logo

కొండెక్కిన కొండలోయ గెడ్డ

కొండలోయగెడ్డ రిజర్వాయర్‌ అర్థాంతరంగా నిలిచిపోవడంతో భామిని ప్రాంత రైతులు గత 17 ఏళ్లుగా నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పొందుపాము, చీకటితోట గెడ్డల నీటిని నిల్వ ఉంచి భామిని ప్రాంతంలో 1000 ఎకరాలకు అందించాలనే లక్ష్యంతో కొండలోయ గెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు.

Published : 30 Mar 2024 02:49 IST

బీడుగా వందలాది ఎకరాలు

జలాశయం పనులు ఇలా మధ్యలో నిలిచిపోయాయి

భామిని, న్యూస్‌టుడే: కొండలోయగెడ్డ రిజర్వాయర్‌ అర్థాంతరంగా నిలిచిపోవడంతో భామిని ప్రాంత రైతులు గత 17 ఏళ్లుగా నీటి కోసం నానా కష్టాలు పడుతున్నారు. పొందుపాము, చీకటితోట గెడ్డల నీటిని నిల్వ ఉంచి భామిని ప్రాంతంలో 1000 ఎకరాలకు అందించాలనే లక్ష్యంతో కొండలోయ గెడ్డ రిజర్వాయర్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు చేశారు. 2006లో జలయజ్ఞంలో భాగంగా రూ.3.30 కోట్ల నిధులు మంజూరు చేయడంతో దశాబ్దాల కల నెరవేరుతుందని రైతులు ఎంతో సంబరపడ్డారు. 2007లో 72 ఎకరాల భూసేకరణ చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ పనులు సుమారు 45 శాతం పూర్తి కాగా రూ.1.73 కోట్లు ఖర్చు అయిందని జల వనరుల శాఖ అధికారులు తెలిపారు. 2007లో వేసిన అంచనాల మేరకు నిధులు సరిపోవని నీటి పారుదల శాఖ అధికారులు 2018లో రూ.9.95 కోట్లకు పెంచి గత తెదేపా ప్రభుత్వం హయాంలో పంపగా పరిపాలన ఆమోదం వచ్చింది. అనంతరం పనులకు సంబంధించి టెండర్లు పిలిచారు. ఈలోగా ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారింది.

పొందుపాము, చీకటి తోట గెడ్డలకు ఎగువ రిజర్వాయర్‌ గట్టు అరకొరగా నిర్మించి విడిచిపెట్టడంతో ఆయా గెడ్డలు ఎండిపోయాయి. రిజర్వాయర్‌తో సమృద్ధిగా నీరు అందాల్సింది పోయి ఉన్న నీరు కాస్తా దూరమై కొత్త కష్టాలు ఉత్పన్నమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని వంశధార వరద కట్టల విభాగం డీఈఈ బాబ్జీ తెలిపారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని