logo

ప్రీమియం దోపిడీ

ఇంధన బంకుల్లో ఇష్టారాజ్యం ‘‘మండుతున్న ఇంధన ధరలకు వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు జిల్లాకేంద్రంలోని కొన్ని బంకుల్లో ప్రీమియం పెట్రోల్‌ను వినియోగదార్లకు బలవంతంగా అంటగడుతున్నారు.’’

Published : 06 Dec 2022 06:31 IST

ఇంధన బంకుల్లో ఇష్టారాజ్యం ‘‘మండుతున్న ఇంధన ధరలకు వాహనదారులు బెంబేలెత్తుతున్నారు. దీనికి తోడు జిల్లాకేంద్రంలోని కొన్ని బంకుల్లో ప్రీమియం పెట్రోల్‌ను వినియోగదార్లకు బలవంతంగా అంటగడుతున్నారు.’’

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి: ప్రతి బంకులో సాధారణ పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలు జరుగుతుంటాయి. వీటితో పాటు కాస్త ధర ఎక్కువగా ఉండే ప్రీమియం ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారుల ఆసక్తి, ఎంపికకు అనుగుణంగా వారు కోరుకున్నది వాహనాల్లో నింపాల్సి ఉండగా.. ప్రీమియం పెట్రోలు మాత్రమే విక్రయిస్తూ దోపిడీకి తెగబడుతున్నారు.

పర్యవేక్షణ లేకపోవడంతో

బంకులపై పౌరసరఫరాల శాఖ అధికారుల పర్యవేక్షణ కొరవడటం వారికి కలిసివస్తోంది. నిల్వలు, సరఫరా ఆటంకం కారణంగా ఒకటి, రెండు రోజులు ఇలాంటి పరిస్థితి ఉంటే తప్పులేదు. ఇక్కడ రోజుల తరబడి ఇదే తతంగం కొనసాగుతోంది. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే పోయించుకోండి. లేకపోతే వెళ్లిపోండంటూ దురుసుగా వ్యవహరిస్తున్నారు.


జేబుకు భారమే

ప్రస్తుతం జిల్లాకేంద్రంతోపాటు డిజవిన్‌, మండల కేంద్రాల్లోని చాలా బంకుల్లో సాగుతున్న ప్రీమియం దందా సామాన్యుడి జేబుకు భారంగా మారింది. సాధారణ పెట్రోలు, ప్రీమియానికి ధరలో రూ.7 వరకు వ్యత్యాసముంటోంది.


అవసరాన్ని బట్టి..

వినియోగదారుల అవసరాన్ని బంకుల నిర్వాహకులు అవకాశంగా తీసుకుంటున్నారు. ఉదయం వేళల్లో ఉద్యోగులు కార్యాలయాలకు పరుగులు పెడుతుంటారు. ఇదే సమయాన్ని అవకాశంగా మలుచుకుని ఉదయం 9.30 నుంచి 10.30 వరకు ప్రీమియం మాత్రమే విక్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకేంద్రంలో కూటమి కట్టి ఈ దందాకు తెరదీశారు. పౌరసరఫరాల అధికారులు వీరికి వంతపాడుతున్నారు.


ఉపయోగం ఏంటీ..?

ఇంధనంలో రెగ్యులర్‌, ప్రీమియం అనే రకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా పెట్రోలు గ్రేడ్‌ను దాని ఆక్లేన్‌ విలువ ఆధారంగా వర్గీకరిస్తారు. సాధారణ పెట్రోలు ఆక్లేన్‌ విలువ 87 కాగా.. ప్రీమియానిది 91 వరకు ఉంటుంది. ఇంజిన్‌ స్టార్ట్‌ చేసినప్పుడు ఎక్కువ ఇంధనం వినియోగంకాకుండా, కార్బన్‌పై తక్కువ ప్రభావం చూపడం, ఇంజిన్‌ శబ్దం తగ్గింపు తదితర అంశాలు ఆక్లేన్‌ విలువను పెంచేందుకు దోహదం చేస్తున్నాయి. వాస్తవానికి అధిక కంప్రెషన్‌ సిస్టం ఉన్న ఆధునిక శక్తివంతమైన వాహనాలకు ప్రీమియం పెట్రోలు, డీజిల్‌ ప్రయోజనకరం. వాహనం అయిదేళ్ల పైబడిది అయితే సాధారణ ఇంధనం సరిపోతుందని, శక్తివంతమైన మోడల్‌ అయితే ప్రీమియం ఉత్తమమని మెకానిక్‌లు చెబుతున్నారు.


పరిశీలించి చర్యలు
- పద్మ, పౌరసరఫరాల శాఖ అధికారి, కామారెడ్డి

బంకుల్లో విధిగా సాధారణ పెట్రోలు అందుబాటులో ఉంచాలి. ప్రీమియం అంటూ బలవంతంగా విక్రయించొద్దు. వినియోగదారుల కోరికకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎవరైనా ఇందుకు విరుద్ధంగా చేస్తున్నట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. త్వరలో క్షేత్రస్థాయి పరిశీలన చేపడతాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని