logo

అధికార అహం.. అరాచక పర్వం!

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు.

Updated : 18 Apr 2024 05:11 IST

అయిదేళ్లలో శ్రుతిమించిన వైకాపా నాయకుల దాష్టీకాలు
వేధింపులు, తప్పుడు కేసులతో సామాన్యులపై జులుం
స్టేషన్లలో వారు చెప్పిందే చట్టం

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలో అరాచకాలు, ఆగడాలు నిత్యకృత్యమయ్యాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారాయి. అధికార పార్టీ నేతలన్న అహంతో కొందరు వైకాపా నాయకులు చెలరేగిపోగా- వారి దందాలు, దౌర్జన్యాలకు కొందరు అమాయకులు బలైపోయారు. మొదట్లో రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలతో వేధించగా- ఆ తర్వాత సామాన్య ప్రజానీకంపైనా జులుం ప్రదర్శించారు. అధికారం మా చేతిలో ఉంది. పోలీసులు మేం చెప్పినదానికల్లా తలాడిస్తారు. మాకు అడ్డేముంది’? అంటూ రెచ్చిపోగా.. వారి ఆగడాలను అరికట్టాల్సిన కొందరు పోలీసులూ.. అధికార పార్టీ నేతలకే వత్తాసు పలికిన సంఘటనలు బాధితులను మరింత నిస్సహాయులుగా మార్చాయి. ఆ క్రమంలో కొందరు బలవన్మరణాలకు పాల్పడగా- మరికొందరు సర్వం కోల్పోయి మౌనంగా రోదిస్తున్నారు. తాజాగా గుడ్లూరు మండలంలో ఎస్సై వేధింపుల కారణంగా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన నేపథ్యంలో.. మరోమారు అవన్నీ చర్చకు దారి తీశాయి.

ఈనాడు, నెల్లూరు: జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లలో వైకాపా నాయకులు చెప్పిందే చట్టమన్నట్లుగా పరిస్థితి సాగింది. కొన్నింట అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, వారి ప్రధాన అనుచరుల మాటే చెల్లుబాటు అయింది. వారి ఆగడాలపై బాధితులు స్వేచ్ఛగా ఫిర్యాదు చేయలేని దుస్థితి నెలకొంది. ధైర్యం చేసి.. ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వెళితే.. వారిపైనే తప్పుడు కేసులు పెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరీ తప్పనిసరై.. వైకాపా నాయకులపై కేసు నమోదు చేయాల్సి వస్తే.. నామాత్రపు సెక్షన్లతో సరిపెట్టారు. చాలా ఉదంతాల్లో తదుపరి చర్యల ఊసే కనిపించలేదు. ప్రశ్నిస్తున్నవారిని, గిట్టని వారిని, అడ్డుగా ఉన్న వారిని వేధించేందుకు, కక్ష సాధించేందుకు పలువురు నాయకులు పోలీసులను పావులుగా వినియోగించుకున్నారనే ఆరోపణలు బహిరంగంగానే వినిపించాయి.

  • తెదేపాలో కీలకంగా వ్యవహరిస్తున్న దళిత యువకుడు పైడి శ్రీహర్షను వైకాపాలో చేరమని ఆ పార్టీ నాయకులు వేధింపులకు గురిచేశారు. ఆర్థికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు.. పోలీసులతో వేధించారు. దాంతో ఆయన 2022, డిసెంబరు 28న కావలి ఎమ్మెల్యే ఇంటి ఎదుట క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. బలవన్మరణానికి ప్రయత్నించే ముందు తన బాధను స్వీయ వీడియో తీసి వైరల్‌ చేశారు. ఈ సంఘటనలో బాధితు శ్రీహర్షపై ఆత్మహత్యాయత్నం నేరం కింద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆయన కుటుంబం చిన్నాభిన్నమైంది.
  • కావలి పట్టణం ముసునూరుకు చెందిన దుగ్గిరాల కరుణాకర్‌ స్థానికంగా ఉండే చెరువులను లీజుకు తీసుకుని చేపలు సాగు చేసేవారు. వాటిపై కొందరు వైకాపా నాయకుల కన్ను పడింది. చెరువులో చేపలు తమకు కావాలంటూ బెదిరించారు. తమను వదిలేయాలని బాధితుడు, వారి కుటుంబ సభ్యులు కాళ్లు పట్టుకుని ప్రాధేయపడినా.. చేపలు పట్టుకునేందుకు కనికరించలేదు. దాంతో 2022, ఆగస్టు 20న నాటి ఎస్పీకి లేఖ రాసి.. ఇంట్లో ఉరేసుకుని చనిపోయారు.
  • కావలి నియోజకవర్గం ఉలవపాళ్ల పెట్రోల్‌ బంకులో గోచిపాతల తేజ అనే దళిత యువకుడు పనిచేసేవారు. అక్రమంగా గ్రావెల్‌ తరలించే అధికార పార్టీ నాయకుడి వాహనం డీజిల్‌ పట్టించుకునేందుకు అక్కడికి వెళ్లింది. ఆ సమయంలో తేజ.. వాహన డ్రైవరును డబ్బు అడగడమే పాపమైంది. ఆ విషయం తెలుసుకున్న బోడిగుడిపాడు వైకాపా నాయకుడు పెట్రోల్‌ బంకుకు వచ్చి ‘తానెవరో తెలియదా?’ అంటూ తేజపై కాళ్లతో దాడి చేశారు. బాధితుడు పదేపదే వేడుకుంటున్నా.. కనికరించలేదు. దీనికి సంబంధించిన దృశ్యాలు పెట్రోల్‌ బంకులోని సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఆ తర్వాత వైరల్‌ అయ్యాయి. దాంతో మొక్కుబడిగా స్టేషన్‌ బెయిల్‌ వచ్చే కేసు నమోదు చేసి చేతులు దులుపుకొన్నారు.

గత్యంతరం లేక ఆత్మహత్యలు!

  • మర్రిపాడు మండలం చుంచులూరుకు చెందిన తిరుపతి అనే దివ్యాంగుడిని అధికార పార్టీ అండతో వేధించారు. పొలానికి కాపలా కాసే వ్యక్తిని.. మరో పొలం కంచె పోవడంపై విచారణకు పిలిపించారు. ఆ క్రమంలో ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు కొట్టడం వల్లే తన కుమారుడు చనిపోయాడని తిరుపతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
  • కందమూరుకు చెందిన ఉదయగిరి నారాయణపై వైకాపా నాయకులు దొంగతనం కేసు పెట్టడంతో.. పోలీసులు ఆయన్ను స్టేషన్‌కు తీసుకువెళ్లి కొట్టారు. దాన్ని అవమానంగా భావించిన ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషయంలో మంత్రి సదరు ఎస్సై కరీముల్లాను కాపాడారనే ఆరోపణలు ఉన్నాయి. జీజీహెచ్‌లో నారాయణ పోస్టుమార్టం దగ్గర కందమూరులో అంత్యక్రియలు జరిగే వరకు పోలీసుల కనుసన్నల్లో జరిగాయి. పోలీసుల వేధింపులే కారణమని నారాయణ భార్య పద్మ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. చివరకు ఎస్సీ ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతో.. దొంగతనం కేసు పెట్టిన వ్యక్తిపై.. కేసు కట్టి చేతులు దులుపుకొన్నారు.

దాడులు.. దౌర్జన్యాలు షరామామూలే

  • సామాజిక మాధ్యమాల్లో మంత్రి కాకాణిపై పోస్టింగ్‌లపై ఫిర్యాదు అందడంతో.. పొదలకూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్‌బాబును పోలీసులు అరెస్టు చేశారు. ఆ విషయంలో మాజీ మంత్రి సోమిరెడ్డిపై వైకాపా నాయకులు పెట్టిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈయన పోస్టులు పెట్టినట్లు సమాచారం. పోలీసులు మాత్రం ఏకపక్షంగా తెదేపా నాయకులను అరెస్టు చేశారు. ఆ సమయంలో మస్తాన్‌బాబు తన భార్య మమతను ద్విచక్ర వాహనంలో సంగం మండలంలోని బంధువుల ఇంట్లో వదిలిపెట్టి వస్తానని చెప్పినా పోలీసులు పట్టించుకోకపోవడంతో జీపు చక్రాల కింద తలపెట్టి నిరసన తెలిపారు.
  • కొడవలూరు మండలం ఎల్లాయపాళెం సమీపంలో అక్రమ గ్రావెల్‌ తవ్వకాలను తెదేపా నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు ఫోన్‌ చేశారు. అక్రమార్కులను వదిలేసి.. అక్కడకు వెళ్లిన వారిపైనే పోలీసులు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం గమనార్హం.
  • కావలికి చెందిన ఓ వ్యక్తికి అర ఎకరా ఉండగా- దాని చుట్టూ ఉన్న భూములను వైకాపా నాయకులు కొనుగోలు చేసి లేఅవుట్‌ వేశారు. పొలానికి నీరు రాకుండా అడ్డుకున్నారు. ఇదేమిటని అడిగితే.. పొలాన్ని తమకు విక్రయించాలని వేధించారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని