logo

గిట్టుబాటు.. ఉత్తిమాటే

ఏటా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం అన్నదాతను కుంగదీస్తోంది. ఎరువులు, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సర్కారు సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా రైతుకు గిట్టుబాటు ఉత్తి మాటే అయింది. ఆరుగాలం పండించిన పంట

Published : 23 Jan 2022 04:26 IST

గుదిబండగా మారిన ఎరువులు, డీజిల్‌ ఖర్చులు

రెట్టింపైన పెట్టుబడి వ్యయం

సాగుపై అన్నదాత పెదవి విరుపు

న్యూస్‌టుడే, నందిపేట్‌ గ్రామీణం

టా పెరుగుతున్న పెట్టుబడి వ్యయం అన్నదాతను కుంగదీస్తోంది. ఎరువులు, డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. సర్కారు సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నా రైతుకు గిట్టుబాటు ఉత్తి మాటే అయింది. ఆరుగాలం పండించిన పంట చేతికొస్తుందో లేదో తెలియదు. వస్తే మద్దతు ధర ఉండదు. పెట్టుబడి  పోనూ ఎకరానికి రూ. పది వేలూ మిగలట్లేదు.  

ఎరువు.. బరువు: ముడి సరకు ధర పెరిగినప్పుడల్లా కంపెనీలు తమ ఉత్పత్తులకు ధరలను ఖరారు చేస్తున్నాయి. రెండేళ్ల కిందట జిల్లాలో అత్యధికంగా వాడే 20:20:0:15 ధర రూ. 820 ఉంటే ఇప్పుడు రూ. 1380 పెట్టాల్సి వస్తోంది. ఏడాదికాలంలో మూడు సార్లు ధరలు పెరిగాయి.

ట్రాక్టర్‌ లేదంటే సాగదు: ఎడ్లు, కూలీల కొరతతో ట్రాక్టర్‌ వినియోగం తప్పనిసరైంది. జిల్లాలో 95 శాతం యాంత్రీకరణపైనే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు ఎకరం సాగుకు రూ.5 వేల లోపు అయ్యే బడ్జెట్‌ ఇప్పుడు రూ.పది వేల వరకు చేరింది. ఏడాదికాలంలో లీటరు డీజిల్‌ రూ.35 మేర పెరిగింది. ఇది పెట్టుబడిని రెట్టింపు చేసింది.

వనరులున్నప్పటికీ : గతంలో కంటే పంటల సాగుకు అనుకూలమైన పరిస్థితి ఉంది. పుష్కలమైన నీటి వనరులు అందుబాటులోకి వచ్చాయి. వర్షాలు సమృద్ధిగా ఉండడంతో బోర్లు పోస్తున్నాయి. ఇందుకు అవసరమైన ఉచిత్‌ విద్యుత్‌ అందుతుంది. నల్గొండ, పాలమూరు కూలీల రాక తగ్గడంతో ఆ లోటును బిహార్‌, ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ నుంచి వచ్చి నాట్లు, హమాలీ పనులకు సహకరిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా పెరిగిన ధరలు సాగును కుదేలు చేస్తున్నాయి.

సర్కారు సాయం.. నిర్వహణలో మాయం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంటసాయం కొంత ఆసరా అవుతుంది. పెరిగిన సాగు ఖర్చులకు రైతు తట్టుకోలేకపోతున్నాడు. ఈసారి వరి కొనుగోలు చేయలేమని ప్రభుత్వాలు చేతులెత్తేయడంతో ‘మద్దతు’ దక్కక నష్టాలు మూటగట్టుకోవాల్సి వస్తుందనే ఆందోళన మొదలైంది. రాయితీలు ఎత్తేయడం, పంటల బీమా అమలు కాకపోవడంతో ప్రకృతి వైపరీత్యాల భయానికి చివరి వరకు భరోసా లేని పంటకు రూ. లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి వస్తుందని అవేదన చెందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని