logo

సీనియర్లకు సీట్లు...పూర్వ వైభవానికి ఫీట్లు

ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్‌ నాయకత్వం ఇంతవరకు 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

Published : 17 Apr 2024 05:34 IST

కాంగ్రెస్‌ అధిష్ఠానం ప్రయత్నాలు ఫలించేనా? 

నువాపడలో మంగళవారం శరత్‌ పట్నాయక్‌ పాదయాత్ర

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే : ఈసారి ఎన్నికల్లో విజయం సాధిస్తామని, పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, అధికారంలోకి వస్తామంటున్న కాంగ్రెస్‌ నాయకత్వం ఇంతవరకు 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. కొంతమంది సీనియర్‌ నేతలను ఎన్నికల బరిలోకి దించింది. ఇది ప్రయోగం ఎంతమాత్రం కాదని, అనుభవజ్ఞుల అవసరం ఉందన్న దూరదృష్టితో వారికి అవకాశం ఇచ్చామని చెప్పుకుంది.

తీరని నష్టం

ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు తీరని నష్టం వాటిల్లింది. ప్రస్తుతం అసెంబ్లీలో 9 మంది సభ్యులున్న ఆ పార్టీ ఈసారి ఎన్నికల్లో 90 స్థానాలు గెలుచుకుంటుందని ఆ పార్టీ నాయకత్వం చెప్పుకొంది. అదే సమయంలో పార్టీ నుంచి ఇతర పార్టీల్లోకి వలసలు మొదలయ్యాయి. అగ్రనేతలెంతో మంది బిజద తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌కు ఇది తీవ్రంగా నష్టపెట్టింది. బిజద, భాజపాల నుంచి టిక్కెట్లు రాని అసంతుష్టులు హస్తం గూటికి వస్తారన్న అంచనాలు తలకిందులయ్యాయి.

వేచి చూసినా నిరాశే

ఇతర పార్టీలకంటే ముందుగా జాబితా ఖరారు చేస్తామన్న కాంగ్రెస్‌ నాయకత్వం ‘ఆయారాం’ల కోసం వేచి చూసినా నిరాశే మిగిలింది. ఎట్టకేలకు రెండు దశల్లో ఇంతవరకు 17 లోక్‌సభ, 119 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. పాత నేతలకు ఈసారి బరిలోకి దించుతామని, యువత, మహిళలకు అవకాశమిస్తామన్న పీసీసీ పెద్దలు కొంతమంది అనుభవజ్ఞులకు నిలబెట్టారు. రాజకీయ అనుభవం లేని వారికీ కొత్తగా అవకాశమిచ్చారు.

ఆ పార్టీలకు శృంగభంగం

జయదేవ్‌ జెనా మాట్లాడుతూ... అధికారమే పరమావధిగా చేసుకుని విర్రవీగుతున్న భాజపా, బిజదలకు ఈసారి శృంగభంగం తథ్యమన్నారు. ఈ రెండు పార్టీల విజయాలకు బ్రేకులు పడతాయన్నారు. కొద్దిమంది నేతలు పార్టీ వీడినంత మాత్రాన ఎలాంటి నష్టం జరగదని, ఫిరాయింపుదారులకు ఓటర్లు బుద్ధి చెబుతారన్నారు. అనుభవజ్ఞులంతా ఎన్నికల బరిలో ఉన్నందున మంచి ఫలితాలుంటాయన్న ఆశాభావం ఉందన్నారు.

భొండారి పొఖరిలో ప్రసార సాధనాలతో నిరంజన్‌ పట్నాయక్‌

ఎన్నికైన తర్వాత ముఖాలు చాటేస్తున్నారు

జేబీ కుమారుడు పృథ్వీ బల్లబ్‌ మాట్లాడుతూ... తన నాన్నగారు సీఎంగా ఉన్న సమయంలో స్వయంగా అందర్నీ కలిసేవారని, ఇంటికి పిలిచి మాట్లాడేవారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రిని ఆయన సహచరులే కలుసుకోలేని దుస్థితి ఉందన్నారు. కాంగ్రెస్‌కు పూర్వ వైభవం కల్పించాలన్న ధ్యేయంతో తాను ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగానని, పార్టీ అధికారంలోకి వస్తుందన్న ఆశాభావం ఉందని చెప్పారు.

వీరంతా హేమాహేమీలు

పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ నువాపడ అసెంబ్లీ అభ్యర్థి కాగా, కేంద్రమాజీ మంత్రి భక్తచరణ దాస్‌ కలహండి జిల్లా నర్లా నుంచి పోటీకి సన్నద్ధమయ్యారు. పీసీసీ మాజీ అధ్యక్షుల్లో నిరంజన్‌ పట్నాయక్‌ బాలేశ్వర్‌ జిల్లా భొండారిపొకిరి నుంచి, జయదేవ్‌ జెనా కేంఝర్‌ జిల్లా ఆనందపూర్‌ నుంచి బరిలో ఉన్నారు. మరో అగ్రనేత మాజీ మంత్రి కిశోర్‌ పటేల్‌ ఝార్సుగుడ జిల్లా బ్రజరాజనగర్‌ అభ్యర్థి కాగా, మాజీ (దివంగత) ముఖ్యమంత్రి జానకిబల్లభ్‌ పట్నాయక్‌ తనయుడు పృథ్వీవల్లభ్‌ ఖుర్దా జిల్లా బెగునియా బరిలో ఉన్నారు. పృథ్వీ తొలిసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు. మరో కేంద్రమంత్రి శ్రీకాంత్‌ జెనాను ఏఐసీసీ నాయకత్వం కోరి మరీ బాలేశ్వర్‌ లోక్‌సభ స్థానం కేటాయించింది. యువజన కాంగ్రెస్‌ నేత యూసిర్‌ నవాజ్‌ను భువనేశ్వర్‌ లోక్‌సభ బరిలో దించారు. ప్రకటించిన వారిలో మరికొందరు అనుభవజ్ఞులున్నారు.

పార్టీ గొప్పది... నేతలు కాదు

నిరంజన్‌ పట్నాయక్‌ మంగళవారం బాలేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... పార్టీ గొప్పదని, దాని ముందు నేతలు తక్కువేనని వివరించారు. ప్రతీ రాజకీయ పార్టీకి ఉత్థానపతనాలుంటాయని చెప్పారు. కాంగ్రెస్‌ ఈసారి పూర్వ వైభవం సాధిస్తుందని, అనుభవం గల నేతల సేవలు వినియోగించుకోవాలన్న ధ్యేయం మంచిదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు