logo

ముగ్గురి పాలిట మృత్యువు

మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది..

Published : 29 Mar 2024 04:55 IST

మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ద్విచక్ర వాహనాల ఢీ
సాలూరు, జన్నివలసలో అలుముకున్న విషాదం

పురుషోత్తం, యశోద కృష్ణ (పాతచిత్రాలు), శ్రీను మృతదేహం

మృత్యువు ఒకేసారి మూడు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.. కుమారుడిపై కోటి ఆశలు పెట్టుకుని జీవిస్తున్న తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చింది.. కన్నవారు లేకపోయినా తోడబుట్టిన వారికి అండగా ఉన్న మరొకరిని బలితీసుకుంది.. అప్పటికే ఇద్దరు కన్నబిడ్డల్ని పోగొట్టుకుని  వేదనలో ఉన్న తల్లికి అండగా ఉన్న ఒక్క కుమారుడ్ని శాశ్వతంగా దూరం చేసింది...

రామభద్రపురం, సాలూరు, న్యూస్‌టుడే: సాలూరు-రామభద్రపురం 26వ జాతీయ రహదారిపై కొట్టక్కి వంతెన వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. బస్సును తప్పించబోయే క్రమంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు, రామభద్రపురం సీఐ తిరుమలరావు వివరాల మేరకు.. రామభద్రపురం మండలం జన్నివలసకు చెందిన జొన్నాడ పురుషోత్తం (25), గెద్ద రాంప్రసాద్‌, గణేష్‌లు ఒక ద్విచక్ర వాహనంపై సాలూరు నుంచి స్వగ్రామానికి వెళ్తున్నారు. వీరు కొట్టక్కి వంతెన వద్ద సాలూరు పట్టణానికి చెందిన గండుబోయిన యశోద కృష్ణ(25), జి. శ్రీను (47) బైక్‌ను ఢీకొన్నారు. ప్రమాదంలో పురుషోత్తం అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన శ్రీను, యశోదకృష్ణను సాలూరు ప్రాంతీయ ఆసుపత్రికి, రాంప్రసాద్‌, గణేష్‌ను బాడంగి సీహెచ్‌సీకి 108 వాహనాల్లో తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీను, యశోద కృష్ణ మృతి చెందారు. మిగిలిన ఇద్దరిని మెరుగైన వైద్యం కోసం విజయనగరం సర్వజన ఆసుపత్రికి తరలించారు. దీనిపై రామభద్రపురం ఎస్‌ఐ జ్ఞానప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సాలూరు పట్టణ సీఐ, ఎస్‌ఐలు వాసునాయుడు, ఎస్వీ సురేష్‌, సీతారాం, సిబ్బంది క్షతగాత్రులకు సహాయక చర్యలు అందించారు.

మృతదేహంపై పడి రోదిస్తున్న పురుషోత్తం తల్లిదండ్రులు

జీవనాధారం కోల్పోయారు..

జన్నివలస గ్రామానికి చెందిన పురుషోత్తం రాజమండ్రిలోని ఓ సీడ్‌ కంపెనీలో పనిచేస్తూ.. తల్లిదండ్రులు తౌడమ్మ, అప్పారావును పోషిస్తున్నాడు. కుమార్తెకు వివాహం చేయగా.. కుమారుడు ఇంటికి పెద్దదిక్కుగా ఉండేవాడని, ఇంటి దీపం ఆరిపోయిందని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు కంటతడి పెట్టించింది. పురుషోత్తం రాజమహేంద్రవరం నుంచి ఇంటికి బైక్‌పై గురువారం వచ్చాడు. ఆ సమయంలో జన్నివలస గ్రామంలో డీఎస్పీ, సీఐలు రోడ్డు ప్రమాదాలు, ఎన్నికల నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. సాలూరుకు వెళ్లి వస్తానని చెప్పిన పురుషోత్తం మిత్రులతో కలిసి ప్రయాణిస్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సాలూరు పట్టణం గొల్లవీధికి చెందిన అవివాహితుడు యశోద కృష్ణ తల్లిదండ్రులు చనిపోయారు. అక్క, ఇద్దరు సోదరులున్నారు. చికెన్‌ సెంటర్‌లో పనిచేస్తూ కుటుంబానికి సాయంగా ఉండేవాడు. కొద్ది సేపటి ముందే ఇంట్లోని పిల్లలు పానీపూరీ కావాలంటే ఇచ్చి, బయటికి వచ్చాడని.. తమ్ముడిని ఇలా విగతజీవిగా చూస్తామని అనుకోలేదని సోదరి, సోదరులు బోరున విలపించారు.

ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు

ఒంటరిగా మారిన తల్లి

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీనుకు తల్లి సూరమ్మ, ఇద్దరు సోదరులున్నారు. మూడేళ్ల కిందట ఇద్దరు కుమారులు అనారోగ్యంతో చనిపోయారు. ఉన్న ఒక్క కొడుకు శ్రీనును మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో తీసుకుపోయిందని ఆ తల్లి పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. శ్రీను భార్య అతనిని విడిచిపెట్టింది. సున్నం, పెయింటింగ్‌ పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని