logo

జగన్‌ దగాతో రైతు బేజారు!

గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు.

Published : 19 Apr 2024 03:50 IST

గత ప్రభుత్వం రూ.36లక్షల నిధులతో సాలూరులోని దండిగాం రోడ్డులో రైతు బజారు నిర్మించింది. ఈ ప్రభుత్వం ఏర్పాటయ్యాక, అంతకుముందు ప్రారంభ కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటి వరకు ఒక్క దుకాణం కూడా ఏర్పాటు చేయలేదు. ఫిష్‌ ఆంధ్రాకు దుకాణం కేటాయించినా అదీ తెరచుకోలేదు. ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.

రైతు పండించిన ప్రతి గింజా కొంటాం.. గిట్టుబాటు ధర కల్పిస్తాం.. ధరల స్థిరీకరణకు నిధి ఏర్పాటు చేస్తాం.. అంటూ ప్రతి సమావేశాలోనూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన జగన్‌ అయిదేళ్ల పాలనలో అన్నదాతలకు చేసిందేమీ లేదు. రైతులు కూరగాయల పంటలు విక్రయించేందుకు ఏర్పాటు చేయదలచిన రైతుబజార్ల నిర్మాణాలన్నీ  అటకెక్కించేశారు. అయిదేళ్లలో ఒక్కటీ నిర్మించలేదు.

న్యూస్‌టుడే, సాలూరు, పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, బొబ్బిలి: అన్నదాతకు మద్దతు ధరతోపాటు ప్రజలకు నాణ్యమైన కూరగాయలు అందించే లక్ష్యంతో పాతికేళ్ల కిందట అప్పటి తెదేపా హయాంలో గొప్ప ఆశయానికి శ్రీకారం చుట్టారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో రైతుబజార్లు ఏర్పాటు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చాక వీటిని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 మాత్రమే నిర్వహిస్తున్నారు. మిగిలిన చోట్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు అలాగే ఉన్నాయి. దీంతో రైతులు ఎండ, వానలకు ఇబ్బంది పడుతూ రోడ్లపైనే కూరగాయలను విక్రయిస్తున్నారు. దళారుల బారిన పడి నష్టపోతున్నారు. ఈ బజార్ల ఏర్పాటుకు ఒక్కోచోట ఒక్కో సమస్య నెలకొంది. కొన్నిచోట్ల ప్రతిపాదనల్లో కదలిక లేకపోగా, నిధులు, స్థలం ఉన్నచోట్ల నిర్మించడం లేదు, మరికొన్ని చోట్ల స్థలం కూడా కేటాయించని పరిస్థితి.

బొబ్బిలిలో ప్రధాన రహదారిపై కూరగాయల విక్రయాలు

ఎక్కడెక్కడ ఎలా...

  • పాలకొండలో రైతుబజారు ఏర్పాటుకు నాగవంశంవీధి కూడలి వద్ద డీసీఎంఎస్‌ స్థలాన్ని కేటాయించారు. రెండేళ్ల కిందట శంకుస్థాపన చేసినా నేటికీ పనులు ప్రారంభించ లేదు. లీజుకు మాత్రమే స్థలం ఇస్తున్నట్లు డీసీఎంఎస్‌ సంస్థ అధికారులు చెబుతుండగా, మార్కెటింగ్‌ శాఖకు ప్రభుత్వ స్థలం ఉచితంగా అందించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో పనులు నిలిచిపోయాయి. జిల్లాలోనే కూరగాయల సాగు చేసే రైతులు ఈ ప్రాంతంలోనే అధికం వారంతా నష్టపోతున్నారు.
  • విజయనగరంలో మరో రెండు చోట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా అంగీకారం రాలేదు.
  • చీపురుపల్లి, గరివిడిల్లో మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో రెండేళ్ల కిందట పనులు ప్రారంభించారు. అవి పునాదుల్లోనే నిలిచిపోయాయి. భోగాపురంలో స్థలం కోసం మార్కెటింగుశాఖ అధికారులు స్థలం కోసం నివేదించినా కొలిక్కి రాలేదు.
  • వీరఘట్టంలో మినీ రైతుబజారు ఏర్పాటుకు ఏళ్ల కిందటే ప్రతిపాదనలు చేశారు. దీని నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరయ్యాయి. మార్కెట్‌ యార్డులో ఇందుకోసం స్థలం పరిశీలించారు. పనులు కార్యరూపం దాల్చక పోవడంతో రోడ్డుపక్కనే రైతులు పంట అమ్ముకుంటున్నారు.  
  • ఐటీడీఏ కేంద్రం సీతంపేట అతి పెద్ద గిరిజన మండలం. కూరగాయలు, అరటి, పెండలం, గుమ్మడి, మునగ, ఇతర గిరిజనోత్పత్తులు అధికంగా పండిస్తారు. అందుకే ఇక్కడ రైతుబజారు ఏర్పాటుకు ప్రతిపాదనలున్నా కార్యరూపం దాల్చలేదు. సీతంపేట, కుసిమి(మల్లి), మర్రిపాడు, దోనుబాయి వారపు సంతలపై రైతులు ఆధారపడుతున్నారు.  
  • బొబ్బిలి మేదరబందలో బజారు ఏర్పాటుకు గతంలో చదును చేశారు. అక్కడ వీలుకాదని వదిలేశారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్సులో ఖాళీ అయిన వసతి గృహానికి చెందిన స్థలంలో ఏర్పాటుకు ప్రతిపాదించగా ఆమోదం లభించలేదు. తాజాగా మార్కెట్ కమిటీ స్థలంలోనే 30 సెంట్లలో ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఆ శాఖ అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు పంపారు.  

దళారులకే అమ్ముకుంటున్నాం.. కూరగాయల రైతులు ఎక్కువ మంది ఉన్న సీతంపేటలో రైతు బజారు లేకపోవడం దారుణం. పంటకు గిట్టుబాటు లేక దళారులకే అమ్ముకుంటున్నాం. ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చినప్పటికీ ధర రావడం లేదు.

సవర సింహాచలం, రైతు, కొత్తగూడ, సీతంపేట మండలం

ఇబ్బందులు పడుతున్నాం... వీరఘట్టంలో దుకాణాలు, మార్కెట్‌ లేక ప్రధాన రహదారిపై కూరగాయలు అమ్ముతున్నాం. రద్దీ ఏర్పడుతుండడంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రమాదకర పరిస్థితుల్లో విక్రయాలు చేస్తున్నాం.

ఎం.భాగ్యలక్ష్మి, విక్రమపురం, వీరఘట్టం మండలం

సేవలందేలా చర్యలు.. రైతు బజారు సేవలు మెరుగు పరిచేందుకు చర్యలు చేపడతాం. సాలూరులో వినియోగంలోకి తెచ్చి, పాలకొండలో పనులు జరిగేలా చూస్తాం.

అశోక్‌కుమార్‌, రవికృష్ణ, ఏడీలు, మార్కెటింగ్‌ శాఖ, పార్వతీపురం మన్యం, విజయనగరం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని