logo

హామీల జగన్మోసం..పనులంటే నిర్లక్ష్యం!

‘మేం అధికారంలోకి వస్తే మడ్డువలస జలాశయం రెండోఫేజ్‌ పూర్తిచేసి, 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అంటూ అయిదేళ్ల కిందట ఊదరగొట్టిన వైకాపా నేతలు ఆ సర్కారు కొలువు దీరిన తరువాత మాత్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది

Published : 24 Apr 2024 04:51 IST

మడ్డువలస ప్రాజెక్టు ఫేజ్‌-2 పనులపై పాలకుల నిర్లక్ష్యం

 న్యూస్‌టుడే, వంగర: ‘మేం అధికారంలోకి వస్తే మడ్డువలస జలాశయం రెండోఫేజ్‌ పూర్తిచేసి, 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాం’ అంటూ అయిదేళ్ల కిందట ఊదరగొట్టిన వైకాపా నేతలు ఆ సర్కారు కొలువు దీరిన తరువాత మాత్రం సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. జిల్లాలో ప్రసిద్ధి చెందిన మడ్డువలస జలాశయంలో సాగునీరు పూర్తిస్థాయిలో ఉన్నా.. వాటిని శివారు గ్రామాలకు అందించడంలో పాలకులు విఫలమయ్యారు. వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రధానమైన ప్రాజెక్టు నుంచి సక్రమంగా నీరు వెళ్తే లక్షలాది మంది రైతుల పొలాల్లో బంగారం పండుతుంది. జలాశయం ప్రస్తుతం నిర్వహణకు నోచుకోవడం లేదు. గేట్లు దెబ్బతిని నీరు వృథాగా లీకేజీల ద్వారా నాగావళి నదిలోకి పోతోంది. మడ్డువలస ఎడమ కాలువలో గత అయిదు సంవత్సరాలుగా పూర్గిఆ పూడికలతో నిండి మైదానంలా తయారైంది. జలాశయం వద్ద విద్యుత్తు దీపాల ఏర్పాటుకు కూడా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.

విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని వంగర, రేగిడి, సంతకవిటి, జి.సిగడాం మండలాల్లో వేల ఎకరాల్లో సాగునీరు అందించేందుకు రెండు దశాబ్దాల కిందట ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.  గరిష్ఠ నీటిమట్టం 65 మీటర్లు. 700 క్యూసెక్కుల నీరు కాలువల ద్వారా విడుదల చేస్తే పంట పొలాలకు చేరుతుంది. ఇందుకోసం 11 ప్రధాన గేట్లు ఏర్పాటు చేశారు. తొలి దశలో 50.5 కి.మీ. పరిధిలో కుడికాలువ, 2 కి.మీ. మేర ఎడమ కాలువ ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రస్తుతం సుమారు మొదటి, రెండో దశల్లో 30 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. రెండో దశలో పనులు పూర్తికాకపోవడంతో జి.సిగడాంలో పలు గ్రామాలతో పాటు పొందూరు, ఎచ్చెర్ల, లావేరు మండలాల్లోని వేలాది ఎకరాలకు సాగునీరు సరఫరా చేసేందుకు మరో 7 కి.మీ. కాలువ తవ్వుతున్నారు. ఈ  ప్రక్రియ కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది.  

ఫేజ్‌-2 సగంలోనే..

గత ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన పాలకులు మడ్డువలస ఫేజ్‌-2 పనులను తాము పూర్తిచేసి సుమారు 37 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం మొదటి దశలో వంగర, రేగిడి, సంతకవిటి, పొందూరు, జి.సిగడాం మండలాల్లో మొత్తం 24,877 ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా.. రెండో దశలో ప్రస్తుతం 5,200 ఎకరాలకు లావేరు మండలానికి మాత్రమే సాగునీరు అందిస్తున్నారు. రెండో దశ పనులు పూర్తయితే ఎచ్చెర్లలో 1,317 ఎకరాలు, జి.సిగడాం మండలంలో 536, పొందూరులో 5,173, లావేరులో 5,474 ఎకరాలతో మొత్తం 12,500 ఎకరాలకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి ఉంది. నాలుగేళ్ల కిందటే పనులు పూర్తికావలసి ఉన్నప్పటికీ రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో  పొందూరు మండలం వద్ద పనులు సగంలో నిలిపివేశారు.

పర్యవేక్షణ కరవు

ప్రస్తుతం జలాశయానికి ఉన్న 11 గేట్లలో 1, 2, 3, 5, 6, 10, 11 గేట్ల వద్ద రబ్బర్‌ సీల్‌ దెబ్బతినడంతో నీరు వృథాగా పోతోందని గతంలో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు స్పందించి అధికారులు రూ.1.80 కోట్లు మంజూరు చేయిస్తే గత ఏడాది కొన్ని పనులు మాత్రమే చేశారు. 1, 2, 3 గేట్లకు రబ్బర్‌ సీళ్లు ఏర్పాటు చేశారు. 5, 6, 10, 11 గేట్లకు రబ్బర్‌ సీళ్లు ఏర్పాటు చేయకపోవడంతో సాగునీరు వృథాగా పోతోంది. జలాశయంలో 11 గేట్లకు 44 రోప్‌లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొత్తగా 30 మాత్రమే మార్చారు. వీటి మరమ్మతులకు ఆ నిధులనే వెచ్చించారు. ఖరీఫ్‌ సీజన్‌ వచ్చేయడంతో పనులు  సగంలో వదిలేశారు. 50 విద్యుత్తు బల్బులు ఏర్పాటు చేయకపోవడంతో మొండి స్తంభాలే కనిపిస్తున్నాయి.

పూడికతీత చర్యలేవీ?

ఎడమ కాలువలో పూడికలు తీయకపోవడంతో సంగాం, మగ్గూరు, ఓని అగ్రహారం గ్రామాల శివారు భూములకు సాగు నీరు అందడం లేదు. దీంతో ఏటా పంటలు నష్టపోతున్నాం. నీటిపారుదలశాఖ అధికారులు స్పందించి కాలువల్లో పూడికలు తీయించేందుకు చర్యలు చేపట్టాలి.     

  - ఎం.శ్రీనివాసరావు, రైతు, ఓనిఅగ్రహారం


 మే నెలలో తిరిగి ప్రారంభిస్తాం

మరమ్మతులు ప్రారంభమైన కొన్ని రోజులకే ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో పనులు సగంలో నిలిపివేశాం. రబీ సీజన్‌ ముగిసిన నేపథ్యంలో మే నెలలో మిగతా పనులు కొనసాగిస్తాం. కాలువలో పూడిక తీత పనులకు రూ.2.5 లక్షలు మంజూరైనా గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో ప్రారంభం కాలేదు.   

 - పి.అర్జున్‌, డీఈఈ, మడ్డువలస జలాశయం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని