logo

మొరం.. అక్రమార్కుల పరం

జిల్లాలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు, నాయకు

Published : 21 Jan 2022 03:35 IST

 జిల్లాలో యథేచ్ఛగా దందా 

తనిఖీలు మరిచిన యంత్రాంగం
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

భిక్కనూరు మండలంలో మొరం తరలిస్తున్న టిప్పర్‌

జిల్లాలో అక్రమ మొరం దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు సహజ సంపదను కొల్లగొట్టి ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అధికారులు, నాయకుల కనుసన్నల్లో ఈ దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది. ప్రభుత్వ భూములను సొమ్ము చేసుకుంటున్నా అధికార యంత్రాంగం కన్నెత్తిచూడడం లేదు. జిల్లావ్యాప్తంగా పగలురాత్రి తేడా లేకుండా మొరం వ్యాపారం సాగిస్తున్నారు. భిక్కనూరు, రాజంపేట, కామారెడ్డి, తాడ్వాయి, బాన్సువాడ, గాంధారి, సదాశివనగర్‌, మాచారెడ్డి మండలాల్లో అధికంగా తవ్వకాలు జరుగుతున్నాయి.
*  అనుమతులు తప్పనిసరి..  మొరం తవ్వకాలు చేపట్టాలంటే కచ్చితంగా మైనింగ్‌, అటవీ అధికారుల అనుమతులు తీసుకోవాలి. వాల్టా చట్టం ప్రకారం ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి. మొరం ఉన్న ప్రాంతంలో ఎన్ని క్యూబిక్‌ మీటర్ల వరకు లీజు ఇవ్వాలో రెవెన్యూ అధికారులు నిర్ణయిస్తారు. మైనింగ్‌ అధికారులు వే బిల్లులు జారీ చేయాలి. మొరం లభ్యతను బట్టి 60 రోజుల వరకు తాత్కాలిక అనుమతులు పొందొచ్చు. తవ్వకాలు జరిపే పరిధిలోని గ్రామ పంచాయతీలకు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఏ ఒక్కరూ అనుమతి తీసుకోవడం లేదు. కొందరు తాత్కాలికంగా తీసుకుని ఏడాదంతా తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
*  ప్రగతి పనుల పేరిట..  ప్రభుత్వం చేపడుతున్న పల్లెప్రగతిలో భాగంగా వైకుంఠధామాలు, ప్రకృతివనాలు, కంపోస్టుషెడ్లు వంటి పనులకు మొరం అవసరం ఉంటుంది. ఇది కాకుండా గ్రామాల్లో చెడిపోయిన అంతర్గత రోడ్ల మరమ్మతులు కావాలి. స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామానికి 50- 80 టిప్పర్ల మొరం అవసరమంటూ స్థానిక తహసీల్దారు వద్ద అనుమతి తీసుకుంటున్నారు. గ్రామ అవసరాలు తీరిపోయిన తర్వాత కూడా మూడునాలుగు రోజుల వరకు తవ్వకాలు కొనసాగిస్తున్నారు.
ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు
- నర్సారెడ్డి, ఏడీ, మైనింగ్‌,కామారెడ్డి

జిల్లాలో మొరం తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదు. ప్రస్తుతం ఒకరు మాత్రమే దరఖాస్తు పెట్టుకున్నారు. వారు సూచించిన భూమిని పరిశీలించాం. ఇంకా అనుమతివ్వలేదు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్న వారిపై జరిమానాలు విధిస్తున్నాం. మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుంటాం.
ఒక టిప్పర్‌కు రూ.2 వేల వరకు
* టిప్పర్‌తో మొరం సరఫరా చేస్తే  రూ.1800- 2000 వరకు తీసుకుంటున్నారు.  
* ట్రాక్టర్‌ ట్రాలీతో రూ.400- 600 వసూలు చేస్తున్నారు. 

* గృహనిర్మాణాలు అధికంగా సాగే పట్టణాలు, మండల కేంద్రాల్లో ఈ దందా అధికంగా సాగుతోంది.
* వ్యాపారులు పట్టణ శివారు ప్రాంతాలు, గ్రామాల్లో తవ్వకాలు చేపడుతున్నారు.  
* నిబంధనలకు విరుద్దంగా పట్టా, అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలు చేపట్టి సరఫరా చేస్తున్నారు.  

* కొత్తగా వెలుస్తున్న వెంచర్ల అభివృద్ధికి పెద్దఎత్తున మొరం వినియోగిస్తున్నారు. 

* దీని గురించి స్థానిక రెవెన్యూ అధికారులకు తెలిసినా చర్యలకు వెనుకంజ వేస్తున్నారు. ఒకవేళ అడ్డుకున్నా వెంటనే రాజకీయ నాయకుల నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. దీంతో వదిలివేయక తప్పడం లేదనే వాదన వినిపిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని