logo

అవగాహనతోనే సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట

‘స్మార్ట్‌ఫోన్లతో అరచేతిలో అంతర్జాలం అందుబాటులోకి వచ్చింది. ఏ అవసరమైనా, ఎలాంటి సమాచారం కావాలన్నా ముందుగా ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు.

Published : 08 Feb 2023 05:40 IST

సామాజిక మాధ్యమాల వినియోగంలో జాగ్రత్తలు అవసరం
‘ఈనాడు-ఈటీవీ’ తెలంగాణ సదస్సులో పోలీసు అధికారులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ నగర బృందం

ప్రసంగిస్తున్న సీపీ నాగరాజు, చిత్రంలో ఏసీపీ వెంకటేశ్వర్‌, గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపల్‌ రామ్మోహన్‌రెడ్డి, నగర సీఐ వెంకట్‌ నారాయణ, సైబర్‌ బృంద సభ్యులు

‘స్మార్ట్‌ఫోన్లతో అరచేతిలో అంతర్జాలం అందుబాటులోకి వచ్చింది. ఏ అవసరమైనా, ఎలాంటి సమాచారం కావాలన్నా ముందుగా ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు. అందులో ఉన్న సమాచారాన్ని సులువుగా నమ్మేస్తూ ఆన్‌లైన్‌ మోసాల బారిన పడుతున్నారు’ అని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు. సురక్షిత అంతర్జాల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్‌లోని గిరిరాజ్‌ కళాశాల ఆడిటోరియంలో ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’ ‘ఈటీవీ-భారత్‌’ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. సీపీ నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్‌ హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. గతంతో పోలిస్తే సైబర్‌ నేరాల రేటు గణనీయంగా పెరిగిందని, ఇందుకు సామాజిక మాధ్యమాలే ప్రధాన కారణమన్నారు. ఇలాంటి నేరాల తీరుపై అవగాహన పెంచుకొంటేనే మోసపోకుండా ఉంటారని స్పష్టం చేశారు. కళాజాత ఇన్‌ఛార్జి పాషా ఆధ్వర్యంలో సీత, శ్రీనివాస్‌, శేఖర్‌, నరేష్‌, బాల్‌రాజ్‌ ప్రదర్శనలు ఇచ్చారు. షీ బృందం మహిళా ఎస్సై స్రవంతి, సిబ్బంది శ్రీకాంత్‌, నాగరాజు, రేఖారాణి, హరితారాణి పాల్గొన్నారు.


రోజుకో తరహాలో..
- ముఖీద్‌ పాషా, సైబర్‌ సెల్‌ సీఐ

ప్రస్తుతం రోజుకో తరహాలో నేరాలు జరుగుతున్నాయి. వ్యక్తిగత ఫొటోలను చోరీ చేసి మార్ఫింగ్‌ చేస్తున్నారు. అనవసర యాప్‌ల జోలికి వెళ్లకపోవడం మంచిది. ఎలాంటి సమాచారం ఉన్నా కమిషనరేట్‌లోని సహాయక కేంద్రాన్ని సంప్రదించాలి. వివరాలు గోప్యంగా ఉంచి సమస్యను పరిష్కరిస్తాం.


ఓటీపీలు పంపించి..
- వెంకట్‌నారాయణ, నగర సీఐ

విద్యార్థులు సామాజిక మాధ్యమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఈ క్రమంలో అనవసర వెబ్‌సైట్లు, లింకులు, యాప్‌ల్లో వివరాలు నమోదు చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌చేసినా ఓటీపీ నంబరు చెప్పేస్తున్నారు. వీటిపై అప్రమత్తంగా ఉండాలి.


గుర్తుతెలియని నంబర్లతో..
- రామ్మోహన్‌రెడ్డి, గిరిరాజ్‌ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్‌

చరవాణి వినియోగం తప్పనిసరైన పరిస్థితుల్లో గుర్తు తెలియని నంబర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగత సమాచారం ఎవరితోనూ పంచుకోవద్దు. సమాచార సేకరణ కోసం అంతర్జాల వినియోగం అత్యవసరంగా మారింది.


యువత మోసపోవద్దు

ఆన్‌లైన్‌ మోసాల్లో ఎక్కువగా చదువుకున్న యువత బాధితులుగా ఉంటున్నారు. తగిన సమాచారం తెలుసుకోకుండానే కొన్ని యాప్‌లను నమ్మి షాపింగ్‌ చేస్తున్నారు. దీన్ని అదునుగా చేసుకొని సైబర్‌ నేరగాళ్లు మోసాలు చేస్తున్నారు. బాధితుల వ్యక్తిగత సమాచారం, ఫొటోలు సేకరించి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా సమయం కేటాయించేవారు వ్యక్తిగత వివరాలు పోస్టు చేయకపోవడం ఉత్తమం. ముఖ్యంగా విద్యార్థినులు, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీ బృందాలకు చెప్పాలి. చట్టపరంగా చర్యలు తీసుకొని బాధితులకు అండగా ఉంటాం.

నాగరాజు, సీపీ


సులువుగా నమ్మేస్తున్నారు

కొందరు ఆన్‌లైన్‌లో వచ్చే లింకులు, సోషల్‌ మీడియాలో వచ్చే సమాచారాన్ని సులువుగా నమ్మేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన హ్యాకర్లు వ్యక్తిగత వివరాలు సేకరించి దిల్లీ, యూపీ, హరియాణా కేంద్రంగా మోసాలకు పాల్పడుతున్నారు. గతంలో ఓ యువతి వివాహం కోసం ఆమె తండ్రి సంబంధాలు చూస్తుండగా విదేశాల్లో ఉన్న యువకుడి సమాచారం లభించింది. అది సైబర్‌ నేరగాళ్లు పెట్టిన తప్పుడు సమాచారం అని గుర్తించకుండా అతడికి రూ.25 లక్షలు వరకు చెల్లించి మోసపోయారు. వీటి కట్టడి దిశగా ‘ఈనాడు’ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయటం అభినందనీయం.

ఆరె వెంకటేశ్వర్‌, నిజామాబాద్‌ ఏసీపీ


సైబర్‌ నేరాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నంబర్లకు తెలియజేయాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.

జాతీయ టోల్‌ ఫ్రీ: 1930

డయల్‌ 100

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని