logo

నామినేషన్‌ వేస్తున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త

Published : 17 Apr 2024 04:04 IST

 వివరాలు సక్రమంగా లేకపోతే తిరస్కరణ
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

 పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్‌ల స్వీకరణ ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. అధికార యంత్రాంగం దీనికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేసే ముందు వివరాలన్ని సరిగ్గా ఉన్నాయా లేదా పరిశీలించుకోవాలి. అఫిడవిట్‌లో చిన్నపాటి తప్పులున్నా, పూర్తిగా నింపకపోయినా తిరస్కరణకు గురయ్యే ఆస్కారం ఉంది.

అఫిడవిట్‌ కీలకం

ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు సమర్పించే అఫిడవిట్‌ కీలకంగా ఉంటుంది. అభ్యర్థిపై క్రిమినల్‌ కేసులు నమోదై ఉంటే సంబంధిత వివరాలు అందులో పొందుపర్చాలి. ఏదైనా కేసులో న్యాయస్థానం గతంలో శిక్ష విధించినా, అప్పీల్‌కు వెళ్లినా ఆ సమాచారం తెలపాలి. అన్ని వివరాలతో కూడిన అఫిడవిట్‌కు నోటరీ తప్పనిసరి. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థి రిటర్నింగ్‌ అధికారి వద్ద ప్రమాణం చేయాల్సి ఉంటుంది. స్థిర, చరాస్తుల వివరాలతో పాటు బ్యాంకు, చేతిలో ఉన్న నగదు, డిపాజిట్లు, ఇతర సేవింగ్స్‌, బీమా పాలసీలు, అప్పులు, ఆభరణాలు, వాహనాలు, వ్యవసాయ భూములు, వాణిజ్య సముదాయాలు, నివాస స్థలాలు వంటి వివరాలను అఫిడవిట్‌లో రాయాల్సి ఉంటుంది. అభ్యర్థితో పాటు వారి కుటుంబ సభ్యుల వివరాలను కూడా నింపాలి. ఆదాయ మార్గాలు ఎక్కడి నుంచి వస్తుందనేది కూడా ప్రస్తావించాలి.

వీటిని సిద్ధం చేసుకోవాలి

నామినేషన్‌ దాఖలు చేసే వారు జనరల్‌ అభ్యర్థులు అయితే రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీలు అయితే రూ.12,500 డిపాజిట్‌ రూపంలో జమ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని నగదు, చలానా రూపంలో చెల్లించాలి. చెక్కులు తీసుకోరు.

  •  జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులకు వారు పోటీ చేసే నియోజకవర్గంలో ఎవరైనా ఒక ఓటరు నామినేషన్‌ను ప్రతిపాదించాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్‌, స్వతంత్ర అభ్యర్థులకైతే పది మంది ఓటర్లు ప్రతిపాదించాల్సి ఉంటుంది. * అభ్యర్థులు మూడు నెలలలోపు దిగిన ఒక పాస్‌ ఫొటోను అఫిడవిట్‌పై, స్టాంప్‌ సైజ్‌ ఫొటోను నామపత్రాలపై అతికించాలి.
  •  ఇతర పార్లమెంట్‌ నియోజకవర్గానికి చెందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఈఆర్‌వో జారీ చేసిన ఓటరు ధ్రువీకరణ పత్రం జత చేయాలి.
  •  కొత్త బ్యాంక్‌ అకౌంట్‌ తీసుకోవాలి.
  •  రూ.95 లక్షల వరకు గరిష్ఠంగా ఖర్చు చేయొచ్చు.
  •  విద్యుత్తు, నీటి, ఇతర పన్నుల బిల్లులు పెండింగ్‌లో ఉండొద్దు. అన్నింటిని చెల్లించి నో డ్యూ సర్టిఫికేట్‌ జత చేయాలి .
  •  పార్టీ కండువాలు, టోపీలతో వస్తే అనుమతించరు. అభ్యర్థితో పాటు మరో నలుగురిని లోనికి అనుమతిస్తారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని