logo

‘ఆసరా’ ఎప్పుడు దొరికేది...?

వైఎస్సార్‌ ఆసరా మూడో విడత ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబరు నెల 27, తర్వాత జనవరి మొదటి వారం, తర్వాత అదేనెల 30న ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో డబ్బులు ఎప్పుడొస్తాయా...? అని అధికారులను అడుగుతున్నారు.

Published : 06 Feb 2023 04:29 IST

లబ్ధిదారుల జాబితా చూస్తున్న సంఘ సభ్యులు

విజయనగరం మయూరి కూడలి, న్యూస్‌టుడే: వైఎస్సార్‌ ఆసరా మూడో విడత ఎప్పుడు ఇస్తారోనని లబ్ధిదారులు రెండు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే గత ఏడాది డిసెంబరు నెల 27, తర్వాత జనవరి మొదటి వారం, తర్వాత అదేనెల 30న ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో డబ్బులు ఎప్పుడొస్తాయా...? అని అధికారులను అడుగుతున్నారు. అధికారులు కూడా స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు.

రెండు విడతల్లో చెల్లింపు: 2019 ఏప్రిల్‌ 11 నాటికి బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు తీసుకుని చెల్లిస్తున్న స్వయం సహాయక  సంఘాల వారికి ఆసరా పథకాన్ని వర్తింపజేశారు. సభ్యులు చెల్లిస్తున్న అప్పును నాలుగు విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ విధంగా ఇప్పటికి రెండు విడతల్లో 31,070 సంఘాలకు రూ.427.66 కోట్లు ఉమ్మడి జిల్లాలో చెల్లించింది. మూడో విడత బయోమెట్రిక్‌ హాజరును సిబ్బంది తీసుకున్నారు. సభ్యులు చనిపోతే వారి స్థానంలో లబ్ధిదారుల కుటుంబంలో నామినీకి అవకాశం కల్పించారు. మూడో విడత ఆసరా మొత్తాన్ని జనవరి 30న ఇస్తామని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గంట్యాడలో జరిగిన సమావేశంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం రాలేదని డీఆర్‌డీఏ పీడీ కల్యాణ్‌ చక్రవర్తి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. వివరాలు రాగానే కార్యాచరణను సిద్ధం చేస్తామని, అర్హుల జాబితాను ప్రభుత్వానికి పంపామన్నారు.

పాత జిల్లాల వారీగా 31,070 సంఘాల్లో.....: ప్రభుత్వం ప్రకటించిన తేదీ నాటికి పాత జిల్లాల ప్రకారం 31,070 సంఘాల్లో 3,58,108 మంది సభ్యులు ఉన్నారు. వారి నుంచి క్షేత్రస్థాయిలో సేకరించిన డాటా ఆధారంగా సామాజిక ఆడిట్‌ ప్రక్రియను కూడా పూర్తిచేశారు. అనంతరం ఆ జాబితాను  గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించారు. దీని ఆధారంగా సంఘ పొదుపు ఖాతాలకు మూడో విడత ప్రభుత్వం జమచేయనున్నట్లు తెలిపింది. మూడు విడతలో రూ.213.83 కోట్లు రావాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని