logo

ఒకరి కోసం వచ్చి.. ముగ్గుర్ని చంపారా..?

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జాతీయ రహదారి పక్కనే మంగళవారం అర్ధరాత్రి ముగ్గురి హత్యల ఘటన కలకలం రేపుతోంది. షెడ్డు లోపల మంచంపై మెకానిక్‌ హర్పాల్‌ సింగ్‌ (33), మరో

Published : 09 Dec 2021 03:43 IST

పోలీసులకు సవాల్‌గా మారిన కేసు
ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే-నిజామాబాద్‌ నేరవార్తలు, డిచ్‌పల్లి

సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో జాతీయ రహదారి పక్కనే మంగళవారం అర్ధరాత్రి ముగ్గురి హత్యల ఘటన కలకలం రేపుతోంది. షెడ్డు లోపల మంచంపై మెకానిక్‌ హర్పాల్‌ సింగ్‌ (33), మరో మంచంపై అతడి బంధువు జోగిందర్‌సింగ్‌(45) మృతదేహాలు దుప్పటి కప్పి ఉన్నాయి. బయట ఉన్న మంచంపై క్రేన్‌ డ్రైవర్‌  సునీల్‌ (24) చనిపోయి ఉన్నాడు.

లోపలి వ్యక్తి కోసం  వచ్చారా..?
హత్యలు జరిగిన షెడ్డుకున్న సీసీ కెమెరా పనిచేయటం లేదు. పక్కనే గల ద్విచక్రవాహనాల షోరూం సీసీ కెమెరాలో ఇద్దరు వ్యక్తులు అర్ధరాత్రి దాటాక అటుగా వచ్చినట్లు గుర్తించారు. ఘటనా స్థలంలో మద్యం సీసాలు దొరికాయి. ఎవరెవరు తాగారనేది తేలాలి. ఎవరైనా రెక్కీ చేసి ప్రణాళిక వేసుకొని హతమార్చి ఉంటారా అని అనుమానిస్తున్నారు. జోగిందర్‌ సింగ్‌ మూడురోజుల కిందట ఇక్కడికి వచ్చారంటున్నారు. ఇద్దరిది పంజాబ్‌..ఆ ప్రాంతంలో వీరికి గొడవలుండి..ఎవరైనా వెంబడించి వచ్చి ఇలా చేసి ఉంటారా.? ఒకరి కోసం వచ్చి..సాక్ష్యం ఉండొద్దని మిగతా ఇద్దరినీ చంపారా..అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  సునీల్‌ కోసం వచ్చి ఉంటే..బయట నిద్రించిన అతడిని చంపి వెళ్లిపోయేవారు. కచ్చితంగా లోపల ఉన్న వ్యక్తి కోసమే వచ్చారనే అనుమానం బలపడుతోంది. ఘటనా స్థలంలో డబ్బుల పెట్టె తెరిచి ఉండటం.. మృతుల జేబుల్లోనూ డబ్బులు, చరవాణులు లేకపోవటంతో దోపిడీ ముఠాల పని అనే కోణమే మొదట కనిపించింది.  మెకానిక్‌ షెడ్డులో పనిచేసే వాళ్లను చంపి తీసుకెళ్లే అంత సొమ్ములుంటాయా..? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.  క్లూస్‌  టీం గుర్తించిన ఆధారాలు.. పోస్టుమార్టం రిపోర్టు కేసు దర్యాప్తునకు  కీలకమయ్యే అవకాశం ఉంది.  మృతుల ఫోన్ల కాల్‌డేటానూ పరిశీలించనున్నారు. ఇప్పటికే మూడు బృందాలు హంతకులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యాయి.

ఒకే రకమైన  గాయాలు
హత్యకు గురైన వారందరి తలలపైనా ఒకే రకమైన సుత్తితో ఒకే చోట దాడి చేసినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.   గతంలో నమోదైన పలు కేసుల్లోనూ సైకోలు ఈ తరహాలో హత్యలు చేసిన ఉదంతాలు ఉన్నాయి. ః పోలీసు కమిషనర్‌ కార్తికేయ మీడియాతో మాట్లాడుతూ రాత్రి 10-12 గంటల మధ్యలో ఘటన జరిగిందన్నారు. మంగళవారం రాత్రి 10:30-11 గంటల సమయంలో హత్యలు జరిగిన ప్రాంతానికి సమీపంలోనే రోడ్డు ప్రమాదం చోటు చేసుకొందన్నారు. అక్కడికి పోలీసుల వాహనాలు వచ్చాయని, హంతకులు ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఉండే అవకాశం లేదన్నారు.


మూడు నెలలు.. ఏడు హత్యలు

నిజామాబాద్‌ నేరవార్తలు: నిజామాబాద్‌ కమిషనరేట్‌లో హత్యానేరాల పరంపర కొనసాగుతోంది. ఆస్తి కోసం కొందరు, పాతకక్షలతో మరికొందరు దారుణాలకు తెగిస్తున్నారు. అన్నదమ్ములు, తల్లిదండ్రులనూ లెక్క చేయకుండా హతమారుస్తున్నారు. డిచ్‌పల్లి మండలంలో గత మూడు నెలల్లో ఏడు హత్యలు జరిగాయి. అన్ని ఘటనల్లో నిందితులు చిక్కారు. రెండు కేసుల్లో చరవాణులు,  నగదు కోసం చంపినట్లు తేలింది. మరో కేసులో కుటుంబ తగాదా కారణంగా గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని