూరులో కలపొద్దని, వెంకటగిరి నియోజకవర్గంలోని కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులోనే ఉంచాలని దాదాపు 45 అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను నెల్లూరులోనే ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. దీనిపై మార్చి 30వ తేదీన రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపగా.. స్వల్ప మార్పులు చేస్తూ ఈనెల 2వ తేదీ అర్ధరాత్రి తుది నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
ఇక రామాయపట్నంపై పూర్తి హక్కు.. రామాయపట్నం జిల్లా సరిహద్దులోనే ఉంది. దీని ఏర్పాటుతో కావలి పట్టణం అభివృద్ధి చెందే అవకాశాలున్నా.. హక్కు మాత్రం మొన్నటివరకు ప్రకాశం జిల్లాకే ఉంది. ఓడరేవు నిర్మాణం సహా అనుబంధంగా పారిశ్రామికవాడలు కొలువుదీరితే ప్రకాశం జిల్లా యువతకే ఉద్యోగావకాశాలు దక్కుతాయనే చర్చ సర్వత్రా జరిగింది. ప్రభుత్వ నూతన గెజిట్‌తో రామాయపట్నం నెల్లూరు జిల్లాలో విలీనమైంది. దాంతో జిల్లాకు చెందిన యువతకు ఉద్యోగావకాశాలు మెండుగా దక్కనున్నాయి.

రాష్ట్రంలోనే అత్యధిక జనాభా

కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం నెల్లూరు జిల్లా 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, 38 మండలాలతో ఉంది. విస్తీర్ణం 10,441 చ.కి.మీ కాగా.. జనాభా 24.697 లక్షల వరకు ఉంది. దీని ప్రకారం అత్యధిక జనాభా కలిగిన జిల్లాల్లో మొదటిస్థానంలో ఉంది. తొలి ఉత్తర్వుల ప్రకారం జిల్లా ప్లానింగ్‌ అధికారులు హ్యాండ్‌బుక్‌ను తయారు చేశారు. తిరుపతి జిల్లాలోని మూడు మండలాలను కలుపుతూ ప్రకటన వెలువడినా.. అధికారులు అటువైపు దృష్టిసారించ లేదు. శనివారం వరకు తుది నోటిఫికేషన్‌ వచ్చాక మార్పులు చేస్తామని చెప్పిన అధికారులు.. బదిలీలపై దృష్టి పెట్టారు.

లాభం కన్నా.. నష్టమే అధికం

జిల్లాలో పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నెల్లూరీయులు బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లతరబడి అనుబంధం ఉన్న ప్రాంతాలు పక్క జిల్లాకు వెళ్లడంతో కొందరికి ఇంకా మింగుడు పడటం లేదు. షార్, సెజ్‌లు, నాయుడుపేట, సూళ్లూరుపేట, గూడూరులోని పరిశ్రమలు, సిలికా గనులు, ఇతరత్రా తిరుపతి జిల్లాలోకి వెళ్లడంతో జిల్లా ఆదాయంపై కాస్త ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లాలో దాదాపు 80 భారీ పరిశ్రమలు ఉండగా.. వీటిలో 15 మాత్రమే జిల్లాలో ఉన్నాయి. జిల్లాకే మణిహారం కాబోయే క్రిస్‌సిటీ, మాంబట్టు, నాయుడుపేట, పన్నంగాడు, పూడి, అత్తివరం, తడ ఇండస్ట్రీయల్‌ పార్కులు తిరుపతి జిల్లాలో కలిసిపోయాయి. సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరులోనే ఉండటంతో అయిదు ఎడిబుల్‌ కంపెనీలు, కృష్ణపట్నం పోర్టు, థర్మల్‌ప్లాంట్లు ఉండటం కాస్త ఉపశమనం. రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరులోనే ఉంచటం శుభపరిణామని పలువురు అభిప్రాయ పడుతున్నారు. వ్యవసాయం ప్రధానంగా ఉండే జిల్లాలో ఇప్పుడు మెట్టప్రాంతం ఎక్కువగా ఉంది. నెల్లూరులోనే సోమశిల, కండలేరు జలాశయాలు ఉండటంతో సాగునీటికి ఇబ్బందులు ఉండవని ప్రజలు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని